
ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే ఔషధాలు, లేపనాలు వాడాలా? కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోవాలా? అనే ఆలోచన చాలా మంది చేస్తుంటారు. అందుకే చాలా వరకు యాంటీ ఏజింగ్ ప్రయత్నాలూ చేస్తుంటారు. అయితే, వీటిలో ఏది నిజంగా పనిచేస్తుంది? ఏది సురక్షితం? ఏది సరైనది కాదు.. ఎలా తెలియాలి.. అనే సందేహాలు కూడా ఎన్నో పుట్టుకు వస్తుంటాయి. వాటికి సమాధానమే ఈ వ్యాసం.
శరీరంలోని జీవక్రియల స్థాయిలో వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాలని తీసుకునే మందులు ఉంటాయి. ఉదాహరణకు డయాబెటిస్ మందులైన మెట్‌ఫార్మిన్, మెటబాలిజంను ప్రభావితం చేసే పారామైసిన్ వంటి ఔషధాలు వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేయగలవా.. అనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఔఇవి బాడీలోని సెల్స్ లెవల్‌లో మార్పులు తేవాలని ప్రయత్నిస్తాయి. కానీ... ఇవి ఇంకా పరిశోధన దశలో ఉన్నాయి.
చాలావరకు ఇవి మన శరీరానికి తగినట్టు పనిచేస్తాయో లేదో స్పష్టత లేదు. కాస్త పొరపాటైతే జీర్ణ సమస్యలు, హార్మోన్ అసమతుల్యత, లివర్ డ్యామేజ్, గుండె సంబంధిత సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు వస్తాయన్నదే నిజం. అంతేకాదు, స్కిన్ లైట్‌నింగ్, మెట్‌బాలిజం మార్చే ఐవీ థెరపీ వంటి చికిత్సలు కూడా – పర్యవేక్షణ లేకుండా చేయడం చాలా ప్రమాదకరం.
కాస్మెటిక్ ప్రొసీజర్స్...
ముడతలు, డార్క్ స్పాట్స్, సాగిన చర్మం.. మొదలైనవాటిని మెరుగుపరచడం కోసం ఈ చికిత్సలు తీసుకుంటారు. వీటిలో నాన్–సర్జికల్ అయిన బోటాక్స్, ఫిల్లర్లు, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సర్జికల్‌గా ఫేస్‌లిఫ్ట్స్, ఐ లిడ్ సర్జరీ, లై΄ోసక్షన్ వంటివి ఉన్నాయి. ఈ ప్రొసీజర్లు నిపుణులైన వైద్యులు చేతుల మీదుగానే జరుగుతాయి. అయినా ఇవి యవ్వనాన్ని శాశ్వతంగా నిలబెట్టవు. కానీ చూడటానికి యంగ్‌గా కనిపించేలా చేస్తాయి.
మాటల మాయలో పడిపోకండి..
‘నేచురల్ అంటే సేఫ్‘ అని చాలా మంది అనుకుంటారు. కానీ, హెర్బల్ పేరుతో ఉన్న కొన్ని పదార్థాలు కూడా హార్మోన్ లెవల్స్‌ను దెబ్బతీయవచ్చు. ‘అన్ని యవ్వన చికిత్సలు ఒకే విధంగా పనిచేస్తాయి‘ అనుకోవద్దు. మందులు లోపలికి తీసుకుంటే సెల్ లెవెల్‌లో పనిచేస్తాయి. ప్రొసీజర్లు చర్మం మీద పని చేస్తాయి. ‘యాంటీ ఏజింగ్‌కి మార్కెట్లో ఉన్న అనేక క్రీములు, టాబ్లెట్లు ... పరిశోధనలు లేకుండానే వచ్చి చేరుతున్నాయి. అందుకని వాటి మాయలో పడి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దు.
లుక్ పరంగా తగ్గించవచ్చు...
ట్రీట్‌మెంట్లతో యవ్వనాన్ని అలాగే ఉంచాలనుకోవడం ఆరోగ్యరీత్యా సరికాదు. తగినంత సూర్యరశ్మి మేనికి తగలాలి. ఆహారపదార్థాలలో చక్కెర పదార్థాలను తగ్గించాలి. మన జీవనశైలి సరిగా లేక΄ోతే ఇన్సులిన్ సామర్థ్యం తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు మెదడుకు పని పెడుతున్నారే తప్ప, శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వటం లేదు.
మెనోపాజ్ దశలో హార్మోన్లలో సమతుల్యత ఉండదు. మనం చేయగలిగేది చర్మ సరంక్షణ విషయంలో మాయిశ్చరైజర్, సన్‌ప్రొటెక్షన్‌ను ఉపయోగించడం. వయసుతోపాటు చర్మం సాగినట్టు కనిపించడం సహజం. దీనికి ఫిల్లర్స్, స్కిన్ బూస్టర్స్ ఉపయోగించవచ్చు.
ఏ యాంటీ ఏజింగ్ చికిత్స అయినా నిపుణుల సలహా అవసరం. ఏవీ పర్మినెంట్ చికిత్సలు కావు. అన్నిరకాల ఆహారం తీసుకోవాలి. అంటే, ఆ ఆహారంలో కూరగాయలు, పండ్లు ఉండాలి. నీళ్లు సరిపడినన్ని తాగాలి. జీవనశైలి బాగుంటే వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు.
– డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్
(చదవండి: నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..)