
నాకు గత ఏడాది పెళ్లయింది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. పెళ్ళి అయిన మొదటి రోజు నుంచి నేను గమనించిందేమిటంటే... ఆయన తన గురించి తాను విపరీతంగా గొప్పలు చెప్పకుంటారు. మిగిలిన వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. నాఒక్క దానితోనే ఇలా ఉంటాడనుకున్నాను. కానీ బయట అందరితో ఇలాగే ఉంటాడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని స్పెషల్‌గా చూడాలనుకుంటాడు. ఆయన చుట్టాల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఆయన్ని ‘డబ్బారాయుడు’ అంటారట. ఆఫీస్‌లో కూడా అందరితో ఇలా మాట్లాడు తున్నాడని తెలిసి ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఆయన ప్రవర్తన మార లేదు. కిందపడ్డా తనదే పై చేయి అంటాడు. ఈ మధ్య నా కజిన్ పెళ్ళికి వెళ్తే అక్కడ తనకంటే ఆపెళ్ళి కొడుకుకి ఎక్కువ మర్యాదలు చేస్తున్నారని అలిగి వచ్చేశాడు. ఎవరైనా చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో తెలీట్లేదు. ఇలాంటి వ్యక్తితో నేను జీవితాంతం ఉండగలనా అనిపిస్తోంది! – అలేఖ్య, చిత్తూరు
మీరు చెప్పిన విషయాలు చదివిన తరువాత మీ భర్తకి ఉన్న పర్సనాలిటీ సమస్య వల్ల మీరు తీవ్రమైన ఒత్తిడి, అసౌకర్యానికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన సహజమే. మీ భర్త తనని గొప్పగా ప్రదర్శించుకోవడం, ఇతరుల్ని చిన్నచూపు చూడడం, విమర్శలను ఒప్పుకోకపోవడం, అందరిపై తానే మెరుగ్గా ఉండాలని కోరుకోవడం, తాను చాల గొప్పవాడిననే భావన, ఇతరుల భావాల పట్ల ఎంపతీ లేకపోవడం) ఇవన్నీ ‘నార్సిసిస్టిక్‘ వ్యక్తిత్వ లక్షణాలుగా పేర్కొనవచ్చు. తమ తప్పులకి అవతలి వాళ్ళని బాధ్యులుగా చేసి గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసే ‘గ్యాస్ లైటింగ్’ అనే పద్ధతిని వీళ్ళు ఎక్కువగా వాడతారు.
ఇదీ చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్
ఈ పర్సనాలిటీ సమస్య జన్యుపరమైన కారణాలు, పెంపక లోపాలు, బాల్యంలో వారు పెరిగిన పరిస్థితుల వలన రావచ్చు. స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఈ సమస్యను చూస్తాము. వాళ్ళకు తాము ఏదైనా సమస్యతో ఉన్నామనే ఎరుక ఉండదు. అందువల్ల వీరికి చికిత్స చేయడం కూడా చాలా కష్టం. వారిలో మారాలనే ఆలోచన ఎంతో కొంత ఉంటే సైకోథెరపీ ద్వారా కొంతమార్పు తీసుకురావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరసీ’ ద్వారా తన ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చుకోవచ్చు. కానీ ఇది కాస్త సమయంతో కూడుకున్న వ్యవహారం. మీరు ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్ తీసుకుంటే సహజంగానే మీ బంధాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కానీ దానికి కూడా అతను సహకరించాల్సిన అవసరం ఉంది.‘నార్సిజం’కు ప్రత్యేకంగా మందులు లేవు. కానీ వీరిలో డిప్రెషన్, ఆందోళన లేదా కోపం లాంటి సమస్యలు ఉంటే వాటికి మానసిక వైద్యులు మందులు సూచిస్తారు. అయితే వీరితో జీవితాంతం కలిసి ఉండవచ్చా అనే ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. కొంత కష్టమే అయినా మీరు అతన్ని అతనిలా అంగీకరించగలిగితే కలిసి ఉండొచ్చు. కానీ కొన్నిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే మీరు అతనికి ఆ విషయాన్ని చెప్పగలగాలి. మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. చివరిగా మీకు నాదొక సలహా. పొగడ్తకి లొంగని మనిషి లోకంలో లేరు. అలాంటిది మీ భర్తకు పొగడ్తే ఆహారం, నీరు అన్నీ! అప్పుడప్పుడూ మీరే అతన్ని పొగిడితే అతనూ సంతోషంగా ఉంటాడు. మీరూ కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. మీ లాంటి ‘సైలెంట్ సఫరర్స్’ లోకంలో చాలామందే ఉన్నారు. విడిపోవడం చాలా సులభం, కానీ కలిసి ఉండాలంటే మీవైపునుండి కొంత సర్దుబాటు, ఓర్పు, త్యాగం అవసరం. గట్టి ప్రయత్నంతో చాలా సమస్యలు సర్దుకుంటాయి. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు. ఆల్ ది బెస్ట్!
-డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీకsakshifamily3@gmail.com