
యువకుడికి తీవ్రమైన గుండె సమస్యలు, గుండె కవాటంలో లీకేజిలు
రెట్టింపు సాగిపోయిన బృహద్ధమని వాటికి తోడు వీఎస్డీ సమస్య కూడా
సంక్లిష్టమైన శస్త్రచికిత్సతో కాపాడిన కామినేని వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 27, 2025: నగరానికి చెందిన 31 ఏళ్ల యువకుడికి అత్యంత అరుదైన, తీవ్రమైన గుండె సమస్యలు వచ్చాయి. గుండె కవాటంలో లీకేజిలు ఏర్పడడంతో పాటు బృహద్ధమని విపరీతంగా సాగిపోయింది. లీకేజి కారణంగా రక్తం శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లకుండా తిరిగి గుండెలోకే వచ్చేస్తోంది. దీంతో అతడికి కాళ్లు వాపులు, ఊపిరి అందకపోవడం లాంటి పలు సమస్యలతో ఇబ్బంది పడుతూ, తన రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వీటన్నింటికీ తోడు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడే వీఎస్డీ అనే సమస్య కూడా ఆ యువకుడికి ఉంది. ఇన్ని సమస్యలున్న రోగికి ఒకే శస్త్రచికిత్సలో అన్నింటినీ నయం చేసి.. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు ప్రాణదానం చేశారు. అది కూడా ఏకంగా గంటన్నర పాటు గుండెను ఆపేసి, దాని బదులు మిషన్ సాయంతో గుండె పని కొనసాగిస్తూ శస్త్రచికిత్స చేశారు. అతడికి వచ్చిన సమస్య, చేసిన చికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రిషిత్ బత్తిని తెలిపారు.
‘‘ఆ యువకుడికి గుండె కవాటంలో లీకేజీల కారణంగా రక్తం చాలావరకు మళ్లీ గుండెలోకి వచ్చేస్తుంది. దానికితోడు బృహద్ధమని కూడా సాగుతూ వచ్చింది. మామూలుగా అయితే 3 సెంటీమీటర్లు ఉండాల్సింది ఏకంగా 6 సెంటీమీటర్లు ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే పగిలిపోవడం గానీ, లేదా చీలిపోవడం గానీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు రోగి బతికే అవకాశం చాలా తక్కువ. వీటన్నింటికీ తోడు అతడికి గుండెగోడల మధ్య పెద్ద రంధ్రం (వీఎస్డీ) ఉంది.
ఇన్ని సమస్యలకు కలిపి ఒకే శస్త్రచికిత్స.. బెంటాల్స్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ముందు గుండెను ఆపేసి దానికి బదులు మిషన్ పెడతాం. మొత్తం శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే మళ్లీ గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఇలా ప్రధానమైన శస్త్రచికిత్స జరగిన గంటన్నర సమయం పాటు అతడి గుండె ఆపేశాం. శస్త్రచికిత్సలో ముందుగా రోగి బృహద్ధమనిని పూర్తిగా తీసేసి కృత్రిమ వాల్వు అమర్చాం. దాంతోపాటు పైకివెళ్లే ధమనిని కూడా మార్చాం. అక్కడ కృత్రిమ వాల్వ్ ఏర్పాటుచేశాం. ఇంకా, బృహద్ధమని మూలాన్ని కూడా పునర్నిర్మించి, గుండెలో ఇతర లోపాలను కూడా సరిచేశాం. అవన్నీ చేసిన తర్వాత రక్తనాళాలను కూడా మళ్లీ రీప్లాంట్ చేశాం.

ఇదంతా చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స. ఎందుకంటే, బృహద్ధమని 6 సెంటీమీటర్లకు సాగిపోవడం వల్ల అది బాగా పల్చబడిపోతుంది. కుట్లు వేయడం కష్టం, రక్తస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. రక్తనాళాలు రీప్లాంట్ చేసేటప్పుడు కొంతమంది రోగులకు గుండె వైఫల్యం జరిగే అవకాశాలుంటాయి. అందుకే ఇది చాలా హైరిస్క్ శస్త్రచికిత్స. ఇక ఈయనకు వీఎస్డీ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇది మామూలుగా పుట్టుకతోనే ఉంటుంది. ముందే గమనించి శస్త్రచికిత్స చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గమనించకపోతే ఆ రంధ్రం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చెడురక్తం వెళ్లి మంచిరక్తంలో కలిసిపోయి శరీరం నీలంగా మారిపోతుంది. ఇంత పెద్ద వీఎస్డీ ఉన్నవాళ్లు ఇన్నాళ్లు ఉండరు. కానీ, ఇక్కడ బృహద్ధమని పెరగడంతో, అది ఆ రంధ్రాన్ని కొంతవరకు మూసేసింది.
ఇలాంటి సమస్యలు 30-50 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంటాయి. అది కూడా 10-15 వేల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. సరైన సమయానికి గుర్తించి శస్త్రచికిత్స చేయకపోతే వాల్వు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ శస్త్రచికిత్స చేయకముందు అతడి గుండె పనితీరు 20-30% కు పడిపోయింది. చేసిన తర్వాత 90%కు చేరుకుంది. చాలామందికి ఇలాంటి శస్త్రచికిత్సలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కేసులో కనీసం ఒక్క యూనిట్ రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం రాలేదు. అంత సురక్షితంగా చేయగలిగాం. రోగి చాలా త్వరగా కోలుకున్నారు. ఐసీయూ నుంచి వార్డుకు మూడోరోజే మార్చేశాం. శస్త్రచికిత్స జరిగిన ఐదోరోజే డిశ్చార్జి చేశాం. ఈ శస్త్రచికిత్సలో చీఫ్ కార్డియాక్ అనెస్థెటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్, అనెస్థెటిస్ట్ డాక్టర్ రవళి, పెర్ఫ్యూజనిస్టులు డాక్టర్ పవన్, డాక్టర్ దుర్గ పాల్గొన్నారు’’ అని డాక్టర్ రిషిత్ బత్తిని వివరించారు.
వరల్డ్ హార్ట్ డే 29 సెప్టెంబర్ ను ఈ సందర్బంగా కామినేని హాస్పిటల్స్ లో హార్ట్ చెకప్ క్యాంపును నిర్వహిస్తుంది. ఈ శిబిరం లో డాక్టర్ కన్సల్టేషన్ పై 30శాతం, ఇన్వెస్టిగేషన్స్ పైన 20 శాతం రాయితీ అందిస్తోంది. ఈ సదుపాయం సెప్టెంబర్ 29 అక్టోబర్ 11 అందుబాటులో ఉంటుంది