కై కలూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో కూటమి కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు జాజుల సుబ్రహ్మణ్యం, నాయకులు నగుళ్ల రామాంజనేయులు, నాగరాజు(అయ్యప్ప) కై కలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. డీఎన్నార్ వారికి పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదినేపల్లి మండలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బోయిన రామరాజు, నాయకులు పాల్గొన్నారు.
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలుపోసి దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్లశాల వద్ద నైవేద్యాలు సమర్పించారు. నాగబంధాలు, గోకులంలో భక్తులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. సహాయ కమిషనర్ ఆర్.గంగాఽశ్రీదేవి, చైర్మన్ బొంగు రవికుమార్, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షణ చేశారు.
కుక్కునూరు: మండలంలోని వేలేరు గ్రామ శివారులో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 40 లీటర్ల నాటు సారాని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని బూర్గంపాడు నుంచి ఆటో, ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ఈ నాటు సారాని గుర్తించి, రెండు వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వేలేరు గ్రామానికి చెందిన భూక్యా బాలు, బోడ నరసింహలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనుబాబు తెలిపారు. ఏలూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె. నాగ ప్రభు కుమార్ ఆదేశాలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సీహెచ్ అజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వై. ఫణికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
కుక్కునూరు: మండలంలోని లంకాలపల్లి సమీపంలో గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ నుంచి గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఛత్తీస్‌గఢ్‌లోని బలిమెలకు వెళ్తున్న లారీ లంకాలపల్లి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. లారీ నిండా గ్యాస్ సిలిండర్ల లోడ్ ఉండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే గ్యాస్ లీకేజీ కాకపోవడం, ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
భీమవరం అర్బన్: గ్యాస్ లీకై మంటలు వ్యాపించి ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన జల్లా మహాలక్ష్మి (81) నాలుగు రోజుల క్రితం అదే గ్రామంలోని తన పెద్దకూతురు ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఆమె తన ఇంటికి వచ్చి తలుపు తీయగా, అప్పటికే ఇంట్లో గ్యాస్ లీకై ఉండటంతో ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. మహలక్ష్మి చుట్టూ మంటలు అలుముకోవడంతో చుట్టుపక్కల వారు స్పందించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు రక్షించి, బంధువుల సహాయంతో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై వైవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


