పెళ్లి థీమ్‌..పార్టీ జూమ్‌.. | Hyderabad Embraces Fake Wedding Parties: A New Trend in Nightlife Entertainment | Sakshi
Sakshi News home page

Fake Wedding: పెళ్లి థీమ్‌..పార్టీ జూమ్‌..! ఇది పెళ్లిళ్లకు పేరడి..

Aug 21 2025 10:20 AM | Updated on Aug 21 2025 12:04 PM

Fake Wedding Is The Latest Party Trend In India, Here's ...

మిరుమిట్లు గొలిపే లైట్లు, మెరిసే డిజైనర్‌ దుస్తులు, చెవుల్లో హోరెత్తించే మ్యూజిక్, నోరూరించే ఆహారం.. ఉత్సాహభరిత వాతావరణం.. ప్రతిదీ విలాసమే, విశేషమే.. వేదికను చూడగానే చెప్పేయవచ్చు అది ఖరీదైన వివాహ వేడుక అని. అవును నిజమే.. అక్కడ పెళ్లి జరుగుతున్న ఆనవాళ్లన్నీ ఉన్నాయి కానీ.. అగ్నిగుండాలు, వధూవరులు మాత్రం లేరు. బంధువులు లేరు, కన్నీటి వీడ్కోలు లేవు. అదేమిటి? అంటే అదే ఫేక్‌ వెడ్డింగ్‌ థీమ్‌. ఇప్పుడు హైదరాబాద్‌ సిటీ పార్టీలను సరికొత్తగా మారుస్తున్న ట్రెండ్‌. 

హోటళ్లు, క్లబ్బులు ఈవెంట్‌ కంపెనీలు వరుసగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఈ ఈవెంట్‌లు పూర్తిగా వినోదం కోసం రూపుదిద్దుతున్నారు. ఎటువంటి ఒత్తిడి, ఆచారాలు లేదా బాధ్యతలు లేకుండా వివాహ విందుకు సంబంధించిన పూర్తి అనుభవాన్ని అందిస్తాయివి. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది వివాహ నేపథ్య నైట్‌ పార్టీ. వెస్ట్రన్‌ నుంచి వెల్‌కమ్‌.. కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మోడల్‌ పెళ్లిళ్లు సందడి చేస్తున్నాయి. 

నగరంలో మాత్రం ఇటీవలే ప్రవేశించాయి. ఈ పార్టీలకు స్నేహితులతో కలిసి హాజరైన వారు, సంప్రదాయ భారతీయ వివాహ వేడుకల్లోని అనేక భాగాలను నాటకీయతతో మేళవించి విందు వినోదం ఆస్వాదిస్తారు. ‘సిటీలో ఫేక్‌ వెడ్డింగ్‌లో భాగంగా ఒక ఖరీదైన క్లబ్‌లో సంగీత్‌ నిర్వహించారు. అక్కడ వాతావరణం ఉల్లాసంగా ఉంది. సీక్విన్డ్‌ చీరలు లెహంగాలు (పొడవాటి స్కర్టులు బ్లౌజులు) ధరించిన మహిళలు, టైలర్డ్‌ కుర్తాలు జాకెట్లలో పురుషులు కనిపించారు. 

ఒక సంప్రదాయ ధోల్‌ డ్రమ్మర్‌ జనాన్ని డ్యాన్స్‌ ఫ్లోర్‌కు నడిపించాడు..’ అంటూ ఈ కార్యక్రమానికి హాజరైన శివాంగి దీనిని ఓ ఆసక్తికర పార్టీగా అభివర్ణించారు. ‘సంప్రదాయ వివాహాలలో ఒత్తిడి ఉంటుంది. దుస్తులు ధరించడం చుట్టూ నియమాలు, బంధువుల ఆక్షేపణలు, కానీ ఇక్కడ అవేవీ ఉండవు.. సో సరదాగా ఉంటుంది.’ అని ఆమె చెప్పారు.

రూ.1500తో పెళ్లిలోకి ఎంట్రీ.. 
ఈ పార్టీ టిక్కెట్‌ ధరలు సాధారణంగా దాదాపు రూ.1,500 నుంచి ప్రారంభమవుతాయి. సౌకర్యాలను బట్టి రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. శివాంగి ఆమె స్నేహితులు హాజరు కావడానికి ప్రతి జంటకు రూ.10 వేలు చెల్లించారు. ‘నెలకు ఒకసారి ఆ మాత్రం ఖర్చు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే.. ఈ అనుభవం అంతకు మించి విలువైనది.‘ అంటున్నారామె. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెస్టారెంట్‌ యజమాని శరద్‌ మాట్లాడుతూ.. కొత్త కొత్త అనుభవాలను అతిథులకు అందివ్వడం ఆతిథ్య రంగంలో కీలకమన్నారు.  
విదేశాల్లో మనోళ్లే.. క్లాప్‌ కొట్టారు
గత నెలలో బెంగళూరులో 2,000 మంది హాజరైన ఫేక్‌ వివాహ విందుకు ఆతిథ్యం ఇచ్చిన 8 క్లబ్‌ ఈవెంట్స్‌ సహ వ్యవస్థాపకుడు కౌశల్‌ చనాని, నకిలీ వివాహ వేడుకలకు ప్రేరణ విదేశాలలో నివసిస్తున్న యువ భారతీయుల నుంచి వచ్చిందని చెప్పారు. వారు అక్కడ ఉండి మన పెళ్లిళ్లు మిస్‌ అవుతున్నారు. అదే వీటిని డిజైన్‌ చేయించింది అన్నారాయన. ‘అన్ని పారీ్టల్లాగే ఇక్కడా జన సమూహం ఉంటుంది. వారంతా బాలీవుడ్‌ సంగీతానికి నృత్యం చేస్తారు.. సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.. సరికొత్త సాయంత్రాన్ని ఆనందిస్తారు’అని ఆయన అన్నారు.  

ట్రెండీగా మారింది.. 
ఫేక్‌ వెడ్డింగ్‌ పార్టీస్‌ ఇప్పుడు సిటీలో ఫ్రెష్‌గా ట్రెండీగా మారాయి. కార్పొరేట్‌ ఉద్యోగులు, స్టూడెంట్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. దాంతో పబ్స్, క్లబ్స్‌లో కూడా ఈ తరహా పార్టీస్‌ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో భాగమైన సంగీత్‌ను పార్టీ పీపుల్‌ బాగా కోరుకుంటున్నారు. ఒక డీజెగా ఇది నాకు కూడా భిన్నమైన ఎంజాయ్‌మెంట్‌ను అందిస్తోంది.  
– డీజె పీయూష్‌  

పెళ్లి సందడిని రుచి చూపిస్తున్నాం..
ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా ఆఫ్‌లైన్‌ ఈవెంట్స్‌ డిజైన్‌ చేసే సంస్థగా అండర్‌ గ్రౌండ్‌ ఫెరారి, పూల్‌ పారీ్ట.. వంటివి నిర్వహిస్తున్నాం. ఈ ఫేక్‌ వెడ్డింగ్‌ పారీ్టలు పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తరచూ పెళ్లి వేడుకల్ని మిస్‌ అవుతున్నవారి కోసం వీటిని డిజైన్‌ చేశారు. ప్రస్తుతం మన దేశంలో కూడా కార్పొరేట్‌ వర్క్‌ కల్చర్‌ వల్ల దగ్గరి బంధువులు, సొంత ఊర్లో పెళ్లిళ్లకు కూడా హాజరు కాలేకపోతున్నారు. 

దీనిని దృష్టిలో ఉంచుకుని ఫేక్‌ షాదీ కాన్సెప్ట్‌ను మేం తొలుత బెంగళూర్‌కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలకు తీసుకెళ్లాం. హైదరాబాద్‌ నుంచి కూడా చాలా మంది సంప్రదిస్తున్నారు. త్వరలోనే నగరంలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. 
– మాథుర్, సహ వ్యవస్థాపకులు, 8 క్లబ్‌ ఈవెంట్, బెంగళూర్‌  

(చదవండి: 'పారాచూట్‌ వెడ్డింగ్‌ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్‌ స్టోరీనా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement