నాటి బికినీల పోటీ.. నేటి మిస్‌ వరల్డ్‌! | Miss world special story | Sakshi
Sakshi News home page

నాటి బికినీల పోటీ.. నేటి మిస్‌ వరల్డ్‌!

May 7 2025 12:18 AM | Updated on May 7 2025 5:59 PM

Miss world special story

తొలి మిస్ట్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్న హకాన్‌సన్‌

‘అద్భుతాలు కేవలం అనుకుంటే జరగవు. పరిస్థితులే వాటిని సృష్టిస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ... మిస్‌ వరల్డ్‌పోటీలు. బికినీలపోటీ కాస్తా ‘మిస్‌ వరల్డ్‌’ పోటీ అయింది. ‘అనూహ్యమైన స్పందన ఒకవైపు–వివాదాలు ఒకవైపు’... ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది...

రెండవ ప్రపంచ యుద్ధం (World War II) తరువాత యూరప్‌ మెల్లగా కోలుకొని పుంజుకోవడం మొదలైంది. బ్రిటన్‌లో ప్రజలు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. 1851 నాటి గ్రేట్‌ ఎగ్జిబిషన్‌ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారైంది.

1951లో...
‘ఫెస్టివల్‌ ఆఫ్‌ బ్రిటన్‌’ ఉత్సవాల్లో భాగంగా బ్రిటిష్‌ టెలివిజన్‌ ప్రెజెంటర్‌ ఎరిక్‌ మోర్లే ‘బికినీ కంటెస్ట్‌’ నిర్వహణ బాధ్యతను తలకెత్తుకున్నాడు. సైన్యంలో పనిచేసిన మోర్లే ఆ తరువాత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలోకి వచ్చాడు. పోటీకోసం డజన్‌ దేశాలకు ఆహ్వానం పంపాడు. ఉత్తరాలు రాశాడు. ఫోన్‌ కాల్స్‌ చేశాడు. అయితే అయిదు దేశాల నుంచి మాత్రమే మోర్లేకు ‘ఓకే’ అంటూ జవాబు వచ్చింది.

అప్పటికే సమయం మించిపోయింది. మోర్లే ఎదుర్కొన్న ప్రధాన అభ్యంతరాలలో ఒకటి బికినీలు ధరించడం గురించి.పోటీలోపాల్గొనడానికి రిజిస్ట్రేషన్‌ ఫీజులు లేవు. బరిలోకి దిగేవారు అవివాహితులు కావచ్చు. వివాహితులు కావచ్చు. విడాకులు తీసుకొని ఉండవచ్చు. పిల్లలు ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు!

కుదరదంతే...
పోటీలోపాల్గొన్నప్పటికీ తమ భర్తల అభ్యంతరం కారణంగా పర పురుషుల ముందు బికినీలలో కనిపించడానికి ముగ్గురు మహిళలు నిరాకరించారు. వీరి నిరాకరణ మాట ఎలా ఉన్నా.. లండన్‌లోని లైసియం బాల్‌రూమ్‌లో జరిగిన ఫైనల్‌ క్వాలిఫికేషన్‌ కోసం జడ్జీల ముందు 27 మంది మహిళలు బికినీలతో పోటీలో పాల్గొన్నారు.

పేరు మారిందోచ్‌!
బికినీల పోటీ బ్రిటిష్‌ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈపోటీ అధికారిక పేరు ‘ఫెస్టివల్‌ బికినీ కంటెస్ట్‌’ అయినప్పటికీ మీడియా ఈపోటీకి ‘మిస్‌ వరల్డ్‌’ అని నామకరణం చేసింది. ‘ఫెస్టివల్‌ బికినీ కంటెస్ట్‌’ కాస్తా ‘మిస్‌ వరల్డ్‌’గా రీబ్రాండింగ్‌ అయింది. అప్పట్లో బికినీని అమానవీయంగా భావించేవారు. ‘ఇలాంటి పోటీలు ఏంటీ!’ అని విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల సంగతి ఎలా ఉన్నా... ఈపోటీలో స్వీడన్‌కు చెందిన ‘కికి’  కెర్‌స్టిన్‌ హకాన్‌సన్‌ (Kiki Haakinson) విజేతగా నిలిచింది. ఆమె మొదటి మిస్‌ వరల్డ్‌.

అలా మొదలైంది...
ఈ పోటీని మొదట వన్‌–టైమ్‌ ఈవెంట్‌గా అనుకున్నప్పటికీ అనూహ్యమైన స్పందన చూసిన తరువాత దీనిని వార్షిక పోటీగా చేయాలని నిర్ణయించుకున్నారు.
కొద్దికాలం తరువాత మిస్‌ వరల్డ్‌ ట్రేడ్‌మార్క్‌ అయింది. ‘బికినీ రౌండ్‌’ కారణంగా కొన్ని దేశాలు ఈ పోటీలోపాల్గొనడానికి నిరాకరించాయి. ఒకవైపు ఈపోటీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది. మరోవైపు వివాదాలు అదే స్థాయిలో పెరిగాయి. వివాదాలు లేకుండా ఈ పోటీ జరగడం అనేది అసాధ్యం అయింది.

మిస్‌ వరల్డ్‌ వేదిక... ఉత్తుత్తి బాంబుల మోత!
1970లో జరిగిన ‘మిస్‌ వరల్డ్‌’ పోటీ సంచలనాత్మకంగా మారింది. పోటీ ఫైనల్‌లో ఫెమినిస్ట్‌ కార్యకర్తల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. లండన్‌ రాయల్‌ ఆల్బర్ట్‌లో జరిగిన లైవ్‌ ఈవెంట్‌లో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కుళ్లిపోయిన పండ్లు, కూరగాయలే కాదు ఫ్లోర్‌ బాంబులు వచ్చిపడ్డాయి. ‘మాకు కోపంగా ఉంది’ అని అరిచి, రకరకాల నినాదాలు ఇచ్చారు ఫెమినిస్ట్‌ కార్యకర్తలు.

ఫస్ట్‌ మిస్‌ వరల్డ్‌... హకాన్‌సన్‌
ఫస్ట్‌ మిస్‌ వరల్డ్‌ ‘కికి’ హకాన్‌సన్‌ గత సంవత్సరం కాలిఫోర్నియాలో మరణించింది. అప్పటికి ఆమె వయసు 94 సంవత్సరాలు. స్వీడన్‌లో పుట్టిన హకాన్‌సన్‌ 1951లో ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. హకాన్‌సన్‌ బికినీ ధరించడాన్నిపోప్‌ ఖండించారు. యూరప్‌లో మోడలింగ్‌ వృత్తిని కొనసాగించిన హకాన్‌సన్‌ ఎన్నో అందాల పోటీలకు జడ్జీగా వ్యవహరించింది. అమెరికన్‌ శిల్పి డల్లాస్‌ అండర్సన్‌ను పెళ్లి చేసుకుంది. కోపెన్‌ హాగన్‌లో తొమ్మిది సంవత్సరాలు ఉన్న తరువాత వారు యూనైటెడ్‌ స్టేట్స్‌కు వెళ్లారు. మిస్‌ వరల్డ్‌కు ముందు ‘ది ప్రెటియెస్ట్‌ గర్ల్‌ ఇన్‌ స్వీడన్‌’ టైటిల్‌ గెలుచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement