ఇంటి వంటకు బ్రేక్.. నగరాన్ని నడుపుతున్న కర్రీ పాయింట్లు | Curry Points Food Support For Bachelors And Student | Sakshi
Sakshi News home page

ఇంటి వంటకు బ్రేక్.. నగరాన్ని నడుపుతున్న కర్రీ పాయింట్లు

Jan 14 2026 10:34 AM | Updated on Jan 14 2026 10:34 AM

Curry Points Food Support For Bachelors And Student

బ్యాచిలర్లు, విద్యార్థులకు భోజన భరోసా కర్రీ పాయింట్లే

ఉద్యోగుల అలసటకు సులువైన పరిష్కారం

నగరవాసుల నిత్యావసరంగా మారిన కర్రీ పాయింట్లు

విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణ జీవనం రోజురోజుకూ వేగం పుంజుకుంటోంది. ఒకప్పుడు పల్లె వాతావరణంతో నిదానంగా సాగిన జీవితం, ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పనిపాటలతో పరుగులే పరుగులుగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంటికొచ్చేసరికి వంట చేయడానికి ఓపిక, సమయం రెండూ కలిసి రావడం లేదు. అందుకే చాలామంది ఇంటి వంటకు కాస్త విరామం ఇచ్చి, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు ఇంటి వంట మానేసి బయట కూరలు తెచ్చుకుంటే బద్ధకం అంటూ వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతల మధ్య సమయానికి భోజనం కావాలంటే కర్రీ పాయింట్లే సరైన దారి అయ్యాయి. 

సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు గంటస్తంభం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ పరిసరాలు, కోట జంక్షన్‌, రింగ్‌ రోడ్‌, కంటోన్మెంట్‌, బాలాజీ నగర్‌, పీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ ప్రాంతాల్లోని కర్రీ పాయింట్లు జనంతో కిటకిటలాడుతాయి. చేతుల్లో స్టీల్‌ డబ్బాలు, ప్లాస్టిక్‌ కవర్లతో నిలబడి ఇంకా కూర అయిందా లేదా అంటూ అడుగుతూ క్యూ కడతున్నారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలు, దుకాణాల్లో పని చేసే యువకులు, చిన్న పిల్లలున్న కుటుంబాలు, ఒంటరిగా గదుల్లో ఉండే బ్యాచిలర్లు..ఇలా అన్ని వర్గాల వారికీ ఈ కర్రీ పాయింట్లు ఊరటగా మారాయి. పప్పు,కూర, ప్రై, పులుసు వంటి వంటకాలు ఇంటి వంట రుచిని గుర్తు చేస్తాయని వినియోగదారులు చెబుతున్నారు. పైగా చౌకగా, సమయానికి, కడుపు నిండేలా దొరుకుతుండడంతో డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది.

పెరిగిన ఖర్చులే కారణం..
గ్యాస్‌ సిలిండర్‌ ధరలు, నూనె, కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరి కోసం వంట చేయాలంటే ఖర్చు తక్కువ కాదు. రూ.800–900 పెట్టి గ్యాస్‌ తెచ్చుకోవడం, రోజూ కూరగాయలు కొనడం కంటే రూ.20 లేదా రూ.50 పెట్టి రెడీ కర్రీ తెచ్చుకోవడం నయం అని వినియోగదారులు లెక్కలు చెబుతున్నారు.

విద్యార్థులు, బ్యాచిలర్లకు భోజన భరోసా...
ఉత్తరాంధ్రలో పెద్ద విద్యా కేంద్రం విజయనగరం. వేల సంఖ్యలో విద్యార్థులు హాస్టళ్లలో, అద్దె గదుల్లో ఉంటున్నారు. తోటపాలెం, మయూరి జంక్షన్‌, బాబామెట్ట, అయ్యకోనేరు, రాజీవ్‌నగర్‌ కాలనీ చుట్టుపక్కల విద్యార్థుల కోసం మినీ కర్రీ పాయింట్లు వెలిశాయి. రోజూ హోటల్‌ భోజనం తింటే ఖర్చు, ఆరోగ్యం రెండూ పాడవుతాయి. ఇక్కడ పప్పు, ఒక వేపుడు, ఒక గ్రేవీ కూర తీసుకుంటే ఇంట్లో తిన్న ఫీలింగ్‌ వస్తుంది.

మారుతున్న ఆహార సంస్కృతి..
ఒకప్పుడు రోజూ ఇంటి వంట తప్పనిసరి అనుకున్న విజయనగరం ప్రజలు, ఇప్పుడు అవసరానికి తగ్గట్లు ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతుండడంతో కర్రీ పాయింట్లు నగర జీవితంలో భాగమయ్యాయి. శుభ్రత, నాణ్యతపై మరింత శ్రద్ధ తీసుకుంటే ఈ రంగం ఇంకా విస్తరించే అవకాశం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

ఆఫీస్‌ అలసటకు కర్రీ పాయింటే ఉపశమనం
ఉదయం ఆఫీసుకి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఒళ్లంతా అలసట. మళ్లీ కూరగాయలు తరగడం, వంట చేయడం అంటే కష్టం. గ్యాస్‌ ధరలు, నూనె ధరలు చూస్తే ఇంట్లో వండడం కన్నా రూ.30 నుంచి 50 పెట్టి కర్రీ తెచ్చుకోవడమే నయం అనిపిస్తోంది. పిల్లలకు కూడా ఇంటి భోజనం లాంటి రుచి దొరుకుతోంది.
– పెనుగంటి వనజ, ప్రైవేట్‌ ఉద్యోగి, విజయనగరం

ఇంటి రుచే మా గుర్తింపు..
మేము ఇంట్లో వండినట్లు ఉండాలని ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాం. మసాలాలు అన్నీ ఇంట్లోనే దంచి తయారు చేస్తాం. అందుకే మా దగ్గరికి వచ్చే వాళ్లు ఇంటి కూరే అంటున్నారు. రోజూ సాయంత్రం ఆరు దాటితే జనం క్యూలో నిలబడతారు. ఒకప్పుడు కర్రీ పాయింట్‌ అంటే చిన్నగా చూసేవాళ్లు..ఇప్పుడు అదే మా కుటుంబానికి ఉపాధి అయింది.
– ఆకుల సూర్యకుమారి, అమ్మ కర్రీ పాయింట్‌, విజయనగరం

హోటల్‌ భోజనం కంటే.. కర్రీ పాయింటే భరోసా..

విజయనగరంలో చదువుకోవడానికి వచ్చాం. హాస్టల్‌లో వంట సౌకర్యం లేదు. బయట హోటల్‌ భోజనం రోజూ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. కరీ పాయింట్లలో మాత్రం తక్కువ ధరలో పప్పు, కూర దొరకుతుంది. చదువుకునే మాకు ఇవే పెద్ద ఆధారం.
– రౌతు రామునాయుడు, విద్యార్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement