
‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు ఇవేవీ గుర్తు రావు. ఈ ధిక్కారమే ఒక ఆఫ్ఘన్ బాలుడి (Afghan Boy) సాహసోపేత చర్యకు దారి తీసింది. ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్‌కు వేలాడుతూ ఢిల్లీ దాకా వచ్చేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదమని తెలిసినాసాహసానికి పూనుకున్న 13 ఏళ్ల తెగువ ఇపుడు నెట్టింట చర్చనీయాంశంగా నిలిచింది.
కాబూల్ నుండి ఢిల్లీకి (Kabul-Delhi) కామ్ ఎయిర్‌లైన్స్ విమానంRQ-4401 లో ఆదివారం(సెప్టెంబర్ 22) ఉదయం 11.10 గంటలకు 1.5 గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో దిగిపోయాడు. విమానం కాబూల్ నుండి ఢిల్లీకి గంటన్నర ప్రయాణం పూర్తిచేసుకుని ల్యాండ్ అయిన తరువాత అధికారులు ఈవిషయాన్ని గ్రహించారు. టాక్సీవేపై నడుస్తున్న బాలుడిని గుర్తించి ఎయిర్‌లైన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు విస్తుపోయారు. బాలుడ్ని అదుపులోకి తీసుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సహా భద్రతా సంస్థలకు అప్పగించారు.
కుందూజ్ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు సెక్యూరిటీ కళ్లు గప్పి ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడి విమానం బయలుదేరే ముందు రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్‌లోకి ఎక్కి దాక్కున్నట్టు అంగీకరించాడు. అంతేకాదు విమానం అటు ఇటు కుదుపులకు గురైనప్పటికీ వేలాడుతూ అలాగే ధైర్యంగా ఉండిపోయినట్లు చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చేరాడు. అయితే మైనర్‌బాలుడు కావడంతో ఎలాంటి చర్యలు లేకుండానే మరో విమానంలో తిరిగి కాబూల్‌కు పంపించివేశారు అధికారులు. గడ్డ కట్టే చలి, తీవ్రమైన గాలులు లాంటి వాతావరణం మధ్య ఆ బాలుడు ఎలా తట్టుకున్నాడు? అల్పోష్ణస్థితి , హైపోక్సియా , అధిక ఎత్తులో తక్కువ వాతావరణ పీడనంతో ఎవరైనా చనిపోవాల్సిందే అని కొందరు, ఇది స్టోరీ మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి పారిపోవాల్సి భయానక పరిస్థితులకు అద్దం అని కొందరు వ్యాఖ్యానించారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా “వీల్-వెల్ స్టోవేవే” అని పిలుస్తారు.