
దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోవడంలో సాంకేతికతది కీలక పాత్ర. అయితే భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగా సాంకేతికత పెరుగుతున్నదో అదే స్థాయిలో మహిళల భాగస్వామ్యం తిరోగమిస్తున్నది. ప్రస్తుతం 35.9 శాతం మించని మహిళా శక్తి భాగస్వామ్యం... 2030 నాటికి 1.9 కోట్ల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి మరింత దిగజారుతుందనేది ఓ అంచనా.
వ్యవసాయ రంగంలోని అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వచ్చేశాయి. కలుపు తీయడానికి, పంట కోతకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ రంగాలతో కలిసి భారత వ్యవసాయ దిగుబడుల విలువ సుమారు రూ. 58.74 లక్షల కోట్లకు చేరింది. సాంకేతికత దేశంలో వ్యవసాయ దిగుబడులను పెంచుతూ... వ్యవసాయ మహిళల జీవనోపాధిని కబళిస్తోంది. ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. విజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఇదో సంక్లిష్ట వ్యవహారం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.
చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
వర్తమాన 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో, రోబోటిక్స్, ఆటోమేషన్, బ్రెయిన్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా, నానో– బయోటెక్నాలజీలు, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పత్తి, సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిణామం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నిమగ్నమైన కోట్లాది పేద, మధ్యతరగతి మహిళల ఉపాధిని హరిస్తోంది.
వ్యవసాయ రంగంతో పోల్చితే, భారత పారిశ్రామిక రంగంలో సాంకేతికత వినియోగం ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో మహిళల భాగస్వామ్యం వేగంగా తగ్గుతోంది. అయితే భారత సేవా రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉంది. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మహిళల సంఖ్య గణనీయం. ఇవ్వాళ సేవారంగం... లింగ వివక్షకు, అసమానతలకు దూరంగా ఉంటూ, ప్రతిభకు పట్టం కడుతోంది. ఈ రంగం ఆధునిక సాంకేతిక విద్యావంతులైన కోట్లాది మహిళలకు ఉద్యోగాలను కల్పించింది.
ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం సాంకేతికతను మాత్రమే కాదు, మహిళల శ్రమశక్తిని, మేధాసంపత్తిని సమానంగా ఇముడ్చుకుంటూ ముందుకు సాగితే లింగ వివక్ష, అసమానత సమసిపోతుందని విధాన నిర్ణేతలు గ్రహించాలి. మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, చిన్న, అతి చిన్న పరిశ్రమలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచడం, మహిళలు తయారు చేసిన వస్తు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం; వనరులు, ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడం వంటి చర్యల వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సులభతరం అవుతుంది. ప్రభుత్వాలు ఈ దిశలో అడుగులు వేయాలి.
మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలువిజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.
-బోగా దీపిక వ్యాసకర్త పరిశోధకురాలు