ఈ అమావాస్య పితృదేవతా ప్రీతికరం
సంవత్సరంలోని 12 అమావాస్యలు పితృదేవతలను పూజించడానికి శ్రేష్ఠమైనవే! అయితే భాద్రపద బహుళ అమావాస్య ఒక్కదానికే మహాలయ అమావాస్యగా పేరు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజు మాత్రం పితృదేవతల అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటించాలి!. సాధారణంగా పితృతర్పణాలు వదిలేందుకు మధ్యాహ్నం 12 గంటల సమయం సరైనది కాబట్టి ఈ సమయంలోనే పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టాల్సి ఉంటుంది.
మహాలయ అమావాస్య రోజు పితృదేవతల అనుగ్రహం కోసం పాటించాల్సిన పరిహారాలు.
మహాలయ అమావాస్య రోజున నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలాలి. తీవ్రమైన పితృదోషాలు ఉన్న వారు తిల హోమం చేయడం ద్వారా దోషాలను తొలగించుకోవచ్చు.
సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే
పితృదోషం కారణంగా ఏర్పడే కష్టాలన్నీ తొలగుతాయి.
పితృదోష పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు 108 సార్లు గాయత్రీ మంత్రం జపించాలి.
ఈ దానాలు శ్రేష్ఠం
పితృదేవతలకు సద్గతులు కల్గించి, సుఖశాంతులు, వంశాభివృద్ధి పొందాలంటే మహాలయ అమావాస్య రోజు చేయాల్సిన దానాలు...
మహాలయ అమావాస్య రోజు పండితులకు లేదా పేదలకు భోజనం పెట్టి, వస్త్ర దానం చేయాలి. శక్తి ఉన్నవారు స్వర్ణ దానం, గోదానం, భూదానం కూడా చేయవచ్చు.
మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణునికి కూష్మాండం అంటే గుమ్మడికాయను దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.
మహాలయ అమావాస్య రోజు ఉప్పు, పత్తి, ఇనుము, కొత్త బట్టలు, బియ్యం వంటివి దానం చేస్తే పితృదోషాలు తొలగి సకల శుభాలు, ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
జాతకం ప్రకారం రాహు, కేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఒక్క మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించడం వల్ల కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
(10, శనివారం మహాలయ అమావాస్య)
– డి.వరలక్ష్మి
ఇదీ చదవండి: సక్కటి బతుకునీయవే తల్లీ!


