భారత విజ్ఞానం: జెండాపై కపిరాజు... | Indian Wisdom The Inspiring Story Of Jendapai Kapiraju | Sakshi
Sakshi News home page

జెండాపై కపిరాజు...

Jun 15 2026 8:40 AM | Updated on Jun 15 2026 8:40 AM

Indian Wisdom The Inspiring Story Of Jendapai Kapiraju

భారత విజ్ఞానం

జెండాపై కపిరాజు అంటే ఆంజనేయుడు.... ఆయన చిరంజీవి కనుక త్రేతా యుగం నాటి రామాయణ కాలంలోనే కాదు.... ద్వాపర యుగంలో జరిగిన మహా భారత యుద్ధంలోనూ ఆంజనేయుడు కన బడతాడు. శ్రీకష్ణుడుని కోరిక మేరకు అర్జునిని రధం పై ఉండే జెండాలో కొలువై ఉంటాడు. ఇలా కొలువై ఉండేందుకు కారణం కూడా ఉంది. మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడు. ఒకసారి భీముడికి గర్వభంగం జరిగిన సందర్భంలో... మరోసారి కురుక్షేత్ర యుద్ధంలో ఆంజనేయుడి ప్రస్తావన ఉంది.

΄ాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధికా పుష్పాలు కావాలని భీముడిని కోరుతుంది. ఈ పూలు తీసుకురావడానికి భీముడు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డుతప్పుకోమని భీముడు కోరతాడు. తాను ముసలివాడినని, తోకను కూడా కదిపే శక్తి లేనందున నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్లమని భీముడికి చెబుతాడు. అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకను నెట్టేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని గ్రహించి, శరణు కోరడంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మరో సందర్భంలో కోతిరూపంలోనే అర్జునుడిని కలుస్తాడు ఆంజనేయుడు.

త్రేతాయుగంలో లంకకు చేరేందుకు నిర్మించిన వారధిని చూసి దీని నిర్మాణానికి కోతులసహాయం ఎందుకు? నేను ఒక్కడినే బాణాలతో నిర్మించేవాడిని అని బాణాలు సంధిస్తాడు అర్జునుడు. అయితే ఆంజనేయుడు కాలుమోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కృష్ణుడు తన దివ్యస్పర్శతో వంతెనను స్పృశించి పునర్నిర్మిస్తాడు.

ఓడిపోయానన్న భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని మాటిస్తాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభ నుంచి చివరి వరకూ అర్జునుని రథ జెండాపై ఉంటాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకూ జెండాపై ఉన్న హనుమంతుడికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది.

ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పటివరకూ నీ రథంపై హనుమంతుడు ఉండడం వల్ల దివ్యమైన ఆయుధాలేవీ ఏమీ చేయలేకపోయాయని లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతి అయ్యేదని చెబుతాడు. అందుకే జెండపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దుష్టశక్తులు దరిచేరవని, విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. ఏది ఏమైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్నప్పటి నుంచి జెండాపై కపిరాజు అనడం, ఇలాంటి ఆంజనేయుని జెండా తమ కూడా ఉంటే విజయం తమనే వరిస్తుందన్న సెంటిమెంట్‌ కూడా ప్రచారంలో ఉంది. - సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement