మహనీయుల బాల్యం
ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని స్థాపించి బ్రిటీషర్ల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకసారి కటక్ నగరంలో దాని చుట్టుపక్కల గ్రామాలలో భయంకరమైన కలరా వ్యాధి వేగంగా వ్యాపించింది. ఆ రోజుల్లో కలరా వస్తే వందల మంది చనిపోయేవారు. ఆ సమయంలో హైస్కూల్ చదువుతున్న సుభాష్ చంద్రబోస్ చూస్తూ ఊరికే కూర్చోలేదు. తన క్లాస్ స్నేహితులను కొందరిని పోగు చేసి ఒక చిన్న ’సేవా దళం’గా ఏర్పడ్డారు.
ఇంట్లో వాళ్లకు చెబితే ఎక్కడ అడ్డుకుంటారోనని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా కలరా వ్యాధి సోకిన పేద ప్రజలు ఉండే బస్తీలకు, గ్రామాలకు వెళ్లారు. అక్కడ రోగంతో బాధపడుతున్న రోగులకు స్వయంగా మందులు ఇవ్వడం, వారికి సపర్యలు చేయడం, వారి ఇళ్లను శుభ్రం చేయడం వంటి పనులను ప్రాణాలకు తెగించి చేశారు. సుభాష్ చంద్రబోస్ 1909 నుండి కటక్‌లోని రావెన్ షా కొలీజియెట్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. గొప్పవాళ్లు చిన్నప్పుడే గొప్ప పనులు చేస్తారని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.


