ఉపాధి పనులకు వినతి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులకు వినతి

Aug 18 2026 7:28 AM | Updated on Aug 18 2026 7:28 AM

ఉపాధి పనులకు వినతి డీఈఎల్‌ఈడీ సెమిస్టర్‌ఫలితాల విడుదల 26 నుంచి పవిత్రోత్సవాలు కొనసాగిన జూడాల సమ్మె

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా డ్వామా పీడీ కార్యాలయంలో జిల్లా డ్వామా పీడీ వెంకట సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణా డెల్టాలో ఐదు మండలాలు, ఏలూరు, పెదపాడు, దెందులూరు, భీమడోలు, పెదవేగి మండలాల్లో వ్య వసాయ, ఉపాధి పనులు లేక పేదలు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల కోసం దూరప్రాంతాలకు వలసలు పోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.మహంకాళిరావు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత ఏప్రిల్‌లో నిర్వహించిన డీఈఎల్‌ఈడీ ప్రథమ సెమిస్టర్‌ ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. 2025–27 బ్యాచ్‌కు చెందిన రెగ్యులర్‌ విద్యార్థులు, 2023–25, 2024–26 బ్యాచ్‌లలో ఒకసారి ఫెయిలైన విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 1,795 మందికి 1,599 మంది ఉత్తీర్ణులయ్యారని, ఉత్తీర్ణతా శాతం 89.08గా నమోదైందన్నారు. డమ్మీ మార్కుల మెమోలు బీఎస్‌ఈ ఏపీ వెబ్‌సైట్‌లో ఉంచారన్నారు. మార్కుల రీ కౌటింగ్‌ కోసం అభ్యర్థులు సెప్టెంబర్‌ 1లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీ కౌటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 ఫీజు చెల్లించాలన్నారు.

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఈనెల 26 నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాలను ఈనెల 29 వరకు అత్యంత వైభవంగా జరుపుతామన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రో జుల పాటు పవిత్రోత్సవాలను జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఆలయ అర్చకులు 26న అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. అలాగే 27న పవిత్రాధివాసం, 28న ప విత్రావరోహణ, ఉత్సవాల్లో ఆఖరి రోజైన 29న ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయన్నారు. ఈ నాలుగు రోజులు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఈఓ తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలకు కొంతమేర వైద్యసేవలు అందిస్తున్న జూనియర్‌ డాక్టర్స్‌ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరితో వ్యవహరిస్తూ వారి డిమాండ్లపై చర్యలు తీసుకోవటంలో జాప్యం చేస్తోంది. ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసొసియేషన్‌ (జూడ) రాష్ట్రవ్యాప్త పిలుపుతో ఏలూరు స ర్వజన ఆసుపత్రిలో జూడలు ఆందోళన బాటపట్టారు. జూనియర్‌ డాక్టర్స్‌ చేపట్టిన సమ్మె సోమవారం ఐదో రోజుకు చేరింది. ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌ వద్ద ధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. సాధారణ వైద్య సేవలకు సంబంధించి విధులను బహిష్కరించిన జూడలు, అత్యవసర వైద్య సేవలను అందిస్తూ వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ బోధనాసుపత్రి (జీజీహెచ్‌)లో జూనియర్‌ డాక్టర్లు మాట్లాడుతూ స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలనీ, పదవీ విరమణ వయసు 62కు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement