Trivia
-
నాటి బికినీల పోటీ.. నేటి మిస్ వరల్డ్!
‘అద్భుతాలు కేవలం అనుకుంటే జరగవు. పరిస్థితులే వాటిని సృష్టిస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ... మిస్ వరల్డ్పోటీలు. బికినీలపోటీ కాస్తా ‘మిస్ వరల్డ్’ పోటీ అయింది. ‘అనూహ్యమైన స్పందన ఒకవైపు–వివాదాలు ఒకవైపు’... ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది...రెండవ ప్రపంచ యుద్ధం (World War II) తరువాత యూరప్ మెల్లగా కోలుకొని పుంజుకోవడం మొదలైంది. బ్రిటన్‌లో ప్రజలు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. 1851 నాటి గ్రేట్ ఎగ్జిబిషన్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారైంది.1951లో...‘ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్’ ఉత్సవాల్లో భాగంగా బ్రిటిష్ టెలివిజన్ ప్రెజెంటర్ ఎరిక్ మోర్లే ‘బికినీ కంటెస్ట్’ నిర్వహణ బాధ్యతను తలకెత్తుకున్నాడు. సైన్యంలో పనిచేసిన మోర్లే ఆ తరువాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. పోటీకోసం డజన్ దేశాలకు ఆహ్వానం పంపాడు. ఉత్తరాలు రాశాడు. ఫోన్ కాల్స్ చేశాడు. అయితే అయిదు దేశాల నుంచి మాత్రమే మోర్లేకు ‘ఓకే’ అంటూ జవాబు వచ్చింది.అప్పటికే సమయం మించిపోయింది. మోర్లే ఎదుర్కొన్న ప్రధాన అభ్యంతరాలలో ఒకటి బికినీలు ధరించడం గురించి.పోటీలోపాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు. బరిలోకి దిగేవారు అవివాహితులు కావచ్చు. వివాహితులు కావచ్చు. విడాకులు తీసుకొని ఉండవచ్చు. పిల్లలు ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు!కుదరదంతే...పోటీలోపాల్గొన్నప్పటికీ తమ భర్తల అభ్యంతరం కారణంగా పర పురుషుల ముందు బికినీలలో కనిపించడానికి ముగ్గురు మహిళలు నిరాకరించారు. వీరి నిరాకరణ మాట ఎలా ఉన్నా.. లండన్‌లోని లైసియం బాల్రూమ్లో జరిగిన ఫైనల్ క్వాలిఫికేషన్ కోసం జడ్జీల ముందు 27 మంది మహిళలు బికినీలతో పోటీలో పాల్గొన్నారు.పేరు మారిందోచ్!బికినీల పోటీ బ్రిటిష్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈపోటీ అధికారిక పేరు ‘ఫెస్టివల్ బికినీ కంటెస్ట్’ అయినప్పటికీ మీడియా ఈపోటీకి ‘మిస్ వరల్డ్’ అని నామకరణం చేసింది. ‘ఫెస్టివల్ బికినీ కంటెస్ట్’ కాస్తా ‘మిస్ వరల్డ్’గా రీబ్రాండింగ్ అయింది. అప్పట్లో బికినీని అమానవీయంగా భావించేవారు. ‘ఇలాంటి పోటీలు ఏంటీ!’ అని విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల సంగతి ఎలా ఉన్నా... ఈపోటీలో స్వీడన్‌కు చెందిన ‘కికి’ కెర్స్టిన్ హకాన్సన్ (Kiki Haakinson) విజేతగా నిలిచింది. ఆమె మొదటి మిస్ వరల్డ్.అలా మొదలైంది...ఈ పోటీని మొదట వన్–టైమ్ ఈవెంట్‌గా అనుకున్నప్పటికీ అనూహ్యమైన స్పందన చూసిన తరువాత దీనిని వార్షిక పోటీగా చేయాలని నిర్ణయించుకున్నారు.కొద్దికాలం తరువాత మిస్ వరల్డ్ ట్రేడ్‌మార్క్ అయింది. ‘బికినీ రౌండ్’ కారణంగా కొన్ని దేశాలు ఈ పోటీలోపాల్గొనడానికి నిరాకరించాయి. ఒకవైపు ఈపోటీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది. మరోవైపు వివాదాలు అదే స్థాయిలో పెరిగాయి. వివాదాలు లేకుండా ఈ పోటీ జరగడం అనేది అసాధ్యం అయింది.మిస్ వరల్డ్ వేదిక... ఉత్తుత్తి బాంబుల మోత!1970లో జరిగిన ‘మిస్ వరల్డ్’ పోటీ సంచలనాత్మకంగా మారింది. పోటీ ఫైనల్లో ఫెమినిస్ట్ కార్యకర్తల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. లండన్ రాయల్ ఆల్బర్ట్‌లో జరిగిన లైవ్ ఈవెంట్లో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కుళ్లిపోయిన పండ్లు, కూరగాయలే కాదు ఫ్లోర్ బాంబులు వచ్చిపడ్డాయి. ‘మాకు కోపంగా ఉంది’ అని అరిచి, రకరకాల నినాదాలు ఇచ్చారు ఫెమినిస్ట్ కార్యకర్తలు.ఫస్ట్ మిస్ వరల్డ్... హకాన్సన్ఫస్ట్ మిస్ వరల్డ్ ‘కికి’ హకాన్సన్ గత సంవత్సరం కాలిఫోర్నియాలో మరణించింది. అప్పటికి ఆమె వయసు 94 సంవత్సరాలు. స్వీడన్లో పుట్టిన హకాన్సన్ 1951లో ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. హకాన్సన్ బికినీ ధరించడాన్నిపోప్ ఖండించారు. యూరప్‌లో మోడలింగ్ వృత్తిని కొనసాగించిన హకాన్సన్ ఎన్నో అందాల పోటీలకు జడ్జీగా వ్యవహరించింది. అమెరికన్ శిల్పి డల్లాస్ అండర్సన్‌ను పెళ్లి చేసుకుంది. కోపెన్ హాగన్‌లో తొమ్మిది సంవత్సరాలు ఉన్న తరువాత వారు యూనైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. మిస్ వరల్డ్‌కు ముందు ‘ది ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ స్వీడన్’ టైటిల్ గెలుచుకుంది. -
గోళ్ల గురించి గోరంత....
ట్రివియా ⇒ మన చేతి గోళ్లు నెల్లాళ్లలో సగటున 3.5 మిల్లీమీటర్ల మేరకు పెరుగుతాయి. చేతి గోళ్లతో పోలిస్తే కాలి గోళ్లు నెమ్మదిగా పెరుగుతాయి. కాలి గోళ్లు నెల్లాళ్లలో 1.6 మిల్లీమీటర్ల మేరకు మాత్రమే పెరుగుతాయి. శీతాకాలంలో కంటే వేసవిలో గోళ్లు కాస్త వేగంగా పెరుగుతాయి. ⇒ మహిళల కంటే పురుషుల గోళ్లు కాస్త వేగంగా పెరుగుతాయి. అయితే, గర్భం దాల్చినప్పుడు మహిళల్లో గోళ్ల పెరుగుదల వేగం పుంజుకుంటుంది. ⇒ గోళ్లు పెరిగే క్రమంలో వాటిపై అప్పుడప్పుడు తెల్లని మచ్చలు కనిపిస్తుంటాయి. ⇒ గోళ్లపై తెల్లమచ్చలు క్యాల్షియం లోపానికి సంకేతంగా చాలా మంది చెబుతారు. అయితే అది అపోహ మాత్రమే. గోళ్లపై తెల్లమచ్చల వల్ల ఎలాంటి హాని ఉండదు. ⇒ వెంట్రుకలు, గోళ్లు కెరాటిన్ అనే ఒకే రకమైన పదార్థం వల్ల పెరుగుతాయి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల జుట్టు, గోళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. ⇒ చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఆందోళన కారణంగా చాలామంది అసంకల్పితంగానే గోళ్లు కొరుకుతారు. పది నుంచి పద్దెనిదేళ్ల వయసు గల వారిలో దాదాపు సగం మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ⇒ గోళ్లను నిశితంగా పరిశీలిస్తే ఆరోగ్య లోపాలను ఇట్టే తెలుసుకోవచ్చు. గోళ్లు కాస్త నీలిరంగులోకి మారితే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నట్లు లెక్క. తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లు. గోళ్లు సహజమైన రంగు కోల్పోయినా, గోళ్లపై గోధుమ రంగు మచ్చలు కనిపించినా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది. ⇒ చర్మవ్యాధుల్లో దాదాపు పదిశాతం గోళ్లకు సంబంధించినవే ఉంటాయి. పిల్లలు, యువకుల కంటే వయసు మళ్లిన వారిలోనే గోళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. -
తుమ్మితే రాలిపోని విషయాలు
ట్రివియా ⇒ ముక్కు. ఊపిరి తీసుకోవడానికి, వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. ముఖసౌందర్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మనుషుల ముక్కుల్లో ప్రధానంగా పదిహేడు రకాలు ఉన్నట్లు ఒక తాజా సర్వేలో తేలింది. ⇒ మనుషుల్లో పదేళ్ల వయసు వచ్చేసరికి ముక్కు తన పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, పురుషుల్లో 17-19 ఏళ్లు, మహిళల్లో 15-17 ఏళ్ల వరకు ముక్కు ఎదుగుదల కొనసాగుతుంది. ⇒ మనుషులు కనీసం పదివేలకు పైగా వాసనలను గుర్తించగలరు. ⇒ మనుషుల ముక్కులో ఆఘ్రాణశక్తిని ఇచ్చే కణాలు దాదాపు 1.20 లక్షల వరకు ఉంటాయి. అయితే, అందరి ఘ్రాణశక్తి ఒకేలా ఉండదు. ⇒ ఎలాంటి వాసనలను గుర్తించలేని పరిస్థితిని ‘అనోస్మియా’ అని, స్వల్పస్థాయిలోని వాసనలను సైతం గుర్తించగల శక్తిని ‘హైపరోస్మియా’ అని అంటారు. ⇒ పురుషుల కంటే మహిళల్లోనే ఘ్రాణశక్తి ఎక్కువ. పసిపిల్లల్లోనూ ఘ్రాణశక్తి ఎక్కువగానే ఉంటుంది. పసిపిల్లలు వాసన ఆధారంగా తల్లులను గుర్తించగలుగుతారు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో ఘ్రాణశక్తి క్రమంగా క్షీణిస్తుంది.. ⇒ కేవలం ముక్కుతోనే ఉపాధి పొందే వాళ్లు కూడా ప్రపంచంలో లేకపోలేదు. ఘనమైన ఘ్రాణశక్తి గల వారికి మద్యం ఉత్పత్తి సంస్థలు, పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థల్లో ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగులు తమ ముక్కులకు బీమా చేయించుకుంటారు. ఇల్జా గోర్ట్ అనే డచ్ వైన్మేకర్ తన ముక్కును 80 లక్షల డాలర్లకు ఇన్సూర్ చేయించాడు. ⇒ ముక్కుకు ఎంతటి ఆఘ్రాణశక్తి ఉన్నా, ఇంధనంగా వాడే సహజ వాయువు ఉనికిని పసిగట్టలేదు. దీనివల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉండటంతో గ్యాస్ కంపెనీలు ఇందులో వాసన కలిగించే పదార్థాన్ని కలుపుతారు. -
కురులు... వివరాల విరులు
ట్రివియా అరచేతులు, అరికాళ్లు, పెదవులు, మ్యూకస్ పొరలు తప్ప శరీరంలోని మిగిలిన అన్ని భాగాల్లోనూ వెంట్రుకలు పెరుగుతాయి. ఎముకల్లోని మూలగ తర్వాత అత్యంత వేగంగా పెరిగే కణజాలం జుట్టు మాత్రమే. మనిషి తలపై సగటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. తల వెంట్రుకల్లో 90 శాతం పెరుగుతూ ఉంటే, 10 శాతం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. తలపై లక్ష వరకు ఉండే వెంట్రుకల్లో రోజూ వంద వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. పురుషుల్లో సగం మందికి యాభయ్యేళ్ల లోపు వయసులోనే బట్టతల వస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల, ఐరన్ లోపం వల్ల తాత్కాలికంగా తలపై వెంట్రుకలు పలచబడతాయి. అలాగే, కొన్ని రకాల ఔషధాల ప్రభావం వల్ల కూడా తల వెంట్రుకలు గణనీయంగా రాలిపోతాయి. వెంట్రుకల ఆయుర్దాయం మూడు నుంచి ఏడేళ్లు. పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుడ్లు, చేపలు, లివర్, కిడ్నీలు, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడతాయి.జుట్టులోని పిగ్మెంట్స్ కారణంగానే జుట్టుకు రంగు ఏర్పడుతుంది. వయసు మళ్లే దశలో పిగ్మెంట్స్ తగ్గడం కారణంగా జుట్టు నెరుస్తుంది.వెంట్రుకలు గరిష్టంగా 90 సెం.మీ. వరకు పెరుగుతాయి. ఏడాది వ్యవధిలో వెంట్రుకల పెరుగుదల 12 సెం.మీ. వరకు ఉంటుంది. -
మన పాదాలకు ఓ నమస్కారం!
ట్రివియా ఒక సాధారణ వ్యక్తి తన జీవితకాలంలో నడిచే సగటు దూరం 1,28,000 కిలోమీటర్లు. అంటే అతడి అడుగులన్నింటినీ లెక్కేస్తే అతడు తన జీవితకాలంలో భూమిని మూడుసార్లు చుట్టి వస్తాడన్నమాట. ఒకరి జీవితకాలంలో అతడి పాదాలు మోసే మొత్తం బరువు 1,000 టన్నులుంటుంది. మన పాదాల సైజు ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి 5-10 శాతం పెరుగుతుంది. మనం శరీరంలోని అన్ని ఎముకల్లో నాలుగోవంతు మన పాదాలలోనే ఉంటాయి. మన రెండు పాదాలలో కలిపి 52 ఎముకలుంటాయి. మన రెండు పాదాలు సమానంగా ఉండటం చాలా అరుదు.పురుషులకు వచ్చే పాదాల సమస్యలతో పోలిస్తే... మహిళలకు వచ్చే పాద సంబంధ సమస్యలు నాలుగురెట్లు ఎక్కువ. వాళ్లు తొడిగే హైహీల్స్ చెప్పులే ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. పురుషుల్లో పాదాలను తొలగించే పరిస్థితి ఎక్కువగా సిగరెట్ వల్లనే వస్తోంది. సిగరెట్ అలవాటు ఉన్నవారిలో పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ అనే వ్యాధి వల్ల పాదాలకు రక్తప్రసారం చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, పాదం కుళ్లి (గ్యాంగ్రీన్ వచ్చి) పాదాలను తొలగించాల్సి వస్తోంది. చాలారకాలమైన వైద్య సమస్యలు పాదాలలో కనిపించే లక్షణాలతోనే బయట పడతాయి. ఉదాహరణకు డయాబెటిస్, ఆర్థరైటిస్, రక్తప్రసరణ సమస్యల వంటివి.