కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో.. | Hyderabad Old City Celebrates Dasara with Diverse Traditions of Kannada, Bengali & Agarwal Communities | Sakshi
Sakshi News home page

కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో నవరాత్రి పూజలు..

Sep 24 2025 10:10 AM | Updated on Sep 24 2025 11:48 AM

Kannada community in Hyderabad is celebrating Dasara Same Tradition

విభిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో మినీ భారత్‌ను తలపిస్తోంది హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ. విభిన్న ప్రాంతాలకు చెందిన వారు విభిన్న రీతుల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి కలసికట్టుగా నవరాత్రులు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాణ, హిమాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు అగర్వాల్‌ కుటుంబీకులు, మరాఠాలు, కన్నడిగులు, బెంగాలీలు తమతమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. 

నగరంలో స్థిరపడిన కన్నడిగులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామ జుమ్లా పాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో కన్నడిగులు దసరా వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దుర్గామాత చిత్రపటం వద్ద నల్లరేగడి మట్టిలో నవధాన్యాల విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తడంతో తొమ్మిది రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవధాన్యాల మొలకలు పెరిగిన ఎత్తు అమ్మవారి కటాక్షానికి కొలమానంగా భావిస్తారు. 

కన్నడిగుల అష్టమి కడాయి.. 
దుర్గాష్టమి సందర్భంగా గోధుమ పిండితో అమ్మవారి ఆభరాలను తయారు చేస్తారు. వీటిని కడాయిలో వేసి వేపుతారు. అమ్మవారి పుస్తె, మట్టెలు, జడ వంటి ఆభరణాలను తయారుచేసి అమ్మవారి విగ్రహం చుట్టు వేలాడదీస్తారు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చే బంధు మిత్రులకు వీటిని అందజేసి దసరా శుభాకాంక్షలు చెబుతారు. 

ఉపవాసం అనంతరం.. 
తొమ్మిది రోజుల ఉపవాసం అనంతరం విజయ దశమినాడు జమ్మిచెట్టు పూజతో పాటు చెరుకుగడ, బంగారం ఇస్తూ ఆలింగనం చేసుకుంటారు. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి.  

బెంగాలీలకు ఐదు రోజులే.. 
పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇదే వారి ప్రధాన పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకూ ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ దశమి రోజు నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో దుర్గామాత వద్ద మేకలను బలిస్తామని.. ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను ప్రసాదంగా పెడతామని తెలిపారు. మొదటి రెండు రోజులు శాకాహారం, మిగిలిన రెండు రోజులు మాంసాహారం భుజిస్తారు.  

అగర్వాల్‌ ఉపవాస దీక్షలు.. 
ఉత్తర భారతీయులైన అగర్వాల్‌ కుటుంబీకులు తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. గోడకు పటం వేసి గోధుమలు, జోన్నలు మట్టి కుండలో పెడతారు. మొలకెత్తిన విత్తనాల ఆకులను విజయదశమి రోజు తలపాగలో, చెవులపై ధరించి పాదాభివందనం చేస్తారు. విజయ దశమి నాడు 2–8 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది బాలికలను ప్రత్యేకంగా పూజించి తాంబూలం సమరి్పస్తారు. ఈ సందర్భంగా పూజా తాలీ పోటీలు నిర్వహిస్తారు. 

ఐక్యతకు నిదర్శనం.. 
మేము ఉత్తర భారతీయులమైనప్పటికీ దశాబ్దాలుగా నగరంలో జీవిస్తూ కలసిమెలసి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దసరా వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఇది శక్తి, ఐక్యతకు నిదర్శనం. శ్రీరాముని విజయమైనా, దుర్గామాత పూజ అయినా రెండూ శక్తి ఆరాధన రూపాలే. 
– పంకజ్‌ కుమార్‌ అగర్వాల్, హైదరాబాద్‌ కుంభమేళా అగర్వాల్‌ సమితి అధ్యక్షులు 

కోల్‌కతా మాదిరిగానే.. 
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కోల్‌కతాలో నిర్వహించినట్లుగానే ఇక్కడా నిర్వహిస్తాం. ఐదు రోజులపాటు బెంగాలీ మాతను పూజించి, అనంతరం హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తాం. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.  
– జగన్నాథ్‌ అడక్, బెంగాలీ యంగ్‌ స్టార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు

కలిసి మెలిసి ఉత్సవాలు  
ఏన్నో ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మేమంతా ఇక్కడ కలిసి మెలసి ఉత్సవాలు చేసుకుంటాం. ఇది నిజాం కాలం నుంచి వస్తోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా..ఉత్సవాలను మాత్రం మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్నాం. ఇక దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో..అదే పద్ధతిలో ఇక్కడా నిర్వహిస్తున్నాం. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. 
– డాక్టర్‌ నాగ్‌నాథ్‌ మాశెట్టి, టీఎస్‌ బసవ కేంద్రం అధ్యక్షులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement