దానం చేసే మనసు! | Donation is a wonderful feeling | Sakshi
Sakshi News home page

దానం  చేసే  మనసు!

Jun 22 2026 12:46 AM | Updated on Jun 22 2026 12:46 AM

Donation is a wonderful feeling

తాత్త్వికథ

ప్రతి ΄పౌర్ణమికీ ఆ ఊరిలో సత్సంగం జరుగుతుంది. ఒక ΄పౌర్ణమి నాడు ప్రవచన కర్త దానం గురించి వివరిస్తున్నారు. ఆయన దానం విశిష్టతను తెలియజేస్తూ, ‘దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటే’ అని చెప్పారు. దానాలన్నింటిలోనూ అన్నదానం, విద్యాదానం, గోదానాలు చాలా గొప్పవని, దానం చేసేటప్పుడు కలిగే అలౌకిక ఆనందం వర్ణనాతీతమని వివరించారు. ఆ ప్రవచనానికి వచ్చిన ఒక యువకుడు అక్కడి నుంచి నిరాశతో... కోపంతో వెళ్ళిపోవడానికి లేచాడు. ప్రవచనకర్త అతడిని బుజ్జగిస్తూ, ‘ఎందుకు నాయనా, వెళ్ళిపోతున్నావు?’ అని అడిగారు.

దానికి ఆ యువకుడు, ‘చెప్పడం సులభం, చేయడం కష్టం. మీరేమో దానం గొప్పదని చెబుతున్నారు. నాలాంటి వాడికి దానం చేయడం ఎలా కుదురుతుంది? అన్నదానం చేయాలంటే డబ్బు ఉండాలి, నా దగ్గర డబ్బు లేదు. చిన్న రైతునైన నా ఆదాయం చాలా తక్కువ. పోనీ విద్యాదానం చేద్దామంటే నేను అంతగా చదువుకోలేదు. అలాగే మా ఇంట్లో పశువులు లేవు, కాబట్టి గోదానం చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి మీరు చెప్పేవేవీ ఆచరణకు యోగ్యం కావని నిరాశతో వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.

ప్రవచనకర్త చిరునవ్వు నవ్వి, ‘దానమంటే అవే కాదు నాయనా! నీవు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి, పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి రక్తదానం చేయి. అది మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది’ అని సూచించారు. ‘నిజమే కదా’ అనిపించింది ఆ యువకుడికి. మరుసటి వారమే పట్టణానికి వెళ్ళి రక్తనిధి కేంద్రంలో రక్తమిచ్చి వచ్చాడు. అయితే, రక్తదానం చేసిన అతడికి ప్రవచనకర్త చెప్పినంత గొప్ప అనుభూతి ఏదీ కలగలేదు. మరలా వచ్చే ΄పౌర్ణమి రోజున ప్రవచనకర్త ఊరి రచ్చబండ వద్దకు వచ్చారు. ‘రక్తమిచ్చాను కానీ అందులో నాకు ప్రత్యేకమైన ఆనందమేదీ కలగలేదు’ అని చెప్పాలని ఆ యువకుడు అక్కడికి వెళ్ళాడు. అయితే, అక్కడ ఆ యువకుడి కోసం ఒక వృద్ధ జంట ఎదురుచూస్తోంది.

వారు ఎంతో గౌరవంగా ఆ యువకుడికి మిఠాయిలు, పండ్లు ఇచ్చి చేతులెత్తి దణ్ణం పెట్టారు. ఆశ్చర్యంగా వారివైపు చూశాడు ఆ యువకుడు. ‘ఈ మధ్య మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పుడు మీరు ఇచ్చిన రక్తం అతడి ప్రాణాన్ని కాపాడింది. అందుకే మీకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చాం’ అని వారు చెప్పారు. ఆ మాటలతో యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దానం చేయడానికి సంపద కన్నా గొప్ప మనసు ఉంటే చాలని అతడికి అర్థమైంది. వెంటనే ప్రవచనకర్త వైపు తిరిగి తలవంచి నమస్కరించాడు.

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement