నమోస్తు కాలభైరవా! | Sri Kalabhairava Swamy Temple, Isannapalli: The Fearless Guardian of Devotees | Sakshi
Sakshi News home page

Kalabhairava Swamy Temple: నమోస్తు కాలభైరవా!

Nov 13 2025 10:46 AM | Updated on Nov 13 2025 11:41 AM

Kalabhairava Swamy Temple in Isannapally village Kamareddy District

‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. ఈ పేరును స్వయంగా శివుడే తన కుమారునికి పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అందుకే నిత్యం అశేష భక్తుల తాకిడితో ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. నవంబర్‌ 9, ఆదివారం కార్తీక బహుళ పంచమి నుంచి 13, గురువారం బహుళ నవమి వరకు కాలభైరవస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా... 

కామారెడ్డి జిల్లా ఎన్నో ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధిగాంచింది. రాష్ట్ర రాజధాని నుంచి నాగ్‌పూర్‌ వెళ్లే ఎన్‌హెచ్‌–44 జాతీయ రహదారి పై కామారెడ్డి చేరుకున్న తర్వాత  అక్కడ నుంచి మరో 10 కిలోమీటర్ల దూరంలో ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామం ఉంటుంది. వందల యేళ్ల క్రితం ఇక్కడ వెలసిన శ్రీ కాలభైరవస్వామి దర్శనానికి నిత్యం వేలసంఖ్యలో జనం వస్తుంటారు. 

దిగంబరునిగా ఎందుకున్నాడంటే..? 
ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. స్వామివారి మూలవిగ్రహం ఎప్పుడు వెలిసిందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. క్రీ.శ 13వ శతాబ్దంలో జైనమతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని కొందరు చెబుతుంటారు. 

అందుకే దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. కానీ ఇసన్ననపల్లి–రామారెడ్డి గ్రామాలు క్రీ.శ 1550–1600 సంవత్సరాల మధ్య కాలంలో దోమకొండ సంస్థానాధీశుల పరి΄ాలనను నిర్మించబడినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్న కారణంగా జైనవిగ్రహం అనడానికి వీలులేదు. పురాణేతిహాసాల్లోనూ శ్రీ కాలభైరవుడిని దిగంబరుడిగానే పేర్కొనడం జరుగుతుంది. స్థలపురాణం

ఇసన్నపల్లి గ్రామం ప్రారంభంలోనే శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఉంటుంది. అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడు గ్రామాన్ని రక్షిస్తుంటారని నానుడి. ఈ అష్టభైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాలప్రవాహంలో కనుమరుగై΄ోయాయి. గ్రామానికి ఒక కిలోమీటర్‌ దూరంలో కాశిపల్లి అనే చోట విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందుభాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం కూడా ఉన్నాయి. 

ఇలా రామారెడ్డి గ్రామం చుట్టు కాశీ (కాశిపల్లి), రామేశ్వరం (రామేశుని కుంట) ఇలాంటి పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవస్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకుని నిరంతరం గ్రామాన్ని, భక్తులనూ రక్షిస్తు ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడి పుష్కరిణిని అమృతమయమైన నీళ్లను అందించే అక్షయ పాత్రగా భావిస్తారు. ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద ఈ పుష్కరిణి ప్రత్యేకత.

ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే వారికి అన్నిరకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగి΄ోతాయని నమ్మకం. నిత్యపూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి యేడాది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తికంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలోనూ ఒకరోజంతా సంతతాభిషేకం, విశేషపూజలు నిర్వహిస్తారు. ఆదివారం మొదలైన జయంతి వేడుకలు నేడు దక్షయజ్ఞం, ఆరున్నర నుంచి 8 గంటల వరకు పూర్ణాహుతితో ముగుస్తాయి. 
– సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి, 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement