
న్యాయ విచారణలో తీర్పులెప్పుడూ బలహీనుల పక్షమే ఉండాలి... నేరానికి బలైనా, నేరం చేసినా! ఆ బలహీనుల వర్గంలో పిల్లలు, మహిళలు ముందుంటారు! అందుకే... హనీమూన్ మర్డర్ మొదలు ఆడవాళ్లు చేసినట్టుగా నమోదవుతున్న ఆ తరహా నేరాల విషయంలో వాటి వెనుకున్న సామాజిక ఒత్తిళ్ల మీద చర్చ జరగాలి.. ఆ వాతావరణాన్నివిశ్లేషించాలని సోషల్ ఇంజినీర్స్, సైకాలజిస్ట్‌లు అంటున్నారు. వాటిని సుప్రీంకోర్ట్ కూడా పరిగణనలోకి తీసుకుంది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు దాన్నుంచితప్పించుకోవడానికి చేసిన నేరాలను ప్రస్తావిస్తూ ఇటీవలే ఓ అభిప్రాయాన్ని వెల్లడించింది.
సమాజంలోని లింగవివక్ష, సామాజిక నిబంధనలు చాలావరకు స్త్రీని పరాయిగా చూస్తూ.. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దూరం చేస్తూ ఆమెను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ అణచివేత, నిస్సహాయతే నేరాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సామాజిక నేపథ్యంతో నేరం చేసిన స్త్రీల విషయంలో కఠినమైన శిక్షలకన్నా సంస్కరణ దృక్పథాన్ని అనుసరించాలని ఉద్ఘాటించింది సుప్రీం కోర్ట్.
ఈ నిర్ణయానికి ప్రధాన నేపథ్యం..
కర్ణాటకకు చెందిన శుభ అనే కాలేజ్ స్టూడెంట్.. తన స్నేహితుడు అరుణ్ వర్మతోపాటు వెంకటేశ్, దినేశ్ అనే ఇంకో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన కాబోయే భర్తను హత్య చేసింది. నిజానికి శుభకు ఆ పెళ్లి ఇష్టంలేదు. అయినా తల్లిదండ్రులు బలవంతపెట్టడంతో ఆ విషయాన్నే తన స్నేహితుడు అరుణ్‌కి చెప్పి, పెద్దలు నిశ్చయించిన ఆ వరుడి హత్యకు కుట్ర పన్నింది. ఈ కేస్ పూర్వపరాలను పరిశీలించిన సుప్రీంకోర్ట్.. ‘లింగవివక్ష, ఏళ్ల నుంచి పాతుకుపోయిన జెండర్ రోల్స్ వంటివన్నీ మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంకెళ్లుగా మారుతూ వారిని అణచివేస్తున్నాయి.
అది వాళ్లలో ధిక్కార ప్రవర్తనకు కారణమవుతోంది. ఫలితంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఆధునిక మహిళలు చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ హక్కును ఆస్వాదించాలనుకుంటున్నారు. ఉదాహరణకు.. చదువుకున్న అమ్మాయి ‘ఆశలు’ అనే రెక్కలు తొడుక్కోవాలనుకుంటుంది. ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటుంది. ఈ క్రమంలో బలవంతపు పెళ్లి తన జీవిత లక్ష్యానికి విడాకులు ఇప్పిస్తుంది.
పై చదువులకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది కచ్చితంగా ప్రతి చర్యకు దారితీస్తుంది. అయితే ఈ రియాక్షన్స్ మహిళ మహిళకు మారుతుంటాయి.. వాళ్ల నేపథ్యం, స్నేహాలను బట్టి. ఉదాహరణకు మధ్యతరగతికి చెందిన అమ్మాయి.. పేదింటి లేదా ధనిక కుటుంబపు అమ్మాయిల కంటే భిన్నంగా రియాక్ట్ కావచ్చు. తీసుకునే నిర్ణయాన్ని అది ప్రభావితం చేయొచ్చు’ అని విశ్లేషించింది.
నేరస్తులు అందరిపట్లా...
స్త్రీలకు సంబంధించి.. నేరానికి ఉసిగొల్పిన సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నేరస్థుల సంస్కరణ దిశగా తీర్పులు ఉండాలన్న సుప్రీంకోర్ట్ అభిప్రాయం హర్షించదగ్గది. అయితే దాదాపుగా నేరాలన్నిటికీ సామాజిక పరిస్థితులే కారణాలుగా ఉంటాయి. నేరస్థుల అందరిపట్లా ఇలాంటి అప్రోచే ఉండాలి. శిక్ష తర్వాత సమాజంలోకి వచ్చిన వాళ్లను సానుకూల దృక్పథంతో చూడాలి. సహానుభూతి ఉండాలి.
– ప్రొఫెసర్ బీనా చింతలపురి
సంస్కరించడమే పరిష్కారం
మన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు.
ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.
– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడు
కారణాలను పరిగణించాలి...
సామాజిక, కుటుంబ ఒత్తిళ్లు మహిళలు/అమ్మాయిల స్వేచ్ఛను అడ్డుకోవడమేకాక వాళ్లను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు నేరాలకు దారితీయొచ్చు. కాబట్టి వారిలో పరివర్తన తీసుకురావడం ఎంత అవసరమో.. ఆ సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని వారికి క్షమాభిక్ష పెట్టడమూ అంతే అవసరమంటూ సుప్రీంకోర్టు చేసిన సిఫార్సు ఆహ్వానించదగినది. అలాగని సుప్రీంకోర్టు నేరాన్ని సమర్థించట్లేదు.
నేరస్థులను చంపితే నేరం చావదని, నేరస్థుల పరివర్తన మీద దృష్టిపెట్టి.. నేర స్వభావానికి కారణమైన సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరానికీ, నిస్సహాయ స్థితిలో ఒక అమ్మాయి చేసిన నేరానికి చాలా తేడా ఉంటుంది. రెండింటిలో శిక్ష ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ, వారిలో తేవాల్సిన పరివర్తన ధోరణి, అలాగే క్షమాభిక్ష పెట్టేప్పుడు పరిగణించాల్సిన అంశాలు వేరేగా ఉండాలి.
– మామిడి సుధేష్ణ, హైకోర్ట్ అడ్వకేట్
సంస్కరించడమే పరిష్కారం
మన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక΄ోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు.
ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.
– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడు