దేవి నవరాత్రులు: నవ దుర్గలు... వర్ణాలు | Dussehra 2025: Durga Navaratri the Goddess is worshipped in nine forms | Sakshi
Sakshi News home page

దేవి నవరాత్రులు: నవ దుర్గలు... వర్ణాలు

Sep 24 2025 5:31 PM | Updated on Sep 24 2025 6:42 PM

Dussehra 2025: Durga Navaratri the Goddess is worshipped in nine forms

దేవీ నవరాత్రులు వచ్చాయి. ఈ తొమ్మిది రోజులూ భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టి నృత్య గానాలు చేసి భక్తి పారవశ్యంలో ఓలలాడుతుంటారు. అయితే అమ్మవారికి రోజుకో నైవేద్యం పెట్టినట్లే రోజుకో రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అంతేకాదు, తాము కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి, అమ్మవారి అనుగ్రహాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నవరాత్రులలో ఇప్పటికే రెండు రోజులు గడచిపోయాయి. మిగిలిన రోజుల్లో అయినా అమ్మవారిని ఆమెకు ఇష్టమైన రంగులతో అలంకరిద్దాం. అమ్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. 

1. శైలపుత్రి: మొదటి రోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. శైలపుత్రి అలంకారం బలానికి, శక్తికి ప్రతీక అయితే, ఎరుపు రంగు అభిరుచికి, ధైర్యానికి సూచిక. 
నైవేద్యం: పులిహోర, కట్టు పొంగలి

2. బ్రహ్మచారిణి: నీలం రంగు
నీలవర్ణం నిశ్శబ్దానికి, ప్రశాంతతకు, భక్తికి ప్రతీక అయితే, బ్రహ్మచారిణి అమ్మవారు క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడేలా చేసి, ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. 
నైవేద్యం: కొబ్బరి అన్నం, పాయసాన్నం

3. చంద్రఘంట: భక్తులు చంద్రఘంటాదేవిని సౌందర్యానికి, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మను ఆరాధించడం వల్ల భయం, ప్రతికూలతలు తొలగుతాయని నమ్ముతారు. ఈ రోజున సంతోషానికి, సానుకూల భావనలకు చిహ్నమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు.
నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు

4. కూష్మాండ: ఈ అలంకారంలో అమ్మవారు సాక్షాత్తూ ఈ విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఏ పనినైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు అలవడతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించే ఆకుపచ్చ రంగు ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. ఆకుపచ్చ వృద్ధికి, ఉపశమనానికి సంకేతంగా నిలుస్తుంది. 
నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం

5. స్కందమాత: స్కందుడు అంటే కార్తికేయుడు అంటే కుమారస్వామి. అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడంతోపాటు ధైర్యం కూడా లభిస్తుంది. ఈ అమ్మవారికి ధూమ్రవర్ణం అంటే బూడిదరంగు ఇష్టం. బూడిద రంగు సమతుల్యతకు, స్థిరత్వానికి, తెలివితేటలకూ చిహ్నం. 
నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం

6. కాత్యాయని: ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడంతో΄ాటు సమస్యలను ఎదుర్కొనే శక్తి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. కాత్యాయనీ దేవికి ఇష్టమైన నారింజ రంగు ధైర్యానికి, జిజ్ఞాసకు, పరివర్తనకూ ప్రతీక. 
నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం

7. కాళరాత్రి: దుర్గాదేవి రౌద్రరూపానికి ప్రతీకగా కాలరాత్రి అమ్మవారిని సంభావిస్తారు. ఈ అమ్మవారి ఆరా«దనతో భయాలు తొలగి, దేనినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం కలుగుతుందంటారు. ఈమెకు ప్రీతికరమైన తెలుపు రంగు స్వచ్ఛతకు, ప్రశాంతతకూ ప్రతీక. 
నైవేద్యం : కదంబం, శాకాన్నం

8. మహాగౌరి: సంతోషానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయిన ఈ అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రాలను ధరించడం వల్ల కరుణ భావనలు కలుగుతాయి. మనసుకు ప్రశాంత చేకూరుతుంది. 
నైవేద్యం : చక్కెర పొంగలి

9. సిద్ధిదాత్రి: ఈ అమ్మవారి ఆరాధన వల్ల అతీంద్రియ శక్తులు సిద్ధిస్తాయని, విజ్ఞానం, సంపద చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఈమెకు ప్రీతికరమైన ఊదారంగు శక్తికి, ఆధ్యాత్మికతకు, ఆశయ సాధనకూ తోడ్పడుతుంది,  
నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు.

రంగులు.. మానసిక ప్రభావం
ఏ రోజుకు నిర్దేశించిన రంగును ఆ రోజున వాడటం వల్ల మనసుకు ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలతోపాటు మనస్తత్వ నిపుణులు కూడా చెబుతారు. 
– డి.వి.ఆర్‌. 

(చదవండి: 'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement