బుట్టాయగూడెం: భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన గుబ్బల మంగమ్మ తల్లి దర్శనాలను తిరిగి ఆదివారం ప్రారంభించడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారు బందోబస్తు నిర్వహించారు.
కై కలూరు: పెద్దమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్సులు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. ఆదివారం సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మ చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.57,670 ఆదాయం వచ్చిందన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.


