హాట్సాఫ్‌ డాక్టర్‌ ! క్షణం ఆలస్యమైనా.! | Meet Dr. Raghava Sharma From guntur who showed humanity | Sakshi
Sakshi News home page

హాట్సాఫ్‌ డాక్టర్‌ ! క్షణం ఆలస్యమైనా.!

Jun 17 2025 1:49 PM | Updated on Jun 17 2025 3:26 PM

Meet Dr. Raghava Sharma  From guntur who showed humanity

మానవత్వం చాటుకున్న డాక్టర్‌ రాఘవ శర్మ

నిడమానూరు బైపాస్‌లో రోడ్డులో ప్రమాదం

తీవ్ర గాయాలతో పడిఉన్న వ్యక్తి

వెంటనే భుజాలపై తీసుకుని కారులోకి తీసుకెళ్లిన డాక్టర్‌

ప్రమాదం నుంచి బయటపడిన బాధితుడు

గుంటూరు మెడికల్‌ : ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయం.. నిడమానూరు బైపాస్‌.. రాత్రి పూట చిమ్మ చీకట్లో నెత్తుటి మడుగులో స్పృహ లేకుండా పడిఉన్న భర్తను చూసి ఆమె గుండెలు బాదుకుంటోంది. అయ్యా.. కాపాడండి! అంటూ కన్నీరుమున్నీరవుతోంది. అప్పటికే కొన్ని వందల వాహనాలు అటు ఇటు పరుగులు పెడుతున్నా ఆగలేదు. ఇంతలో గుంటూరుకు చెందిన సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, లలితా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ పి.వి.రాఘవశర్మ గన్నవరం నుంచి గుంటూరు వస్తున్నారు. 

రోడ్డు పక్కన దూరంగా పడి ఉన్న బాధితుడు, ఆర్తనాదాలు పెడుతున్న ఆయన భార్య కనిపించారు. వెంటనే కారు ఆపి పరుగు పరుగున అక్కడకు వెళ్లారు. బాధితుడి నాడి పట్టుకున్న వెంటనే మరికొద్ది క్షణాలు మాత్రమే ఊపిరి ఉంటుందని అర్థమైంది. వెంటనే భుజాలపై వేసుకుని ఒక్క ఉదుటున కారు వద్దకు వెళ్లారు. అప్పటి వరకు గుండెల నిండా కన్నీళ్లతో.. అంతులేని దిగులు చీకట్లలో కూరుకుపోయిన ఆ ఇల్లాలు.. వణుకుతున్న తన రెండు చేతులు జోడించి.. అయ్యా దేవుడిలా వచ్చారు! అంటూ దణ్ణం పెట్టింది. వేగంగా బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు. డాక్టర్‌ రాఘవశర్మ మానత్వపు వైద్య సేవలకు అక్కడ ఉన్న ప్రజలు, పోలీసులు ‘హాట్సాఫ్‌ డాక్టర్‌ !’ అంటూ సలాం కొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement