బ్రిస్టల్: బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హడ్సన్ మార్టిన్ అనే రెండేళ్ల బాలుడు ‘కవాసాకి’ అనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో ఇటీవల మృతి చెందాడు. సాధారణ ఫ్లూ తరహా లక్షణాలతో ప్రారంభమయ్యే ఈ వ్యాధి చిన్నారుల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పుట్టినరోజుకు ముందే..
హడ్సన్‌కు ఏడు నెలల వయసులోనే ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి బాధిత చిన్నారి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఆస్పిరిన్ లాంటి మందులు వాడుతున్నప్పటికీ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న, మధ్య తరహా రక్త నాళాల గోడలలో ఆటంకం ఏర్పడి, గుండెకు రక్త సరఫరాలో లోపం ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. హడ్సన్ తన మూడవ పుట్టినరోజు జరుపుకునేందుకు కొద్ది రోజుల ముందే మృతి చెందాడు.
సీపీఆర్ చేసినా..
హడ్సన్ చాలా చురుకైన పిల్లవాడని, సంగీతం, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడేవాడని అతడి తండ్రి డేమియన్ మార్టిన్ తెలిపారు. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో, పారామెడిక్స్ బృందం దాదాపు గంటసేపు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారు, కానీ నా బిడ్డ గుండె మళ్లీ కొట్టుకోలేదు’ అని తండ్రి రోదిస్తూ తెలిపారు.
కవాసాకి వ్యాధి.. లక్షణాలు
కవాసాకి వ్యాధి (ముకోక్యుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్) ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను దెబ్బతీసి, ఎన్యురిజం (రక్తనాళాల ఉబ్బడం) వంటి సమస్యలకు దారితీస్తుంది. సుమారు 102.2 డిగ్రీల ఫారెన్‌హీట్ జ్వరం ఐదు రోజుల పాటు ఉండటం, శరీరంలో దద్దుర్లు రావడం, కళ్లు ఎర్రబడటం, చేతులు, కాళ్ల వాపు, పెదవులు ఎర్రగా మారడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
నివారణ ఎలా?
స్కార్లెట్ ఫీవర్ లేదా మీజిల్స్ వంటి ఇతర వ్యాధుల లక్షణాలు కూడా ఇలాగే ఉండటంతో, వైద్య పరీక్షల ద్వారానే దీనిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇది
ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదు. కవాసాకి వ్యాధికి పూర్తి స్థాయిలో నివారణ మందు లేనప్పటికీ, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐబీఐజీ), ఆస్పిరిన్ మిశ్రమంతో చికిత్స అందించి, దీనిని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారినపడిన చిన్నారులకు జీవితాంతం కార్డియాలజిస్ట్ పర్యవేక్షణ అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: హైకోర్టు తీర్పు.. ఉదయనిధికి భారీ షాక్


