ఉడికించిన గుడ్లు వర్సెస్ ఆమ్లెట్
ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గుడ్డు! రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్ ఉండే ఎగ్‌ని కొందరు ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు వేడివేడిగా ఆమ్లెట్ వేసికుని లాగించేస్తుంటారు. ఈ రెండు రకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.
కొందరు ఆమ్లెట్ తింటే కడుపు నిండుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు ఉడకబెట్టిన గుడ్డే ఉత్తమం అని వాదిస్తారు. మనం గుడ్డును వండే విధానం, అందులో కలిపే ఇతర పదార్థాల వల్ల దాని పోషక విలువలు ఎలా మారిపోతాయో తెలిస్తే.. మన ఫిట్‌నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో సులభంగా ఎంచుకోవచ్చు.
మీరు క్యాలరీలను చాలా ఖచ్చితంగా లెక్కబెడుతూ డైట్ ఫాలో అవుతుంటే, నిస్సందేహంగా ఉడకబెట్టిన గుడ్డుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో దాగి ఉన్న కొవ్వులు లేదా అదనపు క్యాలరీలు ఉండే అవకాశం అస్సలు లేదు. అయితే, కూరగాయలతో పక్కాగా తయారుచేసిన ఆమ్లెట్‌కు మరో ప్రత్యేకమైన ప్లస్ పాయింట్ ఉంది. రెండు గుడ్లకు ఎక్కువ కూరగాయలు కలిపి వేసుకునే ఆమ్లెట్ ఎక్కువ క్వాంటిటీని ఇస్తుంది. ఇది మీ ఆకలిని సమర్థవంతంగా అణిచివేసి, జంక్ ఫుడ్స్ తినకుండా నియంత్రిస్తుంది. ఇందుకే చాలా మంది న్యూట్రిషనిస్టులు మీ డైట్ అవసరాలను బట్టి రోజు మార్చి రోజు ఈ రెండింటినీ మార్చుకుంటూ తినాలని సలహా ఇస్తుంటారు.
చివరగా చెప్పాలంటే.. బరువు తగ్గాలనుకునే వారి హెల్తీ డైట్‌లో ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ రెండూ కూడా అద్భుతమైన భాగాలే. మీ జీవనశైలికి, మీ రుచికి ఏది కంఫర్ట్‌గా ఉంటే దానిని సరైన పద్ధతిలో వండుకుని తినడమే అత్యుత్తమం.


