ద్వారకాతిరుమల: వర్షాలు కురిశాయి.. వాతావరణం చల్లబడింది.. ఇక ఎండ తీవ్రత తగ్గుతుందని భావించిన తరుణంలో భానుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో కురిసిన వర్షాలతో కాస్త ఉపశమనం లభించినా.. ఆ తర్వాత వాతావరణం తిరిగి వేడెక్కింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా.. వేసవిని తలపించే ఎండలతో జనం అల్లాడుతున్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనానికి వస్తున్న భక్తులకూ ఎండ సెగ తప్పలేదు. ఆదివారం ఉదయం నుంచే ఎండ ప్రభావం కనిపించగా.. మధ్యాహ్నానికి తీవ్రత మరింత పెరిగింది. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక నీడ కోసం పరుగులు తీశారు. ఆలయ పరిసరాల్లోని షెడ్లు, చెట్ల కింద సేదతీరారు. మరికొందరు తలపై వస్త్రాలు కప్పుకుని ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించారు. అమ్మో.. ఇవేం ఎండలు! అని తలలు పట్టుకున్నారు.
ఇప్పటి నుంచే ఆందోళన!
ఎండ వేడి, ఉక్కపోత కారణంగా క్షేత్రానికి వస్తున్న భక్తుల్లో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణ సమయంలోనూ వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుత వర్షాకాలం వేసవి కాలాన్ని తలపిస్తుండటంతో.. రాబోయే శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయోనని భక్తులు, ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.
నిత్యాన్నదాన భవనం వద్ద ఉచిత బస్సు కోసం క్యూ కట్టిన భక్తులు ఇలా..
జంటగోపురాల ప్రాంతంలోని చెప్పుల స్టాండు షెడ్డు కింద సేదతీరుతున్న భక్తులు
చినవెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులకు తప్పని ఎండ సెగ


