ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు అధికారులు అర్జీలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఇది తగదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కారం చూపాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● కామవరపుకోట మండలం సాగిపాడు–వీరంపాలెంకు చెందిన అమృతల గోయమ్మ (దివ్యాంగురాలు) తనకు ఉపాధి కల్పించాలని అర్జీ అందించారు.
● దెందులూరు మండలం కొత్తపల్లి–వేగవరం గ్రామానికి చెందిన వరికూటి మార్తమ్మ తమకు 50 సెంట్లు భూమి ఉందని, తన పేరున ఆన్‌లైన్ చేయించాలని కోరారు.
● టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేటకి చెందిన రేగాళ్ల పుల్లయ్య తమ కొడుకులు, కోడళ్లు కనీసం భోజనం కూడా పెట్టటం లేదని, తాను పంచి ఇచ్చిన ఆస్తిని తన పేరున బదలాయించాలని కోరారు.
● ఏలూరు మండలం మల్కాపురానికి చెందిన జంపన వెంకటనారాయణ తనకు ఎకరా పొలం ఉండగా, ఆన్‌లైన్‌లో 5 సెంట్లు భూమి మాత్రమే చూపిస్తోందని ఫిర్యాదు చేశారు.
● పోలవరం మండలం కొమ్ముగూడెం నివాసి బాదావతు పార్వతి తాను ఐటీడీఏ ద్వారా వసతి వసతి గృహంలో 18 ఏళ్లుగా పనిచేస్తున్నానని, రాత్రిళ్లు విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని అర్జీ అందించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి


