ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కుక్కునూరు మండలం అరవపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు తమ సాగు భూముల సేకరణను నిలిపివేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.పోలవరం ప్రాజెక్టు గిరిజన నిర్వాసితులకు ‘భూమికి భూమి’ కింద భూములు అందించేందుకు ప్రభుత్వం అరవపల్లి గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల సేకరణకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ భూములను తమ కుటుంబాలు గత నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్నాయని గిరిజనులు తెలిపారు. ఈ భూమికి సంబంధించి పట్టాదారులుగా గిరినేతరులు ఉన్నారంటూ తమ అనుమతి లేకుండా, ఏజెన్సీ ప్రాంత నిబంధనలకు విరుద్ధంగా ఎలా సేకరిస్తారని వారు ప్రశ్నించారు. భూముల సేకరణపై కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నామని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని భూముల సేకరణ ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్‌ను కోరారు. తమ సాగు భూములను కోల్పోతే జీవనోపాధి దెబ్బతింటుందని, తమ సమస్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.


