మహిళా ప్రొఫెసర్‌పై రిటైర్డ్ ఐఏఎస్ లైంగిక వేధింపులు
ఏపీలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండగా అత్యంత వివాదాస్పదుడిగా పేరొందిన సదరు ఐఏఎస్
వేధింపులపై జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు
అత్యున్నత సంస్థలో అనైతిక పద్ధతులు, వృత్తి నిబద్ధత లేని వ్యవహారాలు జరుగుతున్నాయని వెల్లడి
ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధికారి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఫిర్యాదు.. ప్రతీకార చర్యలతో పూర్తిగా కుంగిపోయానంటూ ఆవేదన
జూన్ 3న సంస్థ చైర్మన్ హాజరు కావాలంటూ మహిళా కమిషన్ నోటీసులు
మాజీ ఐఏఎస్ వరుస వేధింపులతో కోర్ట్ ఆఫ్ గవర్నర్స్‌ను ఆశ్రయించిన మరో ముగ్గురు ప్రొఫెసర్లు
ప్రతిష్టాత్మక సంస్థలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘కోటి ప్రణామాలు! నేను ఒంటరి ఉద్యోగి మహిళను. చాలా చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి దురదృష్టవంతురాలిని అయ్యాను. నేను దేశంలోనే ఒక కీలకమైన సంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మక సంస్థగా భావించబడుతున్నా, వాస్తవానికి అది కేవలం ఒక భావన మాత్రమే. ఇక్కడ ఆరి్థక అక్రమాలు, ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, అనైతిక పద్ధతులు, వృత్తి నిబద్ధత లేని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టగానే నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు.
మొదట ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నేను వాటిని గట్టిగా ప్రతిఘటించాను. ఆ తర్వాత వేధింపులు, ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు నేను మానసికంగా పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్నాను. న్యాయం కోసం అందరినీ ఆశ్రయించాను. కానీ ఆయన పరపతి, ఆయనకు మద్దతుగా ఉన్న బలమైన శక్తుల కారణంగా నాకు బయటపడే మార్గం కనిపించడం లేదు. చివరి ఆశగా నా సమస్యను మీతో పంచుకుంటున్నాను. చదువుకున్నంత మాత్రాన, కష్టపడ్డంత మాత్రాన ఈ లోకంలో బతకడం సులభం కాదని అర్థమైంది.
దయచేసి నాకు సహాయం చేయండి..’ అంటూ దేశంలో అనేక విప్లవాత్మక పథకాలు, సంస్కరణలకు కేంద్ర బిందువై, పరిపాలనా మార్పులకు దిక్సూచిగా నిలిచిన అడ్మిని్రస్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)లో పనిచేస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది. ఆ మహిళా ప్రొఫెసర్‌ను వేధింపులకు గురిచేసింది సాదాసీదా అధికారి కాదు.. సాక్షాత్తు ఓ మాజీ ఐఏఎస్ అధికారి. సదరు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్‌లో ఓ రాజ్యాంగబద్ధ పదవి నిర్వహణలో అత్యంత వివాదాస్పదమైనప్పటికీ చేరదీసి ఆస్కీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే, బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘‘ఇంటి మరమ్మతులు జరుగుతున్నాయి’’అనే కారణంతో కుటుంబ సమేతంగా ఆస్కీలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారని, సుదీర్ఘకాలంగా అక్కడే తిష్టవేసినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా బంధుమిత్రులు, సహచరులకు తరచూ విలాసవంతమైన విందులు ఏర్పాటు చేయడం, ఉద్యోగులు, ప్రొఫెసర్లకు సంబంధించిన వివాదాస్పద నిర్ణయాల విషయంలో చైర్మన్ సూచనలను కూడా పట్టించుకోకపోవడం వంటి అంశాలు సంస్థలో చర్చనీయాంశమయ్యాయి. కాగా, బాధిత మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. జూన్ 3న జరిగే విచారణకు సంస్థ చైర్మన్ పద్మనాభయ్య హాజరు కావాలని ఆదేశించింది. ఆ మహిళా ప్రొఫెసర్ సంస్థ లక్ష్యాలను మించి అత్యుత్తమ పనితీరు కనబరిచినా, ఆమె సేవలను పొడిగించకుండా మే 31న బలవంతపు పదవీ విరమణకు సిద్ధం చేస్తున్నారన్న చర్చ ఆస్కీ వర్గాల్లో జరుగుతోంది.
మరో ముగ్గురు ప్రొఫెసర్లకు వేధింపులు
ఆస్కీలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న మరో ముగ్గురు ప్రొఫెసర్లు కూడా నయా బాస్‌పై సంస్థ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కోర్ట్ ఆఫ్ గవర్నర్స్’ను ఆశ్రయించారు. తమ సామర్థ్యాన్ని, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా, బాస్‌కు ‘‘జీ హుజూర్’’అనడం లేదనే ఒక్క కారణంతో వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారిలో ఇద్దరు మహిళా ప్రొఫెసర్లు కాగా.. ఒకరు దేశంలో సామాజిక మార్పులకు దారితీసిన పరిపాలనా సంస్కరణల బిల్లుల రూపకల్పనకు మార్గదర్శకత్వం వహించిన నిపుణురాలు కావడం గమనార్హం.
మరో ప్రొఫెసర్ విషయంలో, ‘‘పనితీరు సరిగా లేదు’’అనే పేరుతో ఒత్తిడి తెచి్చనట్లు, బంజారాహిల్స్‌లోని ఆస్కి నివాస సముదాయంలో అనుమతి లేకుండా పిల్లులను పెంచుతున్నారనే పేరిట పలుమార్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయించడంతో ఆయన కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైనట్లు సమాచారం.
ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారిని హెచ్చరించినట్లు తెలిసింది. గతంలో ఇదే సంస్థలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి సైతం మహిళా ప్రొఫెసర్లను వేధించిన ఫిర్యాదులపై ఆయన్ను సంస్థ నుండి తప్పించారు. మళ్లీ అదే స్థాయి అధికారిపై ఫిర్యాదులు రావటం ఆస్కి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ సిఫారసులతో వస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించడం వల్ల సంస్థ ప్రతిష్ట మసకబారుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యున్నత సంస్థగా ఎదిగి.. ఆరోపణలు చుట్టుముట్టి..
జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనల మేరకు 1956లో ఆస్కీ ఏర్పడింది. దేశంలో ప్రాక్టీసింగ్ మేనేజర్ల కోసం ఏర్పాటు చేసిన తొలి నిర్వహణ విద్యాసంస్థ ఇదే. నిజాం యువరాజు ఆజం ఝా నివాసంగా, ఇండో–యూరోపియన్, ఫ్రెంచ్ శైలిలో సోమాజిగూడలో పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన బెల్లావిస్టా (ఇటాలియన్ భాషలో అందమైన ప్రదేశం)లో సంస్థ కొలువుదీరింది..ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల్లో నిర్వహణ సమస్యలను ఎదుర్కొనేందుకు మేనేజర్లు, పరిపాలకులు, వ్యాపారవేత్తలు, అధ్యాపకులను సిద్ధం చేయడం దీని ప్రధాన లక్ష్యం.
నిర్వహణ సిద్ధాంతాలను ఆచరణతో సమన్వయం చేయడం, విధాన రూపకల్పనకు ఆలోచనా వేదికగా పనిచేయడం, శిక్షణ, పరిశోధనల ద్వారా ప్రజాపాలన సామర్థ్యాలను పెంపొందించడం కూడా దీని ముఖ్య ఉద్దేశాల్లో కొన్ని. ఈ లక్ష్యాల సాధన కోసం దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన విద్యావేత్తలు, నిపుణులను అధ్యాపకులుగా నియమించారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి జాన్ మత్తయ్ ఆస్కీ తొలి చైర్మన్‌గా వ్యవహరించారు.
అనంతరం ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు సీడీ దేశ్‌ముఖ్, ఎం.నరసింహం, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన ధర్మవీర, అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన ఆబిద్ హుస్సేన్ వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో ఆస్కీ అనేక విజయాలు సాధించి..మదర్ ఆఫ్ ఐఐఎంగా పేరు పొందింది. కొన్నేళ్లుగా విషయ నిపుణులు, సిద్ధాంతకర్తలైన ప్రొఫెసర్లను సాగనంపుతూ, వారి స్థానాల్లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించడం ద్వారా ఆస్కీని ‘‘పదవీ విరమణ పొందిన అధికారుల కాలక్షేప కేంద్రంగా’’మారుస్తున్నారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి.
ఆధారాలు లభించలేదు
ఓ మహిళా ప్రొఫెసర్.. తనపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ నిర్వహించాం. కానీ ఆరోపణలకు ఆధారాలు లభించలేదు. జాతీయ మహిళా కమిషన్‌కు ఇదే విషయాన్ని తెలియజేశాం. జూన్ 3న విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి నోటీసులు వచ్చాయని చెబుతున్నారు. మా అంతర్గత విచారణలో తేలిన విషయాలనే కమిషన్ ముందు ఉంచుతాం. మరికొన్ని ఫిర్యాదులు కూడా మా దృష్టికి వచ్చాయి. వాటిపై కోర్ట్ ఆఫ్ గవర్నర్స్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నేను ఒక్కడినే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు.
– పద్మనాభయ్య, చైర్మన్, ఆస్కీ


