
ఎంతో కష్టపడి నచ్చిన డ్రెస్ కొనుకున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు/ప్రియమైనవారో మనకెంతో ఇష్టమైన డ్రెస్ కొంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదెంతో అపురూపం కూడా. ఆ దుస్తులు చూడగానే దాని తాలుకా జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే మన ప్రాణ సమానమైన వ్యక్తిని రక్షించిన వస్తువు లేదా మనిషి మనకు ఆప్తమిత్రుడు లేదా అత్యంత ఆత్మీయులు. అందుకు అర్థం పట్టేదే ఈ వెడ్డింగ్ గౌను. దీని వెనుకున్న కథ వింటే కళ్లు చెమరుస్తాయి. 'ప్రేమకు అర్థం ఏదంటే'.. అన్న పాట గుర్తొచ్చేలా ఉంటుంది ఈ జంట కథ. చరిత్రలో దాగున్న ఈ అందమైన స్టోరీ ఏంటో చదివేద్దామా..!
ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఐకానిక్ వెడ్డింగ్ గౌను ఒక జంట ప్రేమకు గుర్తుగా మ్యూజియంలో భద్రంగా ఉంది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. అదే ఇవాళ స్టైలిష్ వెడ్డింగ్ గౌనుగా బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి నవ వధువు ఇష్టపడే ఆ వివాహ గౌను వెనుక కథ చూస్తే ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది.
దీని గురించి సంస్కృతి, చరిత్రపై అమితాసక్తి కలిగిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మే షరీఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేశారు. దాంతో ఈ వెడ్డింగ్ గౌను వెనుకున్న లవ్‌స్టోరీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు 'ప్రేమకు అర్థం ఎవరంటే?'..అన్న పాటను గుర్తుకుతెస్తోంది. ఆ వీడియోలో షరీఫి ప్రముఖులు ధరించిన ఎన్నో వెడ్డింగ్ గౌనులు చూసుంటారు గానీ ఈ పారాచూట్ వెడ్డింగ్ గౌను(parachute wedding dress) గురించి విన్నారా అంటూ ఆ స్టోరీ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది.
This wedding dress was made from a parachute that saved Maj. Claude Hensinger during WWII. In our @amhistorymuseum: https://t.co/0lf4659Pu0 pic.twitter.com/dSvRHwnvl7
— Smithsonian (@smithsonian) June 16, 2017
వెడ్డింగ్ గౌను వెనుకున్న కథ..
1947లో, ఒక మహిళ రెండవ ప్రపంచ యుద్ధం(World War II)లో తన భర్త ప్రాణాలను కాపాడిన పారాచూట్‌నే వెడ్డింగ్ గౌనుగా డిజైన్ చేసిందట. నైలాన్ ఫ్రాబ్రిక్ క్లాత్‌తో ఉండే పారాచూట్‌ని చాలా అందమైన వివాహ దుస్తులుగా మార్చిందామె. ఆ జంటే మేజర్ క్లాడ్ హెన్సింగర్, రూత్‌లు. 1947 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికన్ బీ 29 పైలట్ అయిన మేజర్ క్లాడ్ హెన్సింగర్ తన సిబ్బందితో తిరిగి వస్తుండగా విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.
వెంటనే పారాచూట్ సాయంతో తన సిబ్బందిని, తనను రక్షించుకున్నారు. అంతేగాదు వారు ఆగిన నిర్మానుష్య ప్రదేశానికి అధికారులు వచ్చేంతవరకు వారికి ఆ పారాచూట్ రక్షణ కవచంలా వెచ్చదనాన్ని అందించింది. అతను సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయపడిన వెంటనే తన స్నేహితురాలు రూత్‌ని నేరుగా కలసి జరిగినదంతా వివరించి ఆ పారాచూట్‌ని ఆమెకు ఇచ్చాడు.
తన భర్త ప్రాణాలను కాపాడిన ఈ పారాచూట్ తనకెంతో అపురూపం అంటూ దాంతోనే వెడ్డింగ్ గౌనుని స్వయంగా రూపొందించుకుంది. అంతేగాదు దాన్ని ఆ దంపతులు ఎంత భద్రంగా ఉంచుకున్నారంటే..తన కూతురు, కోడలు కూడా వారి వివాహంలో ఆ గౌనునే ధరించారు. ఆ తర్వాత స్మిత్సోనియన్ మ్యూజియంలో ఆ గౌను నేటికి పదిలంగా ఉంది.
(చదవండి: Smartphone Photography: కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్‌గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ)