వెలుగు శాఖలో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

వెలుగు శాఖలో ఏం జరుగుతోంది?

Oct 5 2026 1:03 AM | Updated on Oct 5 2026 1:03 AM

● డ్వాక్రా రుణాలపై ఆరోపణలు

● ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్‌

కుక్కునూరు: డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి అండగా నిలవాల్సిన వెలుగు శాఖలో రుణాల మంజూరు, నగదు లావాదేవీలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, వింజరం పంచాయతీ పరిధిలోని సుమారు 20 డ్వాక్రా సంఘాలకు శ్రీనిధి, ఉన్నతి రుణాలు మంజూరు కాకపోవడంపై మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఆశించి రుణాల మంజూరులో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శ్రీనిధి రుణాలలోనూ ఆరోపణలు

మరోవైపు, మర్రిపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాలకు సుమారు ఆరు నెలల క్రితం మంజూరైన శ్రీనిధి రుణాల విషయంలోనూ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఒక్కో గ్రూపునకు రూ. లక్ష చొప్పున రుణం మంజూరై సభ్యుల ఖాతాల్లో నగదు జమ కాగా, అందులో నుంచి రూ. 50 వేల చొప్పున తిరిగి తీసుకున్నట్లు కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలా సుమారు పది మంది నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకున్నారని, విషయం బయటకు పొక్కడంతో తిరిగి వారి ఖాతాల్లోనే జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అసలు ఆయా సంఘాలకు ఎంత రుణం మంజూరైంది? సభ్యుల ఖాతాల్లో ఎంత మొత్తం జమైంది? జమ అయిన నగదులో నుంచి కొంత మొత్తాన్ని ఎందుకు తిరిగి తీసుకున్నారు? అనంతరం అదే మొత్తాన్ని తిరిగి ఖాతాల్లో ఎందుకు జమ చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. రుణం మంజూరైన ప్రతిసారీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోందని పలువురు డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు.

ఆరోపణల్లో వాస్తవమెంత?

డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న రుణ పథకాలపై ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆరోపణల్లో వాస్తవమెంత? రుణాల మంజూరు, నగదు లావాదేవీల్లో నిబంధనలు పాటించారా? అనే అంశాలపై వెలుగు శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని మహిళలు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement