
యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు అధికారిణిగా బ్లేజ్ మెట్రెవెలిని బ్రిటన్ నియమించింది. ఈ సీక్రెట్ ఏజెన్సీ 115 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. చెప్పాలంటే మహిళలు ఎలాంటి క్లిష్టతరమైన పదవులనైనా సునాయసంగా అలకరించగలరు అని ఈ మెట్రెవెలిని నియామకంతో నిరూపితమైంది.
ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న సర్ రిచర్డ్ మూర్ నుంచి మెట్రెవెలి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె 'సీ' అనే కోడ్‌నేమ్‌తో ఈ సీక్రెట్ ఏజెన్సీ M16 చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న అధికారి. అయితే ఆమె ప్రస్తుతం ఇదే సీక్రెట్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ 'Q'గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ అదనపు బాధ్యతలతో పూర్తి కార్యాచరణ బాధ్యతను కలిగి ఉంటారు.
అంతేగాదు ఆమె నేరుగా విదేశాంగా కార్యదర్శికి తన విధులను నివేదిస్తారు. జేమ్స్ బాండ్ చిత్రాలలో చూసే గాడ్జెట్ నిపుణుడి మాదిరిగా మెట్రెవెలి MI6లో సాంకేతికత తోపాటు ఆవిష్కరణలను పర్యవేక్షిస్తారు. ఆమె గతంలో MI5లో సీనియర్ పదవిని నిర్వహించారు. నిజానికి దేశీయ నిఘా సంస్థ MI5లో స్టెల్లా రిమింగ్టన్, ఎలిజా మానింగ్‌హామ్-బుల్లర్ అనే ఇద్దరు మహిళా చీఫ్‌లు ఉండగా, మెట్రెవెలి MI6కు నాయకత్వం వహించనున్న తొలి మహిళ మెట్రెవెలి కావడం విశేషం.
ఈ సందర్భంగా బ్లేజ్ మెట్రెవెలి మాట్లాడుతూ.." నాసర్వీస్‌కు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నందుకు అత్యంత గర్వంగానూ, గౌరవంగానూ ఉంది. ఈ MI6 అనేది MI5, GCHQ లతో పాటు, బ్రిటిష్ ప్రజలను సురక్షితంగా ఉంచడం, విదేశాలలో UK ప్రయోజనాలను ప్రోత్సహించడం వంటి వాటిల్లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. అంతేగాదు మా MI6లో పనిచేసే ధైర్యవంతులైన అధికారులు, ఏజెంట్లు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి సమర్థవంతంగా పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం ". అని వెల్లడించింది మెట్రెవెలి.
బ్లేజ్ మెట్రెవేలి నేపథ్యం..
బ్లేజ్ మెట్రెవేలి కేంబ్రిడ్జ్‌లోని పెంబ్రోక్ కళాశాలలో ఆంత్రోపాలజీని అభ్యసించింది. ఆ తర్వాత 1999లో కేస్ ఆఫీసర్‌గా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (MI6)లో చేరారు. మెట్రెవేలి తన కెరీర్‌లో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్, యూరప్ అంతటా ఆపరేషనల్ పాత్రలలో గడిపారు. ఆమె ఈ MI6లో వివిధ బాధత్యలను నిర్వర్తించారు.
అంతేగాదు యునైటెడ్ కింగ్‌డమ్ దేశీయ నిఘా సేవ అయిన MI5లో డైరెక్టర్ స్థాయి పదవులను కూడా నిర్వర్తించారామె. ఆ తర్వాత MI6లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అలాగే బ్రిటిష్ విదేశాంగ విధానానికి ఆమె చేసిన సేవలకు గాను కింగ్స్ బర్త్‌డే ఆనర్స్‌లో సెయింట్ మైఖేల్, సెయింట్ జార్జ్ (CMG)ల కంపానియన్‌గా కూడా నియమితులయ్యారు.
MI6 అంటే..
MI6, లేదా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనేది UK విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జాతీయ భద్రత తోపాటు విదేశాంగ విధానానికి మద్దుతు ఇచ్చే బాద్యతను కలిగి ఉంది. దీన్ని 1909లో స్థాపించారు. ఈ ఏజెన్సీ ఉగ్రవాదం, సైబర్ దాడులు, శత్రు దేశాల వంటి బెదిరింపులపై దృష్టిపెడుతుంది. ఈ ఎమ్‌ఐ6 చీఫ్‌ని 'సీ' అనే కోడ్ నేమ్‌తో పిలుస్తారు. ఇది దేశీయ ఇంటెలిజెన్స్ నిర్వహించే MI5 వలె కాకుండా MI6 ప్రత్యేకంగా విదేశాలలో పనిచేస్తుంది.
(చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..)