మీకు తెలుసా? తాగే నీరు స్వచ్ఛంగా ఉంటే చాలా రోగాలు మీ దగ్గరకు రావని? దురదృష్టం ఏమిటంటే.. దేశం ఎంతో పురోగమించింది కానీ.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల్లో కలుషితమైన నీరు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. మరీ ముఖ్యంగా సీసం (లెడ్). హైదరాబాద్, విశాఖపట్నాల్లో పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా కాలువల్లోకి కలిపేస్తూండటంతో తాగునీటిలో సీసం మొతాదు పెరిగిపోతోంది. ఫలితంగా పిల్లల్లో నాడీ సంబంధిత, ఎదుగుదల సమస్యలు, పెద్దల్లో గుండె, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు నీటిలో కలిసినప్పుడు కూడా లెడ్ మోతాదు ఎక్కువైపోతుంది. యునిసెఫ్ అంచనా ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద 80 కోట్ల మంది, భారత్‌లో సుమారు 27 కోట్ల మంది పిల్లలు లెడ్‌తో కలుషితమైన నీటి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే... గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు దీనికో వినూత్నమైన పరిష్కారం కనుక్కున్నారు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. వివరాలు ఇలా ఉన్నాయి....
బ్యాక్టీరియా. పేరు చెప్పగానే వ్యాధులే గుర్తుకొస్తాయి కానీ కొన్ని బ్యాక్టీరియా మనకు ఎంతో మేలూ చేస్తాయి. గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు కూడా సీసం కాలుష్యాన్ని తొలగించేందుకు బ్యాక్టీరియా ఏదైనా ఉపయోగపడుతుందా? అని పరిశోధించినప్పుడు వారికి ఓ అద్భుతం కనిపించింది. సయనో బ్యాక్టీరియాలోని ఒకానొక రసాయనానికి నీటిలోని లెడ్‌ను 92.5 శాతం వరకూ తొలగించగలదని తెలిసింది. ఇది పేరుకు బ్యాక్టీరియా కానీ.... చెట్ల మాదిరి సూర్యుడి వెలుతురును వాడుకుని శక్తిని తయారు చేసుకోగలదు. ఇంకేముంది. ఈ బ్యాక్టీరియా సాయంతో శాస్త్రవేత్తలు నీటిని సీసం నుంచి శుద్ధి చేసేందుకు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత ‘జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్’లో ప్రచురితమైంది.
లెడ్ ఒకసారి నీటిలో కలిసిందంటే కొన్ని దశాబ్దాలపాటు అక్కడే ఉండిపోతుంది. ఈ నీరు తాగిన వారి శరీరాల్లో పోగుబడుతూ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ కాలుష్యాన్ని తొలగించేందుకు రసాయనాలు లేదంటే కృత్రిమ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. రెండూ ఖరీదెక్కువ. పైగా వీటి తయారీతోనూ కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు సహజ పద్ధతుల ద్వారా నీటిలోని లెడ్‌ను తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు. నేలలో సహజసిద్ధంగా ఉండే సయనో బ్యాక్టీరియా రకాలను వెతికి లెడ్‌కు అతుక్కుపోయే ఒక జాతిని గుర్తించారు. ‘ఫోమ్మిడియం కోరియం, ఎన్‌ఆర్‌ఎంసీ-50 అని పిలిచే ఈ జాతి బ్యాక్టీరియాను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు దీని సామర్థ్యం గురించి తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన బయోసైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ విభాగపు శాస్త్రవేత్త దెబాశీష్ దాస్ తెలిపారు. ఫ్యాక్టరీల్లాంటివి ఏవీ కట్టే అవసరం లేకుండా.. అతితక్కువ ఖర్చుతో ఈ బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులతో పోలిస్తే సగం ఖర్చుతోనే పని పూర్తిచేయవచ్చునన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ఈ పద్ధతిని వాడుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే లెడ్ వ్యర్థాలను నియంత్రించవచ్చునని తెలిపారు.
ఎన్నో ప్రయోజనాలు..
సయనో బ్యాక్టీరియా ద్వారా నీటిలో కలిసిన లెడ్ మాత్రమే కాకుండా.. క్రిమి సంహారకాలు, కలుపు నాశినిలు, పెట్రోలు, డీజిల్ వంటి హైడ్రోకార్బన్లు, కృత్రిమ రంగులను కూడా తొలగించవచ్చునని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా... బ్యాక్టీరియా తొలగించిన రసాయనాలను వేరు చేసి మళ్లీ వాడుకునేందుకూ అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న రసాయనాల స్థానంలో వీటిని వాడటం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం తాము ఈ ప్రయోగాలను చిన్న స్థాయిలో జరిపామని, పెద్ద ఎత్తున జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని వివరించారు.


