
ఉదయాన్నే వేడి వేడి కాఫీనో, టీనో తాగాలి. అదీ కాస్త చక్కెర ఎక్కువ వేసుకుంటే భలే మజాగా ఉంటుంది. ఇక అన్నం తినగానే మామిడిపండో, అరటిపండో ఏదో ఒక పండు తినాలి. లేదంటే ఏదో ఒక స్వీట్ లడ్డూనో,పాలకోవా, మైసుర్ పాక్ ఏదో ఒకటి అలా నోటికి తగిలితే భోజనం పూర్తి అయినట్టు. అంతే కాదండోయ్.. టీలో వేస్తూనో, పిల్లలకు పాలు కలుపుతూనో ఒక స్పూన్ నోట్లో వేసుకోవడం గృహిణులు బాగా అలవాటు. ఒక విధంగా చెప్పాలంటే షుగర్ లేని రోజంటూ ఉండదు. నిత్యం ఏదో ఒక రూపంలో చక్కెర బుక్కేస్తూ ఉంటాం. షుగర్ లెస్ టీ అంటూనే, టీలో మైదా, చక్కెర కలిపిన బిస్కట్లు నంజుకుంటాం. అసలు చక్కెర అతిగా తినడం వల్ల అనర్థాల గురించి ఎపుడైనా ఆలోచించారా? ఒక్క నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఎలా ఉంటాయో తెలుసా?
ఇలా నియంత్రణ లేకుండా స్వీట్లు, సోడా, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ రూపంలో నిత్యం మనం చక్కెరను తీసుకుంటూ ఉంటాం. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అధిక చక్కెర వినియోగం ఆరోగ్యంపై వివిధ ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణమవుతుంది. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పేమాట. టైప్ 2 డయాబెటిస్‌తోపాటు, గుండె జబ్బులు, దంత సమస్యలు , మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వరుసగా 30 రోజులు చక్కెరను మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు.
> చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
30 రోజులు చక్కెర వాడకాన్ని మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడుతుంది. లివర్‌లో ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.
ముఖంలో ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది చక్కెరను తగ్గిస్తే ముఖం నాజూగ్గా తయారవుతుంది. ఉబ్బరం , నీరు తగ్గి చక్కటి ముఖం వస్తుంది.
అధిక చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో మంట వస్తుంది. ఒక్క నె లరోజులు దీన్ని నియంత్రిస్తే, ఇది తగ్గుతుంది. అలాగే కళ్లు, కాళ్ళలో వాపు తగ్గుతుంది.
నడుము సన్నగా అవుతుంది. బొడ్డు, కాలేయ కొవ్వు తగ్గుతుంది. కేలరీలు తగ్గి, బరువు తగ్గడానికి, లేదా పెరగకుండా ఉండటానికి దోహద పడుతుంది.
గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చక్కెరను మానేయడం వల్ల గట్ బాక్టీరియా సమతుల్యమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. మొటిమలు , చర్మం ఎర్రబారటం తగ్గి, స్కిన్ ప్రకాశవంతమవుతుంది. దీంతొవృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
ఇదీ చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!
చక్కెరను తగ్గించడానికి చిట్కాలు:
ప్రాసెస్ చేసిన పదార్థాలకు దూరండా ఉండాలి. లేబుల్‌లను జాగ్రత్తగా చదివి తీసుకోవాలి.
చక్కెర బాగా తీసుకోవడం బాగా అలవాటైతే నెమ్మదిగా తగ్గించేందుకు ప్రయత్నించాలి.
చక్కెరను తీసుకోవడం మానేసిన వారిలో తలనొప్పి అలసట, శక్తి స్థాయిలు తగ్గినట్లు అనిపిస్తుంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ,లీన్ ప్రోటీన్లు వంటి ఆహారంపై దృష్టిపెట్టాలి. ప్రత్యామ్నాయ షుగర్ ఉత్పత్తులపై దృష్టిపెట్టాలి.
నోట్. సోషల్‌మీడియా సమాచారం ఆధారంగా అందించిన సమాచారం అని గమనించగలరు. ముఖ్యంగా గుండెజబ్బుల, అధిక రక్తపోటుతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు తమ ఆహార పద్దతులను మార్చుకోవాలి.