ఒక్కమాటలో చెప్పాలంటే కాబోయే ప్రతి మాతృమూర్తి తాలూకు గర్భధారణా అలాగే ప్రసవంలో ఎంతోకొంత రిస్క్ ఉండనే ఉండవచ్చు.అయితే కొందరి గర్భధారణలు (ప్రెగ్నెన్సీలు) చాలా రిస్క్‌తో కూడుకున్నవే అవుతాయి. ఉదాహరణ ఒక మహిళకు హైబీపీ, డయాబెటిస్ లేదా గుండెజబ్బులు ఉండటం... ఒకవేళ ఆమె 35 ఏళ్లు దాటాక లేట్‌గా గర్భవతి కావడం... ఇలాంటి సందర్భాల్లో ఆమె గర్భధారణ అన్నది ప్రసవం వరకూ చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన సందర్భం అవుతుంది. ఇటీవల దాదాపు ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతుండటంతో (ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతుండటంతో) రిస్క్ అనేది చాలావరకు తగ్గినప్పటికీ... కొన్ని గర్భధారణల్లో ఏ సందర్భంలో ఎటుపోయి ఎటువస్తుందో చెప్పలేని పరిస్థితీ, ఎలాంటి ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయో తెలియని అనిశ్చితి ఉండనే ఉంటుంది. ఇలాంటివాటినే హై రిస్క్ ప్రెగ్నెన్సీలుగా చెప్పవచ్చు. ఏయే సందర్భాలను ‘హై రిస్క్ ప్రెగ్నెన్సీలు’గా పరిగణిస్తారో, ఆ సందర్భాల్లో చేయించాల్సిన వైద్యపరీక్షలు, స్కాన్‌లతో సాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.
ఇటీవల వైద్యవిజ్ఞానశాస్త్రాల్లో చాలా అభివృద్ధి చోటుచేసుకుంది. ఇంత పురోభివృద్ధి తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం గర్భం ఎంత మేర నిలుస్తుందో చెప్పలేని సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి. అది తల్లీ బిడ్డా ఇద్దరికీ కాస్తంత ప్రమాదకరంగా మారే అవకాశాలూ పొంచి ఉంటాయి. అలా తల్లికి గానీ లేదా కడుపులోని బిడ్డకుగానీ... ఒక్కోసారి ఈ ఇద్దరికీ సురక్షితమని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎన్నో రకాల కాంప్లికేషన్లు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి గర్భధారణను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు.
ఎవరెవరిలో హైరిస్క్ ముప్పు ఉంటుందంటే...
ప్రధానంగా ఈ కింద పేర్కొన్న మహిళలు ‘హై–రిస్క్ ప్రెగ్నెన్సీ’ కిందికి వస్తారని చెప్పవచ్చు
దాదాపు 35 ఏళ్లు దాటాక (35 – 40 ఏళ్ల మధ్య వయసులో) గర్భవతులైనవారు.
ఇప్పుడు గర్భవతిగా ఉన్న ఆ మహిళకు గతంలో వరసగా అబార్షన్లు కావడం లేదా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడం వంటి వైద్యచరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం.
మహిళలకు తాము గర్భందాల్చక ముందే అధిక రక్త΄ోటు(హైబీపీ), మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, ధైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, మూర్ఛ (ఎపిలెప్సీ) వంటి ఆరోగ్య సవస్యలు ఉన్నవారు.
ముందుగా డయాబెటిస్ లేనప్పటికీ గర్భధారణ తర్వాత మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), హైబీపీ కనిపించిన మహిళలు.
గర్భధారణకు సంబంధించిన సమస్యలు... అంటే... గర్భంలో కవలలు లేదా ట్రిప్లెట్స్ ఉండటం, స్కాన్ చేసినప్పుడు బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలుగానీ లేదా లోపాలుగానీ ఉన్నట్లు తెలిసిన సందర్భాల్లో, కడుపులో బిడ్డకు ఎదుగుదల సమస్యలు ఉండటం, బిడ్డలో జన్యుపరమైన లోపాలుండటం... వంటి సందర్భాల్లో. సాధారణ మహిళలతో పోలిస్తే... ఈ తరహా వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీలు) ఉన్నవాళ్లను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’ కేటగిరీలోకి వస్తారని చెప్పవచ్చు.
హై రిస్క్ ప్రెగ్నెన్సీ...తెలుసుకోవడం ఇలా...
ఒక మహిళ హైరిస్క్ గ్రూప్ కిందికి వచ్చే వస్తుందా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి ఈ కింద పేర్కొన్న అంశాలు సహాయపడతాయి. వీటి సహాయంతో ఒక మహిళ తాను హైరిస్క్ ప్రెగ్నెన్సీ జాబితాలోకి వస్తుందా రాదా అన్నది తనకు తానే తెలుసుకోవచ్చు.
గర్భధారణ నాటికి 35 ఏళ్ల వయసు మించి ఉండటం. దీనివల్ల సాధారణ మహిళలతో ΄ోలిస్తే... ఇలా లేట్‌గా గర్భధారణ జరగడంతో పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్స్‌కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
కేవలం బాగా ఆలస్యంగా జరిగిన గర్భధారణలోనే కాకుండా... ఒకవేళ ఓ అమ్మాయి 18 ఏళ్ల లోపు చిన్నవయసు బాలిక కావడం, చిన్న వయసులోనే ఆమెకు గర్భధారణ జరిగినప్పుడు కూడా పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపించే అవకాశాలుండటంతో దీన్నీ హైరిస్క్‌గానే పరిగణించాలి.
ఒకవేళ గర్భంలో ఒకరికంటే మించి (అంటే... కవలలు లేదా ట్రిప్లెట్స్) ఉండటం వల్ల హైబీపీ రావడం లేదా నెలలు నిండకముందే ప్రసవం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
గర్భంలోని బిడ్డకు ఎదుగుదల లోపాలు ఉన్నప్పుడు. గర్భధారణ జరిగిన మహిళలకు హైబీపీ, చక్కెరవ్యాధి (డయాబెటిస్), గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ సమస్యలు, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.
ఇప్పటికే ఓసారి ఒక మహిళకు జన్యుపరమైన సమస్యలున్న బిడ్డ ఉండటం లేదా... ఆ బిడ్డకు గుండెజబ్బుగానీ, లోపంతో కూడిన ఎముకల కారణంగా బిడ్డకు వైకల్యం రావడం వంటి ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం.
మహిళకు గర్భధారణ వ్యవస్థలో పెద్ద గడ్డలు (ఫైబ్రాయిడ్స్) వంటివి వచ్చిన వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం.
గతంలో తరచూ అబార్షన్లు కావడం, మునుపు పిండం గర్భసంచిలో కాక... బయట ట్యూబుల్లోనే పెరగడం, గతంలో నెలలు పూర్తిగా నిండకముందే ప్రసవం జరగడం (ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ బర్త్), గతంలో బిడ్డ లోపలే చనిపోవడం వంటి మెడికల్ హిస్టరీ ఉంటే...
హెచ్‌ఐవీ వంటి ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల అవి బిడ్డకు సోకే అవకాశాలున్నప్పుడు.
పిల్లలు కలగడానికి చాలాకాలం చికిత్స తీసుకున్న తర్వాత గర్భం రావడం...
ఇక్కడ పేర్కొన్న సందర్భాల్లో ఒక మహిళ గర్భందాల్చితే దాన్ని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు. ఇలాంటి మహిళలకు గర్భధారణ సమయంలోనూ లేదా ప్రసవం సమయంలోనూ అనేక రకాల కాంప్లికేషన్లు కనిపించే అవకాశాలు ఎక్కువ.
ఈ కాంప్లికేషన్లను రెండు రకాలుగా నివారించవచ్చు. మొదటిది మహిళ తానంతట తానే కొన్ని జాగ్రత్తలూ, సూచనలు పాటించి కాంప్లికేషన్లను నివారించుకోవడం, రెండోది వైద్యనిపుణుల సహాయంతో కాంప్లికేషన్లు నివారించుకోవడం.
మహిళలు తమకు తాముగా ప్రెగ్నెన్సీ రిస్క్‌ల తాలూకు కాంప్లికేషన్ల నివారించుకోవడమిలా...
హైరిస్క్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే ఒకసారి ‘ప్రీ– కన్సెప్షనల్ కౌన్సెలింగ్’ కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... దాదాపు మూడు నెలల ముందునుంచే కనీసం రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం... (ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రను గర్భం దాల్చాక కూడా పూర్తి గర్భధారణ టైమ్ మొత్తం వాడాలి.
గర్భం ధరించిన సమయంలో వీలైనంతవరకు ఎలాంటి మందులూ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే... ప్రతి మందునూ తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు వాళ్లకు తెలిసి మాత్రమే తీసుకోవాలి.
కొందరు మహిళలకు మూర్ఛ (ఎపిలెప్సీ), హైబీపీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే... గర్భం వచ్చినట్లు తెలియగానే కొందరు మహిళలు తాము వాడే మందుల్ని తమంతట తామే ఆపేస్తారు. అది తల్లీ, బిడ్డా ఇద్దరికీ ప్రమాదకరం. కాబట్టి తామేవైనా మందులు వాడాలన్నా లేదా అంతకుముందునుంచి వాడుతున్న మందులు ఆపేయాలన్నీ డాక్టర్‌ను సంప్రదించాకే ఆ పని చేయాలి. ఎందుకంటే హైబీపీ, మూర్చ (ఎపిలెప్సీ) వంటి వ్యాధులున్న మహిళలకు డాక్టర్లు వారి గర్భధారణ తసమయంలో వాడుతున్న మందులను గానీ లేదా వాటి మోతాదులనుగానీ మారుస్తారు.
గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా డాక్టర్‌తో నిత్యం డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయిస్తూ ఉండాలి. కనీసం నెలలో ఒకసారైనా లేదా పరిస్థితి తీవ్రతను బట్టి డాక్టర్లు సూచించిన వ్యవధిలో డాక్టర్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయిస్తుండాలి. ఏడో నెల దాటాక ఈ పరీక్షలు మరింత తరచుగా చేయించాల్సి రావచ్చు. సరైన టైముల్లో సరైన టీకాలు (ప్రాపర్ ఇమ్యూనైజేషన్) తీసుకోవాలి.
మహిళలు తమ ఎత్తుకు తగినట్లుగా తమ ఆరోగ్య నిర్వహణకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం, ఇందుకు సరైన ఆహార నియమాలు పాటించడం, అవసరమైన శారీరక వ్యాయామాలను చేయడం అవసరం. ఈ వ్యాయామాలు మరింత శ్రమ కలిగించేలా ఉండకూడదు.
కొన్నిరకాల హైరిస్క్ ప్రెగ్నెన్సీల్లో డాక్టర్ బెడ్‌రెస్ట్ తీసుకోమని అంటే... దాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే బెడ్‌రెస్ట్ అంటే పూర్తిగా మంచానికే పరిమితం కావడం కాదు. డాక్టర్ సలహా మేరకు కాబోయే తల్లి ఏమేరకు శారీరక శ్రమ చేయాలో... అలాగే ఏ మేరకు విశ్రాంతి తీసుకోవాలో చెబుతారు. దాన్ని అక్షరాలా పాటించాలి.
వైద్యనిపుణులూ, సిబ్బంది సహాయంతో కాంప్లికేషన్ల నివారణ ఇలా...
హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల ప్రసవ సమయంలో కలిగే దుష్పరిణామాలు, ప్రమాదకర పరిస్థితుల (కాంప్లికేషన్స్)ను నివారించడమన్నది ఈ రోజుల్లో చాలావరకు సాధ్యమే. ఇలాంటి రిస్క్‌లు ఉన్న మహిళలు... ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, గుండెజబ్బుల నిపుణుడు, రుమటాలజిస్ట్, నరాల నిపుణుడు అందుబాటులో ఉండే హయ్యర్ మెడికల్ సెంటర్లలో తమ ప్రసవం జరిగేలా చూసుకోవడం మంచిది.
ఫలితంగా ఆ మహిళకు అవసరం ఉన్న వైద్య చికిత్సలను బట్టి ఆ ప్రసవాన్నీ ఎలా ΄్లాన్ చేయాలో అన్నది వైద్యనిపుణులు చర్చించుకుని ఆ మేరకు సురక్షిత ప్రసవం జరగడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోడానికి, వాటిని అమలు చేయడానికి వీలవుతుంది. గర్భిణుల్లో రొటీన్ రక్తపరీక్షలకు తోడుగా... ఆమెకు తన రెండో నెలలోనే రక్తంలో చక్కెర మోతాదులను నిర్ధారణ చేసే పరీక్ష, థైరాయిడ్ పరీక్ష వంటివి నిర్వహిస్తే... పుట్టబోయే బిడ్డ, కాబోయే తల్లి తాలూకు ఆరోగ్య పరిస్థితిని ముందునుంచే తెలుసుకుంటూ ముందస్తు చికిత్స చేయడం... తద్వారా తర్వాతి కాంప్లికేషన్లను నిరోధించడమన్నది చాలావరకు సాధ్యమవుతుంది.
ఇక మూత్రపిండాల (కిడ్నీ) సమస్య ఉన్న మహిళలు, హైబీపీ ఉన్నవాళ్లు, థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, తరచూ అబార్షన్లు అయినవారు గర్భధారణకు ముందే కొన్ని రక్త పరీక్షలు చేయించడం అవసరం, ప్రెగ్నెన్సీ సమయంలో 7–8 వారాలప్పుడే కొన్ని ఇంజెక్షన్లు వాడటం ద్వారా మున్ముందు చోటుచేసుకోబోయే చాలా రకాల ప్రమాదాలను (కాంప్లికేషన్లను) నివారించవచ్చు.
స్కాన్‌ల సహాయంతో...
అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో ముందుగానే గర్భంలోపల ఉన్న పరిస్థితిని తెలుసుకుని తగిన చికిత్స చేయడంతో టు... లోపాలు సరిదిద్దడానికీ ఆ స్కాన్‌లు ఉపయోగపడతాయి. బిడ్డలోని వైకల్యాలను, అసా«ధారణ పరిస్థితులనూ, లో΄ాలను తెలుసుకునేందుకు స్కాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
అల్ట్రాసౌండ్ స్కాన్‌తో 11–14 వారాల సమయంతో గర్భధారణ నిర్దిష్టంగా ఎప్పుడు జరిగింది, గర్భంలోపల ఉన్న బిడ్డ ఒకరా, కవలలా, ఒకవేళ కవలలైతే ఒక వాళ్లు ఒకే అండం నుంచా లేక రెండు వేర్వేరు అండాల నుంచా అన్నది తెలుస్తుంది.
న్యూకల్ ట్రాన్సు్యలెన్సీ స్కాన్ వల్ల చిన్నారిలో క్రోమోజోమ్‌కు సంబంధించిన లోపాలు ఏవైనా ఉంటే అవి పిండ దశలోనే తెలిసి΄ోతాయి. బిడ్డ స్వరూపం (స్ట్రక్చర్) ఎలా ఉందో కూడా కొంతవరకు తెలుస్తుంది. ఇది ఒక రకమైన స్క్రీనింగ్ పరీక్ష.
ఇక 20–22 వారాలప్పుడు చేసే రొటీన్ స్కాన్ వల్ల చిన్నారి పూర్తి స్వరూపం (స్ట్రక్చర్) తెలుస్తుంది. అన్ని అవయవాలూ సక్రమంగా రూ΄÷ందాయో లేదో కూడా తెలిసిపోతుంది.
క్రమం తప్పకుండా చేయించే స్కాన్‌ల వల్ల బిడ్డ మెదడు వంటి అత్యంత ప్రధాన అవయవాల్లో రక్తప్రసరణ వంటి కీలక అంశాలు తెలుస్తాయి. ఫలితంగా పిండదశలోనే ఏవైనా లో΄ాలు ఉంటే వాటిని చక్కదిద్దే అవకాశాలుంటాయి.
ఇలాంటి పలు రకాల స్కాన్‌ల కాంబినేషన్‌లతో ఒక ప్రెగ్నెన్సీలో రిస్క్ మోతాదు ఎంత అన్నది నిర్థారణ చేస్తారు. దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీది హైరిస్కా, తక్కువ రిస్కా, లేదా రిస్కేమీ లేదా అన్నది దాదాపు 90 శాతం వరకు చెప్పగలుగుతారు.
ఇప్పుడు అడ్వాన్స్‌డ్ చికిత్సలూ అందుబాటులో...
గర్భధారణ సమయంలో ఎదురయ్యే రిస్క్‌లకు ఇప్పుడు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో నియోనేటల్ చికిత్స ప్రక్రియలు చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇలాంటి బేబీస్‌కు ఇప్పుడు అన్ని రకాల చికిత్సలు అందిస్తూ వాళ్లు మామూలుగానే మనుగడ సాధించేలా చేయవచ్చు. గతంలో వాళ్లకు న్యూరలాజికల్ సమస్యలు వస్తాయనే భావన ఉండేది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో అలాంటి సమస్యలనూ చాలావరకు అధిగమించవచ్చు.
అలాంటి పిల్లల్లో కొన్ని అవయవాలు అంటే ఉదాహరణకు ఊపిరితిత్తులు అభివృద్ధి కావు. అప్పుడు కొన్ని ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తులను పూర్తిగా అభివృద్ధి చెందేలా చేయవచ్చు. అయితే ఇలాంటి చికిత్సలు– అన్ని అధునాతన సదు΄ాయాలు ఉన్న చికిత్స కేంద్రాల్లో ఉంచి తగిన పరిచర్యలు చేయడం ద్వారా బిడ్డనూ, తల్లినీ సంరక్షించవచ్చు. అలాగే బిడ్డ మానసిక ఎదుగుదలకు, తెలివితేటలకూ థైరాయిడ్ హార్మోన్లు అవసరం.
అలాంటప్పుడు తల్లిలో థైరాయిడ్ లోపాలుంటే వాటిని సరైన సమయంలో పసిగట్టి చికిత్స అందించడం ద్వారా మంచి మానసిక ఆరోగ్యం, తెలివితేటలు ఉండే బిడ్డను కనేలా చేయవచ్చు. కాబోయే తల్లికి బీపీ, షుగర్ వంటివి ఉన్నట్లయితే వాటిని సమర్థంగా నియంత్రణలో పెట్టి తల్లినీ, బిడ్డనూ సంరక్షించవచ్చు.
అందుకే... హైరిస్క్ ప్రెగ్నెన్సీలలో తల్లినీ, బిడ్డనూ సురక్షితంగా ఉంచాలంటే... ముందునుంచే మంచి వైద్యపర్యవేక్షణతో పాటు... కాబోయే తల్లికీ కొంత ప్రాథమిక పరిజ్ఞానం, కొన్ని అంశాలపై అవగాహన, పరిజ్ఞానం ఉండటం అవసరం. అలాంటివి వైద్య నిపుణులు తమ కౌన్సెలింగ్ సమయంలో చెబుతూ ఆమెకూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు.
డాక్టర్ శ్రుతి రెడ్డి పొద్దుటూరు కన్సల్టెంట్ ఆబ్‌స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్
(చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..)


