
ఒకప్పుడూ ఒక ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా కంప్యూటర్లను క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత వాటితో పనిచేసే స్థాయికి చేరుకుని..ప్రోఫెషన్ డిజైనర్‌గా మారాడు. ఇంతలో మహమ్మారి తన ఆశలపై చన్నీళ్లు జల్లి గ్రామంలో కూర్చొబెట్టింది. అయినా సరే ..అక్కడ నుంచి వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి..అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ డిజైన్ దిగ్గజంతో పోటీపడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరి ప్రస్థానం అయినా ఏమి తెలియని సున్నా స్థాయి నుంచి మొదలవ్వుతుంది..ఆ శూన్యం విలువని పెంచడం అనేది మన చేతిలోనే ఉంది అనేది తన చేతలతో చెప్పకనే చెప్పాడు ఈ వ్యక్తి. అతడెవరు? అతడి ప్రస్థానం ఎలా మొదలైందో సవివరంగా చూద్దామా..!.
ఎక్కడో కరువు బాధిత గ్రామం నుంచి వచ్చి..జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ వ్యక్తి దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat ). ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన కీ బాత్‌లో అతడి గురించి ప్రస్తావించడమే కాదు మేక్ ఇన్ భారత్‌కు సరైన అర్థం ఇచ్చాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
భగత్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందినవాడు. అతడి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల అతడి కుటుంబం తన విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అయినా భగత్ ఐటీఐ వరకు ఏదోలా చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత మెరుగైన భవిష్యత్తు కోసం పూణేకు వెళ్లి నెలకు 4 వేలు జీతం ఇచ్చే పనిక కుదిరాడు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఆఫీస్ బాయ్(Infosys office boy) ఉద్యోగాలు గురించి తెలుసుకుని అక్కడ జాయిన్ అయ్యాడు.
అక్కడ రోజువారి పనులు చేస్తూ..అందులో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడుతుండేవాడు. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ చేసి ఉండాలని చెప్పారు అక్కడి ఉద్యోగులు. పోనీ కంప్యూర్ జాబ్ కావాలంటే గ్రాఫిక్ డిజైన్ వంటి యానిమేషన్ కోర్సులు ద్వారా ఆ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అని సూచించారు భగత్‌కి. వాటికి క్రియేటివిటీ ముఖ్యం అని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశాడు.
అలా రాత్రిళ్లు ఆఫీస్ బాయ్‌గా డ్యూటీ చేస్తూ.పగలు యానిమేషన్ కోర్సునేర్చుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేరే చోట ఉద్యోగం చేయడం కంటే తనకంటూ సొంత మార్గంలో వెళ్లాలనేది అతడి ఆలోచన. ఆ నేపథ్యంలోనే తొలుత డిజైనర్‌గా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించాడు..ఆ తర్వాత సొంత డిజైన్ కంపెనీని ప్రారంభించాడు. అయితే అతడి కలలపై నీళ్లు జల్లినట్లుగా కోవిడ్‌మహమ్మారి విజృంభించి తిరిగి గ్రామంలోకి వెళ్లిపోయేలా చేసింది.
అయినా ఏ మాత్రం తగ్గలేదు భగత్. గ్రామంలో బతకడం ఈజీ..కానీ తన గ్రాఫిక్ డిజైన్ కంపెనీ ప్రారంభించడం అంత సులభం కాదు. ఎందుకంటే తరుచుగా విద్యుత్ కోతలు..సరైన ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కాబట్టి దీన్ని పరిష్కరించేలా తన బృదం సాయంతో మార్గాన్ని అన్వేషించాడు. తమ ఊరిలో కొండపై ఉండే గోశాల వద్ద మొబైల్ సిగ్నల్ బేషుగ్గా ఉంది. కాబట్టి అక్కడ తన డిజైన్ టెంప్లేట్ ఆఫీస్‌ను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్నగా మొదలైంది అతడి కార్యాలయం. స్థానిక యువకులకు గ్రాఫిక్ డిజైన్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. వారికి డిజిటల్ నైపుణ్యాల అందివ్వడంలో సహాయం చేశాడు. అతడి వినూత్న స్ఫూర్తి మీడియా కంటపడి..మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆయన మన్ననలను అందుకోవడమే కాదు షార్క్ ట్యాంక్ ఇండియాకు చేరుకుంది అతడి విజయగాథ.
దాంతో చిన్నగా మొదలైన డిజైన్ టెంప్లేట్ కాస్తా అంచలంచెలుగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక షార్క్ ట్యాంక్ షోలో బోట్ వ్యవస్థాపకుడు సీఎంఓ అమన్ గుప్పా ఏకంగా అతడి కంపెనీలో పదిశాతం ఈక్విటీని కోటి రూపాయలకు విక్రయించాడు. అయితే ఆ షోలో తన కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడంలో తడబడ్డానని, అప్పుడు రాధికా గుప్తా మంచినీళ్లు ఇచ్చి ఏదో ఆఫీస్ ప్రెజెంటేషన్‌లా కాదు..నీ ప్రస్థానాన్ని తోటి స్నేహితులకు వివరించినట్లుగా చెప్పుచాలు అని ధైర్యం ఇచ్చారని నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు భగత్.
అయితే ఈ డిజైన్ టెంప్లేట్ భారతీయ వినియోగదారుల కోసం భగత్ రూపొందించిన క్రియేటివిటీ సాధనం. ఇప్పుడు ఇది అంతర్జాతీయ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ కాన్వాతో పోటీపడే రేంజ్‌కి చేరుకుంది. ఆఫీస్ బాయ్ కాస్తా ప్రోఫెషనల్ డిజైనర్ స్థాయికు చేరుకుని తానే ఉద్యోగాల ఇచ్చే రేంజ్‌కి చేరడం అంటే..అది అలాంటి ఇలాంటి సక్సెస్ జర్నీ కాదు కదూ..! కాగా, భగత్ స్థానిక క్రియేటర్లకు సాధికరత కల్పించి..డిజిటల్ డిజైన్‌లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నాడు భగత్.
(చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!)