భూమిని చల్లబరిచే వినూత్న ప్రయోగం
ప్రకృతి వైపరీత్యాలు, అడవుల నరికివేత, విచ్చలవిడి కాలుష్యాలతో భూగోళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భూతాపం నానాటికీ పెరిగి పోతుండటంతో, రాబోయే కాలంలో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో, భూమిని ఎలాగైనా చల్లబరచాలనే పట్టుదలతో శాస్త్రవేత్తలు అత్యంత వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక ప్రయోగమే ‘సూర్యుడి కాంతిని తగ్గించడం’!
అయితే, ప్రపంచాన్ని రక్షించేందుకు ఉద్దేశించిన ఈ ‘జియోఇంజనీరింగ్’ ప్లాన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనివల్ల విమాన ప్రయాణికులు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడికి సన్‌స్క్రీన్ వేయటంలా అనిపించే ఈ ప్రయోగం వల్ల ఆకాశంలో ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ (గంధక ఆమ్లం) మబ్బులు ఏర్పడతాయి. అవి ఎంతో హానికరమైనవి.
సూర్యుడిని ఎలా ‘డిమ్’ చేస్తారు!
ప్రస్తుతం కేవలం కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే భూమి వేడెక్కడాన్ని ఆపడానికి మనకు సరిపడా సమయం లేదు. అందుకే, వాతావరణంలో చిక్కుకునే వేడిని తగ్గించడం కంటే.. అసలు సూర్యుడి నుండి భూమికి వచ్చే కాంతిని, వేడిని ముందే అడ్డుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టిందే ఈ జియోఇంజనీరింగ్ బృహత్ప్రణాళిక. స్ట్రాటోస్పియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ (ఎస్.ఎ.ఐ) అనే ఈ విధానంలో ఆకాశంలోని పైపొరల్లోకి (స్ట్రాటోస్పియర్) ప్రత్యేక విమానాల ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ వాయువును భారీ మొత్తంలో విడుదల చేస్తారు.
ఆ వాయువు గాల్లోని తేమతో కలిసి చిన్న చిన్న సల్ఫేట్ కణాలుగా (ఏరోసోల్స్) మారుతుంది. గతంలో భూమిపై పెద్ద అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎలాగైతే పొగ, బూడిద ఆకాశాన్ని కమ్మేసి కొన్ని నెలల పాటు భూమిని చల్లబరిచాయో, అదే ఫార్ములాను ఇక్కడ కృత్రిమంగా అమలు చేస్తున్నారు. ఈ కెమికల్ కణాలు ఒక అద్దంలా పనిచేసి, సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా చేస్తాయి. దాంతో భూమిపై వేడి తగ్గుతుంది.
మానవాళికి కొత్త చిక్కులు
భూమిపై మనం నివసించే దిగువ వాతావరణ పొరను ‘ట్రోపోస్పియర్’ అంటారు. ఇక్కడ వర్షాలు పడటం వల్ల కాలుష్యం త్వరగానే కిందకి వచ్చేస్తుంది. కానీ, దీనికి పైన ఉండే ‘స్ట్రాటోస్పియర్’ పొరలో అసలు వర్షాలు పడవు. కాబట్టి మనం అక్కడ వెదజల్లే రసాయన జల్లులు సాధారణ కాలుష్యం కంటే 50 రెట్లు ఎక్కువ కాలం గాల్లోనే ఉండిపోతాయి. ఇది భూమిని చల్లబరచడానికి మంచిదే అయినప్పటికీ, మానవాళికి సరికొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుంది. శాస్త్రవేత్తలు ఊహించిన ఈ అద్భుతమైన ప్రణాళికలో అసలు ప్రమాదం విమాన ప్రయాణాల దగ్గరే మొదలవుతుంది.
సాధారణ కమర్షియల్ (ప్యాసింజర్) విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు, ప్రయాణికులకు కావలసిన ఆక్సిజన్ కోసం బయట ఉండే గాలిని వాటి శక్తిమంతమైన ఇంజిన్‌లు లోపలికి లాక్కుంటాయి. ఆ గాలిని ఫిల్టర్ చేసి, ప్రయాణికులు, సిబ్బంది సులభంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా క్యాబిన్ లోపలికి పంపుతాయి. ఒకవేళ విమానాలు ప్రయాణించే ఆకాశ మార్గంలో సల్ఫర్ డయాక్సైడ్ మబ్బులు ఉంటే, విమాన ఇంజన్లు ఆ వాయువును కూడా లోపలికి లాగేసుకుంటాయి.
ఆ వాయువు విమానం కంప్రెషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉండే విపరీతమైన వేడి, తేమ కారణంగా రసాయన చర్య జరిగి క్షణాల వ్యవధిలో ఘాటైన సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా మారిపోతుంది. అంటే, ప్రయాణికులు శ్వాసించే గాలిలోకి నేరుగా యాసిడ్ కణాలు ప్రవేశిస్తాయన్న మాట! దీనివల్ల విమానం లోపల ఉన్న వారికి ఊపిరాడకుండా పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా – తరచూ ప్రయాణించే వారికి ఇది శాపంగా మారుతుందని న్యూజెర్సీలోని రట్జర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ రోబాక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్యాసింజర్ రూట్లలోనే ‘విషాయన’ మబ్బులు
భూమధ్యరేఖ పైభాగంలో దాదాపు 1.2 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్‌ను వదిలితే, భూమి ఉష్ణోగ్రతను 0.6 నుండి 1 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గించవచ్చు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల ప్యారిస్ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల లోపే ఉంటుంది. ఇక ఈ ఏరోసోల్‌ను భూమికి దాదాపు 13 నుండి 15 కిలోమీటర్ల (8 నుండి 9 మైళ్ల) ఎత్తులో వదలాల్సి ఉంటుంది. సాధారణ ప్యాసింజర్ విమానాలు అంత ఎత్తుకు వెళ్లలేవు. దీనికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు మరో మార్గాన్ని వెతికారు.
భూమి ధ్రువ ప్రాంతాల (ఉత్తర, దక్షిణ ధ్రువాలు) వద్ద స్ట్రాటోస్పియర్ పొర భూమికి కాస్త దగ్గరగా (తక్కువ ఎత్తులో) ఉంటుంది. కాబట్టి, బోయింగ్ 777 వంటి భారీ విమానాలను ఉపయోగించి ఆ ధ్రువ ప్రాంతాల వద్ద సల్ఫర్‌ను సులభంగా ఆకాశంలోకి వదలవచ్చని భావిస్తున్నారు. ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా) నుండి యూరప్, ఆసియా దేశాలకు వెళ్లే వందలాది ప్యాసింజర్ విమానాలు ప్రయాణించేది కూడా సరిగ్గా అదే ధ్రువ ప్రాంతాల రూట్లలోనే! దీనివల్ల సాధారణ విమానాలు తమకు తెలియకుండానే అకస్మాత్తుగా ఆకాశంలో దట్టంగా పేరుకుపోయిన సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ జోన్‌లలోకి దూసుకెళతాయి. ఈ రసాయనాలను ఆకాశంలో పొడవాటి గీతల్లా చల్లుకుంటూ వెళ్తారు కాబట్టి, కొన్ని చోట్ల ఈ గ్యాస్ అంచనాలకు మించి అత్యంత గాఢతతో ఉండే అవకాశం ఉంది.

పక్షవాతం, గుండెపోటు ముప్పు!
ప్రొఫెసర్ రోబాక్ లెక్కల ప్రకారం ఈ రసాయనాలను చల్లిన కొత్తలో కొన్ని ప్రాంతాలలో వీటి గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 50 మైక్రోగ్రాముల వరకు పెరిగిపోతుంది. ఇది యూరోపియన్ యూనియన్ పర్యావరణ, ఆరోగ్య ప్రమాణాల ప్రకారం మానవ ఆరోగ్యానికి అత్యంత హానికరమైన స్థాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ మిశ్రమం ఉన్న గాలిని పీల్చడం వల్ల గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు తీవ్రంగా మంట పుడతాయి.
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది తక్షణమే ‘ఆస్తమా ఎటాక్’కు దారితీసి ప్రాణాంతకంగా మారుతుంది. రసాయన ప్రభావం వల్ల శ్వాస నాళాలు ముడుచుకుపోయి, ఊపిరి తీసుకోవడం అసాధ్యంగా మారుతుంది. పదే పదే లేదా ఎక్కువ సమయం ఈ యాసిడ్ ప్రభావం ఉన్న వాతావరణంలో గడపడం వల్ల రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు దెబ్బతినడం జరిగి పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా వారంలో చాలా గంటలు ఆకాశంలోనే గడిపే పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌లు, క్యాబిన్ క్రూ సిబ్బంది ఈ భయంకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
విమానానికేం కాదు కానీ..!
సల్ఫ్యూరిక్ యాసిడ్‌కు లోహాలను, వస్తువులను క్షీణింపజేసే గుణం ఉంటుంది. అయితే, ఆకాశంలో ప్రయాణించే విమానాల బాడీకి లేదా లోహ భాగాలకు ఈ మోతాదు వల్ల ఎలాంటి నష్టమూ వాటిల్లదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విమానాలకు భౌతికంగా ఏం కాకపోవచ్చు కానీ, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం మాత్రం ఉందని కొలంబియా క్లైమేట్ స్కూల్ తల్చేసింది. ధ్రువ ప్రాంతాల వద్ద ఏరోసోల్స్ వదలడం వల్ల ఉష్ణమండల దేశాలలో (భారతదేశం వంటి దేశాలలో) వచ్చే రుతుపవనాలు దెబ్బతిని, తీవ్ర కరువు లేదా అకాల వరదలు రావచ్చు.
అయితే, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ వాతావరణ పరిశోధకుడు డాక్టర్ వేక్ స్మిత్ మాత్రం ఈ ప్రయోగాన్ని ఇప్పుడే పూర్తిగా పక్కన పెట్టేయకూడదంటున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, భూతాపం అనే పెద్ద రాక్షసుడిని చంపడానికి ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులను మనం ఎదుర్కోక తప్పదు.
ఏమైనప్పటికీ, ప్రకృతి శక్తులతో మానవుడు కృత్రిమంగా ఆడుకోవాలనుకున్నప్పుడు ఊహించని సవాళ్లు ఎదురవడం సహజం. మరి భవిష్యత్తులో సైన్స్ ఈ సమస్యకు ఎలాంటి సురక్షితమైన పరిష్కారాన్ని చూపుతుందో చూడాలి.
జియోఇంజనీరింగ్ అంటే?
భూతాపాన్ని తగ్గించేందుకు భూవాతావరణ ప్రక్రియలను కృత్రిమంగా, భారీ ఎత్తున మార్చడాన్నే ‘జియోఇంజనీరింగ్’ అంటారు. సూర్యకాంతిని వెనక్కి తిప్పి పంపడానికి ఆకాశంలో రసాయన కణాలు చల్లడం, లేదా గాల్లోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునేలా సముద్రపు రసాయనిక శక్తిని మార్చడం వంటివి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ ప్రయోగాలు వికటిస్తే, సమస్య పరిష్కారం కాకపోగా వాతావరణం మరింత వినాశకరంగా మారే ప్రమాదం ఉందని పరిశోధకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జియోఇంజనీరింగ్ లోపాలు..
వాతావరణ మార్పులతో పోరాడటానికి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిష్కారాలను ప్రతిపాదించారు. వాటిలో కొన్ని వివాదాస్పద పద్ధతులు కూడా ఉన్నాయి.
అడవుల పెంపకం
ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా వంటి ప్రాంతాల్లోని ఎడారులకు నీటిని అందించి, అక్కడ లక్షలాది చెట్లను నాటుతారు. ఈ చెట్లు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటాయి.
లోపం: సాధారణంగా ఎడారులు సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పంపేస్తాయి (రిఫ్లెక్ట్ చేస్తాయి). కానీ అక్కడ చెట్లు పెంచితే, అవి సూర్యకాంతిని లోపలికి లాక్కుంటాయి. దీనివల్ల భూమి మరింత వేడెక్కే ప్రమాదం ఉంది.
కృత్రిమ సముద్ర ఉప్పెన
పెద్ద పెద్ద పైపులను ఉపయోగించి సముద్రం అడుగున ఉండే చల్లటి, పోషకాలు దట్టంగా ఉండే నీటిని పైకి పంపిస్తారు. ఇది సముద్రం పైపొరల్లోని నీటిని చల్లబరుస్తుంది.
లోపం: ఈ ప్రక్రియ గనుక ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతే, సముద్రాలు తమ వేడిని ఒక్కసారిగా సర్దుబాటు చేసుకోవడం వల్ల వాతావరణం చాలా వేగంగా, అస్తవ్యస్తంగా మారిపోతుంది.
సముద్ర క్షారీకరణ
సముద్రాలలో పెద్ద ఎత్తున సున్నాన్ని కలపడం ద్వారా.. నీటికి కార్బన్ డయాక్సైడ్‌ను ఎక్కువగా పీల్చుకునే రసాయనిక శక్తిని పెంచుతారు.
లోపం: ప్రపంచ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో ఈ పద్ధతి పెద్దగా ఉపయోగపడదని పరిశోధనలు చెప్తున్నాయి.
సముద్రంలో ఇనుమును వేయడం
సముద్రాలలో ఇనుమును వేయడం ద్వారా, కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునే చిన్న చిన్న మొక్కలు/జీవుల ఎదుగుదలకు పుష్టిని అందిస్తారు.
లోపం: ఈ పద్ధతి కూడా భూమి వేడిని తగ్గించడంలో అంతగా పని చేయదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
సూర్య కిరణాల నియంత్రణ
ఆకాశంలోకి సూర్యకాంతిని తిరిగి వెనక్కి తిప్పి పంపే సల్ఫేట్ కణాలను వాతావరణంలోకి వదలడం ద్వారా భూమికి వచ్చే ఎండ తీవ్రతను తగ్గిస్తారు.
లోపం: దీనివల్ల భూమి చల్లబడవచ్చు కానీ, వాతావరణంలో పేరుకుపోయే కార్బన్ డయాక్సైడ్ సమస్య మాత్రం అలాగే ఉండిపోతుంది.
- సాక్షి స్పెషల్ డెస్క్


