ఆగిరిపల్లి: రాజధాని అమరావతి పేరుతో దొడ్డిదారిన గ్రావెల్‌ను అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మండలంలోని ఈదులగూడెం, కల్లుటూరు తాడేపల్లి, చొప్పరమెట్ల సరిహద్దులో ఉన్న కొండ పోరంబోకు గట్టుపై వారం రోజులుగా ఎల్‌అండ్‌టీ సంస్థకు అనుమతులు ఉన్నాయంటూ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. అయితే గ్రావెల్‌ను అమరావతికి తరలించకుండా లారీల్లో వందలాది ట్రిప్పులను సూరంపల్లి సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


