
ఎపుడు ఎలా పనిచేశామన్నది కాదు. సక్సెస్ సాధించామా లేదా అన్నది ముఖ్యం. తమ అభిరుచికి, నైపుణ్యానికి కాస్త పట్టుదల, కృషి జోడిస్తే విజయం మనముందు సాగిలపడుతుంది. దీన్నే అక్షరాలా నిరూపించి చూపించారు కె.ఆర్. భాస్కర్. హోటల్‌లో వెయిటర్‌గా మొదలైన భాస్కర్ ప్రయాణం కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆయన సాధించిన విజయం ఏంటి? కేఆర్ భాస్కర్ స్ఫూర్తి దాయక స్టోరీ గురించి తెలుసుకుందాం.
ఎక్కడైనా రుచి కరమైన టిఫిన్లు, ఆహారం లభిస్తోందంటే ఆహార ప్రియులకు పండగే. ఎంతదూరమైనా వెళ్లి దాని రుచిని ఆస్వాదించాల్సిందే. మళ్లీ మళ్లీ తిని ఆహా..! అనాల్సిందే. అంతేకాదు నలుగురికీ వారి ద్వారా జరిగే మౌత్ పబ్లిసిటీ విజయం తక్కువేమీకాదు. అంతటి మహిమ ఫుడ్ బిజినెస్‌కు ఉంటుంది.
కేఆర్ భాస్కర్ తయారు చేసే బొబ్బట్ల (పూరన్ పోలి) వాసనకే ఆహార ప్రియులు పరవశులైపోతారు. ఆ సువాసన ముక్కు పుటాలకు తాకిన వారెవ్వరూ వాటి రుచి చూడకుండా వదిలిపెట్టరు.కర్ణాటక,మహారాష్ట్రలోని సందడిగా ఉండే వీధుల్లో 'భాస్కర్ పురాన్‌పోలి ఘర్' అలా వేలాది కస్టమర్లను ఆకర్షిస్తుంది. రెండు రాష్ట్రాలలో విస్తరించింది.
ఇదీ చదవండి: 30 డేస్ ఛాలెంజ్ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!
భాస్కర్ కథ స్ఫూర్తి దాయకమైనది. కర్ణాటకలోని కుందాపూర్‌లో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు! అవిశ్రాంత పట్టుదలకు ఓరిమికి నిదర్శనం ఆయన సక్సెస్ జర్నీ. కర్ణాటకలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ రంగంలోకి దిగారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఒక హోటల్‌లో టేబుల్స్ శుభ్రం చేయడం , పాత్రలు కడగడం వంటి పనులు చేసేవాడు. అలా దాదాపు ఐదేళ్లకు పైగా భాస్కర్ వెయిటర్‌గా పనిచేశాడు. ఆ అనుభవమే ఈ వ్యాపారంపై లోతైన అవగాహన కలిగింది. అలాతన జీవితాన్ని మలుపు తిప్పిన వైనాన్ని. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో భాస్కర్ తన విజయగాథను పంచుకున్నారు.

అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు నృత్య బోధకుడిగా పనిచేశాడు. పాన్ షాప్ ఓపెన్ చేశాడు. కానీ పెద్దగా సక్సెస్‌కాలేదు. తన పాక నైపుణ్యంతో ఫుడ్‌బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 23 ఏళ్ల వయసులో తన తల్లి సహకారంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి సైకిల్ మీద వీధుల్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ చిన్న అడుగే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. పురాన్‌పోలి తయారీలో అతని ప్రతిభకు, వాటి టేస్ట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. 'పూరన్ పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' త్వరలోనే నాణ్యత ,అభిరుచికి పర్యాయపదంగా మారింది. కట్ చేస్తే భాస్కర్ సంస్థ కర్ణాటకలోనే 17 అవుట్‌లెట్‌లు,10 కి పైగా ఫ్రాంచైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబంగా ప్రతీ ఎనిమిది నెలలకో అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తాడు. చాలా సాదా సీదాగా వీధి వెంచర్‌గా ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పుడు నెలవారీ ఆదాయాన్ని 18 కోట్లకు పైగా ర్జిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం.. 'పురాన్‌పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' విజయం భాస్కర్ పాక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యాపార చతురతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. రుచిలోనూ, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పట్టుదల ,అంకితభావంతో నిరంతరం అనేక కొత్త ఉత్పత్తులు, కొత్త రుచులతో ఇష్టమైన బ్రాండ్‌గా అవతరించింది. ఇదంతా కె.ఆర్. భాస్కర్ అచంచలమైన సంకల్పశక్తికి నిదర్శనం.
చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!