
నిర్మల వాణి
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆదిశక్తి అనేక అవతారాలు తీసుకోవడం జరిగింది. అందుకు ప్రతీకగానే అమ్మను దేవీ నవరాత్రులలో నవ దుర్గలుగా ఆరాధిస్తాము. నవరాత్రులుగా మనం జరుపుకునే 9 రోజులు అతి ముఖ్యమైన పవిత్రమైన పర్వదినాలు. అతి రౌద్ర రూపిణి, రాక్షస సంహారిణి అయిన దుర్గాదేవి ఈ రోజులలో తన విజయోత్సవంతో అతి కరుణామయిగా, ప్రసన్న వదనంతో ఉంటుంది. తనను నమ్ముకుని, సంపూర్ణ సమర్పణతోను, భక్తి ప్రపత్తులతోను ఆరాధిస్తున్న తన భక్తుల కోరికలను నెరవేరుస్తుందనేది ప్రగాఢ విశ్వాసం.
మానవులలో సూక్ష్మ ధర్మాలు శక్తుల రూ΄ాలలో వుంటాయి. అయితే భగవంతుడు మనలో స్థిరపరచిన ధర్మాలను మనం తప్పుతూ వుండడం వలన అంటే ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోవడం వలన మానవుడు అనేక ఇబ్బందులకు, సమస్యలకు లోనవడం జరుగుతోంది. మానవ శరీరంలోనే వున్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, శ్రీ మహా కాళీ శక్తుల ద్వారా ఆ దేవియే అంతర్గతంగా మనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. ‘‘యాదేవి సర్వ భూతేషు’’ అంటే ఆమెయే అన్ని ప్రాణులలోనూ వుంది.
ప్రత్యేకించి దేవి నవరాత్రులలో దేవీ మహాత్మ్యంలో వివరించిన సప్తశతీ శ్లోకాలలో దేవీసూక్తం తప్పక చదవాలి. దానిలో ఒక విశిష్టత వుంది. ఉదాహరణకు
‘‘యాదేవి సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితా’’
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమోనమః’’
అంటే దేవి మనుష్యులలో శాంతి రూపంలో వుంటుందని. ఆమె మన లోపల, బాహ్య పరంగాను శాంతిని ప్రసాదించింది. ఆమె అనుగ్రహించిన ఆ శాంతిని మనం సాధించాలి. ఆస్వాదించాలి. అలా మనం వుండగలుగుతున్నామా? లేదా? అని మనం పరిశీలన చేసుకోవాలి.
మరొకటి – యాదేవి సర్వ భూతేషు ప్రీతి రూపేణా సంస్థితా ...’’ ప్రీతి అంటే ప్రేమించే గుణం. ప్రేమించే గుణం మానవులకు అనుగ్రహించ బడింది. ప్రేమంటే మంగళకరమైన, ధర్మబద్ధమైన, ఏ కోరిక, ఏ కామం, అసూయలు లేకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇతరులను ప్రేమతో చూడటం.
కానీ మానవులలో పేరుకు పోయి ఉన్న అసూయ అనే పనికిమాలిన గుణం వలన ప్రేమించే గుణానికి విరుద్ధంగా ప్రవర్తించడం వలననే దేవికి ఆగ్రహం తెప్పిస్తున్నాం. సమస్యలు కోరి తెచ్చుకుంటున్నాం.
అలాగే –‘‘యాదేవి సర్వ భూతేషు క్షమా రూపేణా సంస్థిత .. ’’ అని చెప్పబడింది. క్షమాగుణం అంటే ఇతరుల తప్పులను మన్నించడం. ఆ క్షమించడం మీ హృదయం నుండి రావాలి. ఎవరో మీ పట్ల అమర్యాదగా, అసభ్యంగా, క్రూరంగా ప్రవర్తిస్తారు లేదా వారి స్వలాభం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. అయితే దేవి మనలో స్థిరరపరచిన ఆ క్షమాశక్తిని మనం ఉపయోగిస్తున్నామా ? లేదా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి.
‘‘యా దేవీ సర్వ భూతేషు: నిద్రారూపేణాసంస్థితా .. ‘‘మీరు అలసిపోయినప్పుడు, నిద్ర పోలేనప్పుడు ఆమె మీకు నిద్రను ప్రసాదిస్తుంది. మీకు సేద తీరుస్తుంది. ఆమెకు మిమ్మల్ని విశ్రాంతి పరిచే శక్తి వుంది. ఇదంతా మనలోని నాడీ వ్యవస్థ ద్వారా ఆమె చేయిస్తుంది.
‘‘యాదేవీ సర్వ భూతేషు భ్రాంతి రూపేణా సంస్థితా ...’’ ఆమె మిమ్మల్ని మాయలో పడేస్తుంది. ఎందుకంటే వారలా భ్రాంతిలో పడితే గాని ఆమె పిల్లలమైన మనం ఆమె గురించి ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేము. స్త్రీలకు, పురుషులకు ఈ మాయా, ఈ భ్రాంతి రకరకాలుగా కలగజేస్తుంది.
మరొక శక్తి. ‘‘యాదేవీ సర్వ భూతేషు లజ్జా రూపేణా సంస్థితా ...’’ అని. లజ్జ అంటే సిగ్గు కాదు. మీ శరీరం గురించిన ఒక విధమైన అవమానం. మనకు భగవంతుడు చక్కని శరీరాన్ని ప్రసాదించాడు. స్త్రీలయినా, పురుషులయినామనం మన కళను ఉపయోగించి దానిని సందర్భానికి తగినట్లుగా చక్కటి వస్త్ర ధారణతో అలంకరించుకోవాలి.
‘‘యాదేవీ సర్వ భూతేషు క్షుధా రూపేణా సంస్థితా ...’’ మనకు ఆకలిని ప్రసాదించేది కూడా ఆ దేవియే. మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజుల్లో సన్నగా ఉండటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. లేక మరేదైనా కారణాల వలన మీరు తినవలసినంత ఆహారం తినడం లేదు. ప్రత్యేకించి శక్తి స్వరూపిణులైన స్త్రీలు ఆహారం చాలా తక్కువగా తీసుకుంటున్నారు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీ జీవిత ధ్యేయం కేవలం శరీరం గురించి జాగ్రత్త తీసుకోవడమే కాదు. ఆత్మ గురించి జాగ్రత్త పడడం, ఆత్మసాక్షాత్కారం పొంది ఆత్మ స్వరూపులుగా వ్యక్తీకరింపబడడమే మీ ధ్యేయం కావాలి.
మీరు దేవీ సూక్తం పూర్తిగా చదవండి. దేవి ప్రసాదించిన ఈ గుణాలన్నీ మీలో అంతర్గతంగా ఉన్నాయా? లేవా? అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.
ఈ దేవీ నవరాత్రులలో దేవీసూక్తం, దేవీ అధర్వ శీర్షం, అర్గళా స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం, మన శరీరంలోనూ, సూక్ష్మ శరీరంలోని అంగాం గాలలో ఉంటూ మనల్ని సంరక్షిస్తూ ఉన్న ఎందరో దేవీ దేవతలను ఆరాధించే దేవీ కవచం లాంటి ఎన్నో దేవిని ప్రసన్నం చేసుకునే సంస్కృత శ్లోకాలు, స్తుతులు ఉన్నాయి. వాటిని కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా వాటి భావార్థం తెలుసుకుని చదవడం చాలా మంచిది.
ప్రస్తుత పరిస్థితులలో చాలామంది ఆమె ప్రసాదించిన ఈ ధర్మాలను ఏవేవో కారణాలు చెప్పుకుని ఆచరించడం మానుకున్నారు. అందుచేత వ్యక్తిగతపరంగా కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించాలి.
చదవండి: మిలన్ ఫ్యాషన్‌వీక్ : రొటీన్‌గా కాకుండా బోల్డ్ లుక్‌లో మెరిసిన ఆలియా
వీటిని మీ కుండలినీ జాగృతి ద్వారా, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా మీరు తిరిగి జాగృత పరచుకోవాలి. ఈ ప్రపంచాన్ని కలియుగ ధర్మం ప్రభావాలనుండి రక్షించాలనుకుంటే అది కేవలం మీ ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారానే సాధ్యమవుతుంది. మనలోనే నిక్షిప్తమై వున్న కుండలినీ శక్తి జాగృతమై సహస్రారం దగ్గర ఛేదించు కుని వచ్చి బాహ్యంగా వున్న పరమాత్ముని పరమ చైతన్య శక్తితో అనుసంధానం కావడమే ఆత్మ సాక్షాత్కారం.
ఇదీ చదవండి: Weight Loss వెయిట్ లాస్‌లో ఇవే మెయిన్ సీక్రెట్స్
పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించిన సహజ యోగా ధ్యానసాధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో సాధకులు ఈ నవరాత్రి పర్వదినాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
– డాక్టర్ పి.రాకేష్
( శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)