
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో పూర్తిగా మహిళా సిబ్బందితో తమ తొలి శాఖను ప్రారంభించిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్
దేశంలో ఇది రెండోది, మొదటి ముంబైలో ఉంది
హైదరాబాద్: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ విభాగమైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABSLI), హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పూర్తిగా మహిళలతో నిర్వహించబడే తమ తొలి బ్రాంచ్‌ను ప్రారంభించింది. వృత్తిగతంగా అర్థవంతమైన అవకాశాలు అందించడం, హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు విస్తరించే క్రమంలో మహిళలకు సాధికారత, సమానావకాశాలు కల్పించే దిశగా ఈ శాఖను ప్రారంభించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వ (DEI) లక్ష్యాల సాధనలో ఇది కీలక మైలురాయిలాంటిదని పేర్కొంది. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాది తొలినాళ్లలో ముంబైలోని ములుండ్‌లో పూర్తిగా మహిళా సిబ్బందితో శాఖను ప్రారంభించగా, ఇది రెండోదికావడం విశేషం.
హిమాయత్‌నగర్ శాఖను పూర్తిగా మహిళలు నిర్వహిస్తారు. ఫ్రంట్‌లైన్ సేల్స్ ఉద్యోగిగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన స్థానిక మహిళ దీనికి సారథ్యం వహిస్తున్నారు. ఈ శాఖలో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ రూమ్ కూడా ఉందనీ, శిక్షణ కార్యక్రమాలు, క్లయింట్ సమావేశాలపై దృష్టి పెట్టేందుకు ఇది సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.
“మహిళల సాధికారత ఒక బాధ్యత మాత్రమే కాదు, మా వ్యూహాత్మక ప్రాధాన్యతాంశం కూడా అని ABSLI విశ్వసిస్తుంది. సమతౌల్యతను సాధించేందుకు తోడ్పడుతూ, ఆకాంక్షలను గౌరవించే విధంగా వర్క్‌ప్లేస్‌లను తీర్చిదిద్దడం ద్వారా సమ్మిళిత వృద్ధికి దోహదపడటంలో, మాకున్న నిబద్ధతకు ఈ ఆల్-ఉమెన్ శాఖ ఒక నిదర్శనం. నాయకత్వం వహించేందుకు, వృద్ధిలోకి వచ్చేందుకు, స్ఫూర్తిగా నిల్చేందుకు మహిళలకు దీర్ఘకాలిక అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం” అని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ & సీఈవో Mr. కమ్లేశ్ రావు తెలిపారు.