
రాగి సంగటి, జావపై మక్కువ చూపుతున్న ప్రజలు
మార్కెట్‌లో పదార్థాలకు డిమాండ్
ఆశాజనకంగా ధరలు పెరిగిన పంట సాగు
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషదం
ప్రధాన ఆహార పంటల్లో రాగి పంట ఒకటి. చిరుధాన్యం పంటగా రాగి పండిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవిలో కూడా రాగి సాగు అధికంగా చేస్తారు. రాగిలో క్యాల్షియం అధికంగా ఉండడం, కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండడం, పీచుపదార్థం కావడం, వరి, గోధుమల కంటే పోషకాల శాతం ఎక్కువ ఉన్న మంచి పౌష్టికాహారం కావడంతో ఇటీవల కాలంలో రాగి వినియోగం పెరిగింది. దీంతో రాగి సాగు విస్తీర్ణం ప్రస్తుతం పెరిగింది. ప్రభుత్వాలు కూడా రాగి పంటకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు పొందుతున్నారు.
బంగారుపాళెం: నియోజకవర్గంలో రైతులు చిరుధాన్యాల పంటల సాగుపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాగి పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. నీటి తడులకు అవకాశం ఉన్న రైతులు రాగి పంటతో పాటు వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాగులకు మంచి గిరాకీ ఉంది. గతంలో గ్రామాల్లో రాగి, జొన్న, సజ్జ, కొర్ర, సామ, అరికె పంటలు సాగు చేసేవారు. క్రమంగా ఆయా పంటల సాగు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో రాగి, కొర్ర పంట సాగు చేస్తున్నారు. గ్రామాల్లో మధ్యాహ్న రాగి సంగటి వాడుతున్నారు. హోటళ్లలో కూడా రాగిసంగటి అందుబాటులో ఉంటోంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రాగి సంగటి తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో రాగి «ధాన్యానికి డిమాండ్ పెరిగింది. వరి కోసిన తరువాత రాగిపంట సాగు చేస్తున్నారు. రాగులు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. దీంతో రాగి పంట సాగుతో మంచి లాభాలు రాబడుతున్నారు.
అధిక దిగుబడినిచ్చే రకాలు..
రాగి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాల్లో మేలైన రకం మారుతిరకం. ఈ రకం పంట 85 రోజుల నుంచి 90 రోజుల్లో దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. అన్ని ప్రాంతాల్లో సాగు చేసేందుకు వీలుగా ఉంటుంది. మిగతా రకాలైన వేగావతి, సువర్ణముఖి, వకుళ, భారతి, హిమ, శ్రీచైతన్య రకాలు కూడా అధిక దిగుబడినిస్తాయి.
బంగారుపాళెంలో సాగు చేసిన రాగి పంట
విత్తనశుద్ధి ఇలా..
రాగి పంట సాగు చేసే సమయంలో విత్తనశుద్ధి అవసరం. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం అనే మందు కలిపి విత్తనశుద్ధి చేయడం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా ఉంటాయి. నారు నాటే పద్ధతిలో అయితే ఒక ఎకరానికి నారు కావాలంటే 2 కేజీల విత్తనాన్ని 5 సెంట్ల భూమిలో నారుమడిలో పోయాలి. 21 రోజుల తరువాత నారు నాటాలి. పొలం దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువులు వాడాలి. ఖరీఫ్‌లో వర్షాధారంగా పండించే రాగి పంటకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వేయాలి. అగ్గి తెగుళ్ల నివారణకు ట్రై సైక్లోజెల్ 6 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులు నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్‌ను లీటరు నీటిలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. కాండం తొలిచే పురుగు నివారణకు కొరాజిన్ 3 మిల్లీలీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈవిధంగా పంట సస్యరక్షణ చేస్తే పంట అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు.
రాగితో ఆరోగ్యం..
రాగి ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగులతో చేసే సంగటి, రాగి జావ, రొట్టె తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు 100 గ్రాములు తీసుకుంటే, అందులో 344 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీలు, 3,6 గ్రాముల పీచు పదార్థాలు, 7.3 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే పూర్వం ఎక్కువగా రాగులతో చేసిన పదార్థాలే తినేవారు. రాగి జావ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగులు వాడకంతో బరువు తగ్గుతారు.