● పేదలను రెచ్చగొడుతున్న టీడీపీ నేత
● పూర్వం ఆక్రమణలను సాకుగా చూపుతున్న వైనం
● చాట్రాయి మండలంలో కలకలం
నూజివీడు: అటవీ భూములను ఆక్రమిస్తే అధికారులు అడ్డుకుంటారనే విషయం తెలిసినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందాలనే లక్ష్యంతో కొందరు టీడీపీ నాయకులు పేదలను రెచ్చగొట్టి అటవీ భూముల ఆక్రమణకు పురికొల్పుతున్నారు. ఇందులో భాగంగా చాట్రాయి మండలం పోలవరం పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకోవడానికి ఈ నెల 3న పేదలు ప్రయత్నించగా, అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకున్నారు. అటవీ భూములను ఆక్రమించడం, అడవిలో చెట్లు నరకడం చట్టరీత్యా నేరం. ఈ ప్రయత్నాలకు పాల్పడే వారిపై అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తుంటారు. ఇవన్నీ తెలిసినా, తమ రాజకీయ మనుగడ కోసం టీడీపీ నాయకులు అమాయక పేదలను రెచ్చగొట్టి అటవీ భూముల్లోకి పంపడంపై నియోజకవర్గ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది.
పేదలను రెచ్చగొట్టి
చాట్రాయి మండలం పోలవరం అటవీ బ్లాక్ ఆర్‌ఎస్ నంబరు 1 పరిధిలో దాదాపు 750 ఎకరాల అటవీ భూమి ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలుండటంతో, పేదలను రెచ్చగొట్టి అటవీ భూములను ఆక్రమించుకునేలా స్థానిక టీడీపీ నాయకుడే ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఒకవైపు పచ్చదనం తగ్గిపోయి ఎల్‌నినో ప్రభావంతో దుష్ఫలితాలను ఎదుర్కొంటున్న తరుణంలో, అడవిలోని చెట్లను నరికించి ఆక్రమించుకోవడానికి ఒక నాయకుడు ముందుండి నడిపించడం పట్ల అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, అడ్డుకున్న అధికారులపైనే లంచాలు తీసుకుంటూ అక్రమణలను ప్రోత్సహిస్తున్నారంటూ ’నిరాధార ఆరోపణలు చేయడం విమర్శలకు తావిస్తోంది.
25 ఏళ్ల క్రితం ఆక్రమణలను సాకుగా చూపుతూ...
పోలవరం అటవీ బ్లాక్‌లో కొంత మేర భూములను దాదాపు 20–25 ఏళ్ల క్రితం చుట్టుపక్కల ప్రాంతాల పేదలు భూపోరాటాల పేరుతో ఆక్రమించుకొని, అందులో మామిడి మొక్కలు పెంచి ఫలసాయం అనుభవిస్తున్నారు. వాటిని సాకుగా చూపుతూ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆక్రమణలకు దిగడం చూస్తుంటే, ఇది పూర్తిగా స్వార్థ రాజకీయాల కోసం, తమ పబ్బం గడుపుకోవడానికేనన్నది స్పష్టమవుతోంది. అప్పట్లో ఆక్రమణలను ఎందుకు అడ్డుకోలేదు? అంటూ ప్రస్తుత అధికారులను నిలదీస్తూ వాగ్వివాదానికి దిగడమే కాకుండా, అధికారులు డబ్బులు తీసుకుని వారి జోలికి వెళ్లడం లేదంటూ తప్పుడు ఆరోపణలు చేశారు.
గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్నందుకేనా...?
పోలవరంనకు చెందిన ఆ టీడీపీ నాయకుడు గతంలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించగా అటవీ శాఖ అధికారులు వాటిని అడ్డుకున్నారు. దీనికి తోడు, మూడు రోజుల క్రితం అనధికారికంగా తమ్మిలేరు జలాశయం లాకులను ఎత్తించి తాను పెంచుతున్న చేపల చెరువును నీటితో నింపుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఇరిగేషన్ ఏఈ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన లస్కర్‌ను పంపి మరుసటి రోజు లాకులను దించేశారు. ఏఈ దృష్టికి తీసుకెళ్లిన వారిలో కొందరు రెండు దశాబ్దాల క్రితమే అటవీ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకొని మామిడి తోటలు పెంచుకుంటున్నవారే కావడం గమనార్హం. వాటిని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకుడే పేదలను రెచ్చగొట్టి అడవి భూముల ఆక్రమణకు పంపడం ఏమిటని మండలంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన ఆక్రమణలకు ప్రస్తుత అధికారులు ఎలా బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


