ఆ స్వరం మూగబోయినా...ఆయన అందరివాడే! | DD News Anchor Shanti Swaroop Passed Away, Check His Old Inteviews By Sakshi - Sakshi
Sakshi News home page

Shanti Swaroop ఆ స్వరం మూగబోయినా...ఆయన అందరివాడే!

Published Fri, Apr 5 2024 11:15 AM

DD news anchor Shanti Swaroop passed away chek his old inteviews by sakshi - Sakshi

టీవీ వల్లే... అందరివాణ్ణయ్యా!

తొలి తరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్‌ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్‌లో న్యూస్‌ రీడర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన స్వరం తెలుగు వారికి సుపరిచితం.

ఎంతోమంది న్యూస్‌ రీడర్లకు, వ్యాఖ్యాతలకు ప్రేరణగా నిలిచారు. తన గాత్రంతో ఎన్నో వార్తలను, సంచలనాన్ని, విజయాల్ని, విషాదాలను  ప్రేక్షకులకు  చేరవేసిన ఆయన మరణం అభిమానులను తీరని విషాదంలో ముంచేసింది. ఆయన భౌతికంగా మూగబోయినా.. ఆ స్వరం మాత్రం ఆ  చంద్ర తారార్కం...!

2014లో శాంతి స్వరూప్‌ గారితో సాక్షి, ఫ్యామిలీ ప్రతినిధి డా. పురాణపండ వైజయంతి  సంభాషణ  పాఠకుల కోసం..

టీవీ వల్లే... అందరివాణ్ణయ్యా!
తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే...  అందరికీ గుర్తుకు వచ్చేది శాంతిస్వరూప్.
పేరుకు తగ్గట్టుగా... మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే..!
వార్తలు... సమాచారం... ‘జాబులు - జవాబులు’...
‘ధర్మసందేహాలు’ కార్యక్రమం... ఇలా
దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేశారు..

తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్‌ని నేనే. మొదటి బులెటిన్... 1983 నవంబరు 14న  తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా నన్నే నియోగించారు. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చే శాం. ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివాను. ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా మెదుల్తూనే ఉన్నాయి.

మాకు ఆ రోజుల్లో ఎదురుగా తెరపై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేవు. అందువల్ల నేను విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకునేవాడిని. నా కొలీగ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. నేను ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి తెలుగు వార్తలు పూర్తయిన వెంటనే రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి హిందీ వార్తలు వస్తాయి. అక్కడ వాళ్లకి టెలీ ప్రాంప్టర్లు ఉన్నాయి. వాళ్లు పేపరు చూడకుండా చదువుతారు. వారికి ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం చిన్న పిల్లవాడిలాఅంతా వల్లె వేసి, జ్ఞాపకం ఉంచుకునేవాడిని. ప్రతిరోజూ నా జ్ఞాపకశక్తికి అది ఒక పరీక్ష.

సందర్భోచితంగా... వార్తలలోని మూడ్ ప్రేక్షకులకు అందాలనేది నా ఉద్దేశం. భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో నేను సంతాప వార్తలా ముఖ కవళికలు ఉంచి చదవలేను. అలాగని గట్టిగా అరవనూ లేను. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటివారికి చెబుతున్నట్లుగానో చదివేవాడిని.

మధురజ్ఞాపకాలు... కేంద్ర ప్రభుత్వం నుంచి ‘షా కమిషన్’ కి సంబంధించిన పది పేజీల రిపోర్టు ఇంగ్లీషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్‌కి వచ్చేది. దానిని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే నేను ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవాడిని. ఆ పనిని నేను సవాలుగా తీసుకున్నాను. ఏ తప్పు జరగకుండా చేస్తున్నందుకు కొంచెం గర్వంగా అనిపించేది. మా పై అధికారులంతా నన్ను మెచ్చుకునేవారు.

మరో సంఘటన... పదహారు సంవత్సరాల అమ్మాయి తన వదినగారు తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైలు ఎక్కిందట. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగేసరికి, ‘శాంతి స్వరూప్ మా మేనమామ. ఆయన్ని చూడటానికి వెళుతున్నాను’ అని చెప్పిందట. ఆ టీసీ సహృదయంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. పోలీసు లు విచారణ చేసి, ఆ అమ్మాయి అన్నగారిని పిలిపించి, ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ‘‘నా పెళ్లికి మీరు తప్పక రావాలి’’ అని నా దగ్గర మాట తీసుకుంది. అలా తెలుగువారందరికీ కుటుంబ సభ్యుడిలా అయ్యానంటే అది దూరదర్శన్ చలవే. దాన్నిబట్టి దూరదర్శన్ ఎంత శక్తిమంతమైన మాధ్యమమో అర్థం అవుతుంది.

ప్రభావం... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం.  సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు, మార్పులు వచ్చాయి. వీటివల్ల నేటి యాంకర్లు కష్టపడవలసి వస్తోంది. అయితే ఔట్‌పుట్ మాత్రం సంతృప్తిగా ఉండట్లేదు. సర్కస్‌లో జోకర్‌లా వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలు కలిపి చదువుతున్నారు. ఒక్కోసారి మాండలికాలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల వినసొంపుగా ఉండట్లేదు.

తెలుగు దూరదర్శన్‌లో మొట్టమొదటి యాంకర్‌ని, న్యూస్ రీడర్‌ని కావడం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడు నన్ను మర్చిపోలేరు. జనవరి 7, 2011 జనవరి వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను. నేను పదవీ విరమణ చేసినప్పటికీ తెలుగు ప్రజలింకా నన్ను ఇప్పటికీ గుర్తుపట్టడం, గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ప్రేమిస్తున్న వారందరికీ ఋణపడి ఉంటాను.

నా ఉద్దేశంలో టీవీ అంటే... ఇదొక శక్తిమంతమైన మాధ్యమం. ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకువచ్చింది. అయితే... దీన్ని కొంత దుర్వినియోగం చేస్తున్నారు. టీవీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. వైద్యం, విద్య, సంస్కృతి సంప్రదాయం, మానవ సంబంధాలకు టీవీ దూరమైపోతోంది. అదే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement