breaking news
DD News
-
ఆ స్వరం మూగబోయినా...ఆయన అందరివాడే!
తొలి తరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన స్వరం తెలుగు వారికి సుపరిచితం. ఎంతోమంది న్యూస్ రీడర్లకు, వ్యాఖ్యాతలకు ప్రేరణగా నిలిచారు. తన గాత్రంతో ఎన్నో వార్తలను, సంచలనాన్ని, విజయాల్ని, విషాదాలను ప్రేక్షకులకు చేరవేసిన ఆయన మరణం అభిమానులను తీరని విషాదంలో ముంచేసింది. ఆయన భౌతికంగా మూగబోయినా.. ఆ స్వరం మాత్రం ఆ చంద్ర తారార్కం...! 2014లో శాంతి స్వరూప్ గారితో సాక్షి, ఫ్యామిలీ ప్రతినిధి డా. పురాణపండ వైజయంతి సంభాషణ పాఠకుల కోసం.. టీవీ వల్లే... అందరివాణ్ణయ్యా! తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే... అందరికీ గుర్తుకు వచ్చేది శాంతిస్వరూప్. పేరుకు తగ్గట్టుగా... మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే..! వార్తలు... సమాచారం... ‘జాబులు - జవాబులు’... ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం... ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేశారు.. తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ని నేనే. మొదటి బులెటిన్... 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా నన్నే నియోగించారు. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చే శాం. ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివాను. ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా మెదుల్తూనే ఉన్నాయి. మాకు ఆ రోజుల్లో ఎదురుగా తెరపై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేవు. అందువల్ల నేను విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకునేవాడిని. నా కొలీగ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. నేను ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి తెలుగు వార్తలు పూర్తయిన వెంటనే రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి హిందీ వార్తలు వస్తాయి. అక్కడ వాళ్లకి టెలీ ప్రాంప్టర్లు ఉన్నాయి. వాళ్లు పేపరు చూడకుండా చదువుతారు. వారికి ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం చిన్న పిల్లవాడిలాఅంతా వల్లె వేసి, జ్ఞాపకం ఉంచుకునేవాడిని. ప్రతిరోజూ నా జ్ఞాపకశక్తికి అది ఒక పరీక్ష. సందర్భోచితంగా... వార్తలలోని మూడ్ ప్రేక్షకులకు అందాలనేది నా ఉద్దేశం. భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో నేను సంతాప వార్తలా ముఖ కవళికలు ఉంచి చదవలేను. అలాగని గట్టిగా అరవనూ లేను. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటివారికి చెబుతున్నట్లుగానో చదివేవాడిని. మధురజ్ఞాపకాలు... కేంద్ర ప్రభుత్వం నుంచి ‘షా కమిషన్’ కి సంబంధించిన పది పేజీల రిపోర్టు ఇంగ్లీషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్‌కి వచ్చేది. దానిని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే నేను ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవాడిని. ఆ పనిని నేను సవాలుగా తీసుకున్నాను. ఏ తప్పు జరగకుండా చేస్తున్నందుకు కొంచెం గర్వంగా అనిపించేది. మా పై అధికారులంతా నన్ను మెచ్చుకునేవారు. మరో సంఘటన... పదహారు సంవత్సరాల అమ్మాయి తన వదినగారు తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైలు ఎక్కిందట. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగేసరికి, ‘శాంతి స్వరూప్ మా మేనమామ. ఆయన్ని చూడటానికి వెళుతున్నాను’ అని చెప్పిందట. ఆ టీసీ సహృదయంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. పోలీసు లు విచారణ చేసి, ఆ అమ్మాయి అన్నగారిని పిలిపించి, ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ‘‘నా పెళ్లికి మీరు తప్పక రావాలి’’ అని నా దగ్గర మాట తీసుకుంది. అలా తెలుగువారందరికీ కుటుంబ సభ్యుడిలా అయ్యానంటే అది దూరదర్శన్ చలవే. దాన్నిబట్టి దూరదర్శన్ ఎంత శక్తిమంతమైన మాధ్యమమో అర్థం అవుతుంది. ప్రభావం... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు, మార్పులు వచ్చాయి. వీటివల్ల నేటి యాంకర్లు కష్టపడవలసి వస్తోంది. అయితే ఔట్పుట్ మాత్రం సంతృప్తిగా ఉండట్లేదు. సర్కస్‌లో జోకర్లా వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలు కలిపి చదువుతున్నారు. ఒక్కోసారి మాండలికాలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల వినసొంపుగా ఉండట్లేదు. తెలుగు దూరదర్శన్‌లో మొట్టమొదటి యాంకర్ని, న్యూస్ రీడర్ని కావడం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడు నన్ను మర్చిపోలేరు. జనవరి 7, 2011 జనవరి వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను. నేను పదవీ విరమణ చేసినప్పటికీ తెలుగు ప్రజలింకా నన్ను ఇప్పటికీ గుర్తుపట్టడం, గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ప్రేమిస్తున్న వారందరికీ ఋణపడి ఉంటాను. నా ఉద్దేశంలో టీవీ అంటే... ఇదొక శక్తిమంతమైన మాధ్యమం. ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకువచ్చింది. అయితే... దీన్ని కొంత దుర్వినియోగం చేస్తున్నారు. టీవీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. వైద్యం, విద్య, సంస్కృతి సంప్రదాయం, మానవ సంబంధాలకు టీవీ దూరమైపోతోంది. అదే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది. -
geetanjali iyer: ప్రముఖ యాంకర్ కన్నుమూత
గీతాంజలి అయ్యర్(70).. దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్. సుమారు 30 ఏళ్ల పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్ పని చేసిన ఆమె ఇక లేరు. బుధవారం వాకింగ్ చేసి ఇంటికొచ్చిన ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆమె మృతిని కుటుంబ సభ్యులు ప్రకటించారు.గత కొంతకాలంగా పార్కిన్సన్స్తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1971లో దూరదర్శన్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా చేరిన ఆమె.. ఆంగ్లంలో వార్తలు చదివిన తొలి ప్రజెంటర్ కూడా. నేషనల్ బులిటెన్‌తో దేశవ్యాప్తంగా ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అంతేకాదు.. నాలుగు సార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. మీడియా రంగంలో సేవలకుగానూ గీతాంజలి.. 1989లో అవుట్‌స్టాండింగ్ విమెన్ అవార్డుగా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు.వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో కలిసి పనిచేశారు. గీతాంజలి మృతి విషయం తెలిసిన పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సైతం ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. గీతాంజలి అయ్యర్.. కోల్‌కతా లోరెటో కాలేజీలో ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డిప్లోమా సైతం పూర్తి చేశారు. దూరదర్శన్ కెరీర్ ముగిశాక.. కార్పొరేట్ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్ అనే సీరియల్లోనూ చివరిసారిగా నటించారు. గీతాంజలికి ఇద్దరు పిల్లలు. కూతురు పల్లవి కూడా అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ కూడా. My heartfelt condolences to the family of Geetanjali AyyarJi. Saddened to know that one of the best Doordarshan news presenters of yesteryears Geetanjali Ji passed away. She was a role model for news presenters .. May her soul rest in Peace pic.twitter.com/46ZKScrZ5R — Vijayasai Reddy V (@VSReddy_MP) June 8, 2023 Gitanjali Aiyar, India’s one of the best tv newsreaders, warm and elegant person and woman of immense substance passed away today. Deepest condolences to her family. 🙏 pic.twitter.com/4q1C6vFHbh — Sheela Bhatt शीला भट्ट (@sheela2010) June 7, 2023 -
దూరదర్శన్ న్యూస్‌ను స్వాధీనం చేసుకుంటుందా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల కోసమంటూ ఇప్పటికే జాతీయ అధికారిక మీడియాను క్రియాశీలకంగా వాడుకుంటున్న మోదీ ప్రభుత్వం వాటిపై మరింత పట్టు బిగించబోతోందా.. తాజా పరిణామం చూస్తోంటే ఈ అనుమానం రాకమానదు. 'మన్ కీ బాత్' పేరిట ఆకాశవాణిని తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్న మోదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడకాస్టర్ దూరదర్శన్ (జాతీయ ప్రజా ప్రసారకర్త) న్యూస్‌ను ప్రభుత్వం.. స్వాధీనం (టేక్ ఓవర్) చేసుకున్నట్లు తెలుస్తోంది. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అక్షయ్ రౌత్ స్థానంలో వీణా జైన్‌ని నియమిస్తూ శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రసార మంత్రిత్వ శాఖలో ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్‌గా ఉన్న జైన్, రెండు బాధ్యతలను ఉమ్మడిగా నిర్వహిస్తారని తెలిపింది. దూరదర్శన్ ఛానల్‌కు క్రమేపీ తగ్గుతున్న ప్రేక్షకాదరణ, క్షీణిస్తున్న ఆదాయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించిన ఈ నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది . స్వయం ప్రతిపత్తి కలిగిన దూరదర్శన్పై పెత్తనం చెలాయించేందుకు, వార్తా ప్రసారాలను తమ నియంత్రణలో ఉంచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా దూరదర్శన్లోని అన్ని మీడియా విభాగాల హెడ్లకు జైన్ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని అందించి, ప్రసార భారతి సీఈఓ, ప్రసార భారతి బోర్డ్ ఛైర్మన్‌ను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. కాగా జాతీయ అధికార ఛానల్ అయిన దూరదర్శన్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. స్వతంత్య ప్రతిపత్తిని కలిగి ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ 89వ వ్యవస్థాపక దినం సందర్భంగా, దసరా సందర్భంగా అక్టోబర్ 3న దూరదర్శన్ ఛానల్లో భాగవత్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్‌ను వాడుకున్నారని విమర్శించాయి. ఈ క్రమంలో డీడీ ద్వారా ఓ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రసార భారతిని ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన ప్రసంగ పాఠాన్ని కట్ చేశారని ఆరోపిస్తూ జాతీయ టీవీ(డీడీ) ప్రొఫెషనల్ ఫ్రీడమ్ పాటించడం లేదని విచారం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.