ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయాంకుల లక్ష్మణరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మార్పు రావాలి.. మార్పు కోరాలి అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గన్ను వెంకట్రావు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పెంచి పంట రుణాలు ఇవ్వాలని, ఎలాంటి హామీలు లేకుండా కౌలు రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 25 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, నాయకులు కె.ఆనందరావు, కూచిపూడి నాగేశ్వరరావు, పంతగాని తిరుపతిరావు, మల్లిపూడి రంగారావు తదితరులు పాల్గొన్నారు.


