బింబిసారుడి వేల కోట్ల బంగారం.. ఆ రహస్య గుహ ఎక్కడుందో తెలుసా? | Hidden Gold Treasure of King Bimbisara | Sakshi
Sakshi News home page

బింబిసారుడి వేల కోట్ల బంగారం.. ఆ రహస్య గుహ ఎక్కడుందో తెలుసా?

Jun 30 2026 9:44 PM | Updated on Jul 1 2026 3:52 PM

Hidden Gold Treasure of King Bimbisara

బిహార్‌లోని రాజ్‌గిరి కొండల్లో ఉన్న సోన్ భండార్ గుహల వెనక మిస్టరీ శతాబ్దాలుగా వీడడం లేదు. సైన్స్ సమాధానం చెప్పలేని వింత కోడ్‌ల కారణంగా.. ఆ గుహలను ఇంతవరకు ఎవరూ డీకోడ్ చేయలేకపోవడం గమనార్హం..! ఆ గుహల వెనక మగధ సామ్రాజ్యకాలంలో దాచిన బంగారు నిధులు ఉన్నాయని అంతా విశ్వసిస్తారు. ఆ గుహలోకి వెళ్లేందుకు ఒక భారీ రాతి ద్వారం ఉంది. దానిపై ఉన్న వింత లిపిని చదవగలిగితేనే.. గుహలోకి ఎలా వెళ్లాలి? అనేది తెలుస్తుందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

బిహార్‌లోని వైభవ్ కొండల అడుగుభాగంలో ఉన్న రెండు భారీ రాతి గుహలనే 'సోన్ భండార్' అంటారు. సోన్ భండార్ అంటేనే 'బంగారపు నిధి' అని అర్థం. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో జరాసంధుడి నిధిని ఇక్కడే దాచారు. అయితే చరిత్రకారుల ప్రకారం.. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసార మహారాజు, శత్రువుల దాడి నుంచి తన అపారమైన బంగారాన్ని, రత్నాలను రక్షించుకోవడానికి ఇక్కడే నిధులను దాచాడని చెబుతారు. బింబిసారుడి భార్య 'మగధ సామ్రాజ్య ఖజానా' మొత్తాన్ని ఈ గుహలో దాచి, ఎవరూ దొంగిలించకుండా ఒక భారీ రాతి తలుపును ఏర్పాటు చేసి, లాక్ చేయించిందని స్థానికుల నమ్మకం. ఆ రాతి గది వెనుక వేల కోట్ల విలువైన నిధి ఇప్పటికీ భద్రంగా ఉందనేది ఒక పెద్ద మిస్టరీ.

ఈ గుహలోకి ప్రవేశించగానే ఒక మూసి ఉన్న రాతి ద్వారం కనిపిస్తుంది. దాని పక్కనే గోడపై ఒక వింతైన లిపి దర్శనమిస్తుంది. దీన్ని 'శంఖ లిపి' అని పిలుస్తారు. ఈ రహస్య కోడ్‌ను ఎవరైతే సరిగ్గా చదువుతారో.. ఆ మంత్ర శబ్దానికి ఆ రాతి ద్వారం దానంతట అదే తెరుచుకుంటుందని ఒక బలమైన నమ్మకం ఉంది. భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిషు వారి కన్ను కూడా ఈ నిధిపై పడింది. ఎలాగైనా ఆ తలుపులు బద్దలు కొట్టాలని, ఒక బ్రిటిష్ అధికారి ఏకంగా పెద్ద పెద్ద ఫిరంగులను తెప్పించి ఆ రాతి ద్వారంపై బాంబుల వర్షం కురిపించాడు. కానీ ఆశ్చర్యకరంగా.. ఫిరంగి దెబ్బలకు కూడా ఆ తలుపులు అంగుళం కూడా కదల్లేదు. ఆ దాడికి గుర్తుగా గుహ ద్వారంపై పడిన ఫిరంగి దెబ్బల గుర్తులు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి.

సైన్స్, హిస్టరీ.. ఈ రెండు కూడా ఈ గుహలను వేర్వేరు కోణాల్లో చూస్తాయి. స్థానికులు దీన్ని బింబిసారుడి నిధిగా నమ్ముతుంటే, ఆర్కియాలజిస్టులు మాత్రం దీని వెనుక మరో మతపరమైన కోణాన్ని చెబుతున్నారు. ఇక్కడి ఉన్న శాసనాలను బట్టి ఇవి క్రీస్తుశకం 3 లేదా 4వ శతాబ్దానికి చెందిన జైన్ గుహలు అని వివరిస్తున్నారు. 'ముని వైరాదేవ' అనే జైన సాధువు ఈ గుహలను నిర్మించి, లోపల జైన్ తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్టించారని.. గోడలపై ఉన్నది గుప్త సామ్రాజ్యం కాలం నాటి శంఖ లిపి అని పేర్కొంటున్నారు. దానిని పూర్తిగా డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది కేవలం ఒక మతపరమైన శ్లోకం మాత్రమే అయి ఉండవచ్చు, నిధి కోడ్ కాకపోవచ్చని చెబుతున్నారు.

ఆర్కియాలజిస్టులు ఇవి జైన గుహలని చెబుతున్నప్పటికీ... గుహ వెనుక ఉన్న ఆ రహస్య గదిలోకి మాత్రం ఇప్పటివరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు. హైటెక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా.. ఒక సాధారణ రాతి తలుపు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోవడం ఒక పెద్ద సవాల్‌గానే మిగిలిపోయింది. ఆ రాతి తలుపు వెనుక మగధ సామ్రాజ్య వేల కోట్ల నిధి ఉందా? లేక హిస్టరీ దాచిన మరేదైనా ఆధ్యాత్మిక రహస్యం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. ఆ గోడలపై ఉన్న శంఖ లిపి మిస్టరీ వీడే వరకు వేచి చూడాల్సిందే! ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి అప్‌డేట్స్‌ను మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement