
మన దేశంలో ఈ దసరా పండుగ పలు సంప్రదాయాలకు అనుగుణంగా విభిన్నంగా చేసుకుంటుంటారు. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదే పండుగ పర్యాటక ప్రేమికులు ఇష్టపడే హిమచల్‌ప్రదేశ్ కులుమనాలిలోని కులు లోయలో ఎలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోతారు. ఈ పండుగను అక్కడ అత్యంత విచిత్రంగా నిర్వహిస్తారు. అన్నిచోట్ల నవరాత్రులు విజయదశమితో ముగిస్తే..అక్కడ ఆ రోజు నుంచి మొదలవుతాయట. ఇదేంటని అనుకోకండి. ఎందుకంటే అందుకు ఓ పెద్ద స్టోరీనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం చకచక చదివేయండి..
కులు లోయలో జరిగే ఈ పండుగ ప్రపంచంలోని ప్రత్యేకమైన పండుగలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. మనకు దసరా పాడ్యమి నుంచి మొదలై విజయ దశమితో మగుస్తాయి. కానీ ఈ కులు లోయలో విజయదశమి రోజు నుంచి మొదలై.. సరిగ్గా వారం రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఇది 375 ఏళ్ల నాటి పండుగ అట. సింపుల్‌గా చెప్పాలంటే సుమారు 17వ రాజా జగత్ సింగ్ ఆధ్వర్యంలో రూపుదొద్దుకుందట. అలా అప్పటి నుంచి అదే ఆచారంలో నిర్వహిస్తున్నారట ఈ దసరా వేడుకని. ఈ పండుగ వెనుకున్న ఆసక్తికర కథేంటంటే..
శాపం నుంచి వచ్చిన పండుగ..
పురాణ కథనాల ప్రకారం..దుర్గా దత్ అనే బ్రహణుడు వద్ద ముత్యాల గిన్నె ఉంది. అది అందరిని అమితంగా ఆకర్షించేది. గిన్నె గురించి కులు లోయ రాజు రాజా జగత్ సింగ్‌కి తెలుస్తుంది. అలాంటి వస్తువులు తనలాంటి వాళ్ల వద్ద ఉండాలన్న అహకారంతో తన భటులకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజు సైనికులు ఆ దుర్గా దత్ అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ధౌర్జన్యం చేసి మరి తీసుకువెళ్లే సాహసం చేస్తారు భటులు.
దాంతో ఆ బ్రహ్మణుడు కోపంతో ఆ భటులతో ఆ గిన్నె కోసం ఆ రాజే స్వయంగా వచ్చి తీసుకోవాలని చెబుతాడు. దీని కోసం మా రాజు గారు రావాలంటావా నీకెంత ధైర్యం అంటూ ఆ బ్రహ్మణుడిని అతడి కుటుంబాన్ని అతడి ఇంటిలోనే సజీవదహనం చేసేస్తారు సైనికులు. అయితే ఆ బ్రహ్మణుడు దుర్గాదత్ చనిపోతూ.. నీ దురాశకు తగిన ఫలితం అనుభవిస్తావంటూ రాజుని శపిస్తాడు.
అది మొదలు రాజు జగత్‌సింగ్‌కి ఆ బ్రహ్మణుడి కుటుంబ సభ్యుల ఆత్మలు కలలోకి వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఫలితంగా రాజుకి కంటిమీద కునుకు కరువై రోజురోజుకి అతడి ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ వార్త రాజ్యమంతా దావానలంలా వ్యాపిస్తుంది. ఇది తెలుసుకున్న కృష్ణ దత్(పహారి బాబా) అనే బైరాగి రాజుని కలిసి తక్షణమే రాముడి శరణు కోరమని సూచిస్తాడు.
దాంతో రాజు రఘనాథుడుని ఆహ్వానించేందుకు కులు లోయ చుట్టుపక్కల ఉండే గ్రామ దేవతలందరిని ఆహ్వానిస్తాడు.
ఆ గ్రామ దేవతలను సుమారు 300కి పైగా పల్లకిలపై ఘనంగా తీసుకువచ్చి సమావేశపరిచి..రాముడి కరుణ పొందుతాడు. అలా ఏటా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రజారంజకంగా పాలన సాగించాడు. అలా ఆ రాజు శాపం నుంచి విముక్తి పొందాడు. ఆ రాజు ఈ పండుగను సరిగ్గా విజయ దశమి రోజున నుంచి గ్రామ దేవతలను ఆహ్వానించడం మొదలుపెట్టాడు. అలా మొదలైన ఆచారం నేటికి నిరాటంకంగా అదే సంప్రదాయంలో జరుగుతుండటం విశేషం.

ఎలా జరుగుతుందంటే..
ఈ పండుగను వారం రోజులపాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2 నుంచి మొదలై ఈ నెల 8తో ముగుస్తుంది. అంటే విజయదశమి రోజున ప్రారంభమై, ఒక వారం తర్వాత కులులోని ధల్పూర్ మైదానంలో ముగుస్తుంది. కాలినడకన పల్లకీల్లో చుట్టుపక్కల గ్రామ దేవతలను తీసుకురావడం అనేది రోజుల తరబడి సాగుతుందట.
అది కూడా డ్రమ్స్, నృత్యాలతో సాదరంగా ఆ గ్రామ దేవతల్ని కులు రాజ్యానికి తీసుకువచ్చి దేవతలందరి సమావేశ పరిచి రాముడని ఘనంగా సత్కరిస్తారట. అన్ని చోట్ల విజయదశమి రోజున రావణ దహనం వంటివి నిర్వహిస్తే..ఇక్కడ రాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకునేందుకు గ్రామదేవతలను పిలవడం విశేషం.
(చదవండి: కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో నవరాత్రి పూజలు..)