పాట పాడితే ఎలా ఉండాలి? ఇలా... అలా కాదు... ‘వన్స్‌మోర్’ అంటూ ప్రేక్షకులు అరుస్తూనే ఉండాలి!
అలాంటి ఒక మాంత్రిక గాయకుడు కరణ్ కాంచన్.
తన స్వరంతో ప్రేక్షకులను స్పెల్‌బౌండ్ చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంటున్నాడు...
కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో జరిగిన మ్యాడ్ డీసెంట్ బ్లాక్ పార్టీకి హాజరైన పద్దెనిమిది సంవత్సరాల కరణ్ కాంచన్‌కు (karan kanchan) మేజర్ లాజర్ లాంటి కళాకారుల ప్రదర్శన తెగ నచ్చేసింది. ఆ ప్రదర్శన అతడిపై చెరగని ముద్ర వేసింది.
‘ఏదో ఒకరోజు నేను కూడా ఇదే వేదికపై ప్రదర్శన ఇవ్వాలి’ అని గట్టిగా కల కన్నాడు.
తన కలను నిజం చేసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. డైనమిక్ విజువల్స్, లైటింగ్, రకరకాల జానర్‌లతో కూడిన సంగీతంతో ఆ షో సూపర్ డూపర్ హిట్ అయింది.
ఆ ఇంట్లో ఎందరో గాయకులు
‘మా ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్, జగ్జీత్‌సింగ్‌లాంటి మహాగాయకులు ఉంటారు’ అంటాడు సరదాగా కరణ్!
ఎందుకంటే వారి ఇంట్లో ఆ గాయకుల గొంతు ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటుంది. అందుకే వారిని కూడా కుటుంబ సభ్యులను చేసుకున్నాడు. సంగీత కుటుంబంలో చేరిపోయాడు!
యూట్యూబ్‌లో గంటల కొద్దీ సమయం కొత్త సాఫ్ట్‌వేర్ కోసం వెదకడం అనేది కరణ్ హాబీ. అలా వెదికే క్రమంలో డిప్లోలో, టియెస్టోల ఎలక్ట్రానిక్ సాంగ్ విన్నాడు. వేదికపై డిజే హంగామా చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాడు. ఈ ఎలక్ట్రానిక్ సాంగ్ తనకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. టర్నింగ్ పాయింట్ అయింది.
సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ల్యాప్‌టాప్‌లో మ్యూజిక్ క్రియేట్ చేయవచ్చు అని తెలిశాక సంగీత ప్రపంచంలో ప్రయాణం ప్రారంభించాడు కరణ్.
అతడి ప్రతిభ అమోఘం
‘కరణ్ హాటెస్ట్ బీట్ మేకర్. అతడి ప్రతిభ అమోఘం’ అంటాడు సింగర్, సాంగ్ రైటర్ అంకుర్ తివారీ.
వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్న కాంచన్ మరో వైపు మ్యూజిక్ ఆర్టిస్ట్‌లకు మెరుగైన లైవ్ షోలను రూపొందించడంలో సహాయపడే ‘కన్సర్టెన్సీ’ అనే కన్సల్టెన్సీ స్థాపించాడు.
జపనీస్ మ్యూజిక్‌లో...
వివిధ సంగీత ధోరణులపై ఆసక్తితో జపనీస్ శాస్త్రీయ సంగీతంలోకి కూడా అడుగు పెట్టాడు. జపనీస్ ట్రాప్ నుంచి ఇండియన్ హిప్ హాప్ (Indian hip hop) వరకు అన్ని రకాల సంగీతం గురించి తెలుసుకున్నాడు. ‘కరణ్ క్రమశిక్షణ, సంగీతం పట్ల అంకితభావం ఆదర్శనీయం’ అంటున్నాడు స్పాటిఫై ఇండియా, ఆర్టిస్ట్ప్ అండ్ లేబుల్ పార్టనర్‌షిప్ హెడ్ పద్మనాభన్.
ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితా(2025) చోటు సాధించిన 27 ఏళ్ల సింగర్, సాంగ్ రైటర్ కరణ్ కాంచన్‌కు అభినందనలు తెలియజేద్దాం.
సాధనతో అద్భుత సంగీతం
గతంతో పోల్చితే మ్యూజిక్ (Music) క్రియేట్ చేయడం సులువు అయింది. కొత్త మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి. అంతమాత్రానా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించడం అంతసులువు కాదు. క్రియేటివిటీ ఉన్నప్పుడే శ్రోతలకు నచ్చే. మెచ్చే సంగీతాన్ని సృష్టించగలం. అందుకు ఎంతో సాధన కావాలి. సరైన వ్యక్తులను కలుసుకుంటే వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మనకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. మ్యూజిక్‌కు సంబంధించి తొలి రోజుల్లో ఎంత కుతూహలంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే.
– కరణ్ కాంచన్


