
మా ఆయనకు 35 సంవత్సరాలు. ఫార్మా కంపెనీలో మంచి ఉద్యోగం. కంపెనీలో మంచి పేరుంది. కానీ ఇటీవల ఆన్‌లైన్‌లో గుర్రపు పందేలపై బెట్టింగ్ చేసి చాలా డబ్బు నష్టపోయారు. ఇపుడు జీతం మొత్తం బెట్టింగ్‌కి పెడుతూ, అప్పులు కూడా చాలా చేశారు. నేను అడిగితే, ఏదో ఒక రోజు పెద్దమొత్తంలో గెలిచి, బాకీలన్నీ తీర్చేస్తానని అంటారు. ఎప్పడూ అబద్ధాలు చెప్పని ఆయన ఇప్పుడు తన అప్పులు, బెట్టింగ్ గురించి అబద్ధాలు చెబుతున్నారు. రోజురోజుకు మాకు ఆయన మాటల పైన నమ్మకంపోతోంది. ఆయనను ఎలాగైనా ఈ వ్యసనం నుండి బయటపడేసే మార్గం చెప్పగలరు!
– గీత, సికింద్రాబాద్
మీ ఆవేదన అర్థమయింది. మద్యానికి, మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లే కొందరు ఇలా ‘బెట్టింగ్’ లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. వీటిని ‘బిహేవియరల్ అడిక్షన్స్ అంటారు. ఇటీవల చాలామంది ఆన్‌లైన్ జూదం, స్టాక్ మార్కెట్, క్రికెట్ బెట్టింగ్, హార్స్ రేస్ లాంటి వాటికి బానిసలవుతున్నారు. మీ ఆయనకు ఉన్న మానసిక రుగ్మతను ‘గ్యాంబ్లింగ్ డిజార్డర్’ అంటారు. మొదట్లో సరదాగా ప్రారంభమై, చివరకు ఇలా పూర్తిగా బానిసలవుతారు.
ఏదో ఒకరోజు గెలుస్తామనే ధీమాతో అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ చేస్తారు. వీరిని మోసగాళ్ళుగా, అబద్ధాల కోరుగా చూడకుండా, ఒక వ్యసనానికి బానిసలైన వారిగా మనం పరిగణించి, మంచి సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ‘డీఅడిక్షన్ సెంటర్’లో అడ్మిట్ చేయించి, తగిన చికిత్స చేయించాలి.
కొన్ని మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే మానసిక చికిత్స ద్వారా మీ ఆయనకున్న ఈ బెట్టింగ్ వ్యసనాన్ని మాన్పించవచ్చు. ప్రస్తుతానికి మనీ మేటర్స్ మీ కంట్రోల్‌లోకి తీసుకోండి. ఆయనను ఏవగించుకోకుండా, సానుభూతితో చూడండి. సమస్య పరిష్కారమయేందుకు మీ తోడ్పాటు చాలా అవసరం. నమ్మకంతో ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ !
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)
(చదవండి: వెయిట్ లాస్ స్టోరీ: ఆరోగ్య సమస్యల భయంతో.. ఏకంగా 40 కిలోలు..)