ఊరించి.. ఊసురుమనిపించారు ! | - | Sakshi
Sakshi News home page

ఊరించి.. ఊసురుమనిపించారు !

Aug 11 2026 1:36 AM | Updated on Aug 11 2026 1:36 AM

ఊరించి.. ఊసురుమనిపించారు !

కొల్లేరు భూములపై స్వష్టమైన ప్రకటన చేయని సీఎం చంద్రబాబు

టీడీపీకి దీటుగా జనసేన అత్యవసర సమావేశం

సాక్షి టాస్క్‌పోర్స్‌: కొల్లేరు అభయారణ్య భూముల పంపిణీపై స్వష్టమైన హామీని ప్రకటిస్తారని వచ్చిన కొల్లేరు ప్రజలకు చంద్రబాబు మొండిచేయి చూపారు. కలిదిండిలో పట్టాల పంపిణికి సీఎం చంద్రబాబు వస్తున్నారని తెలియగానే చక్కటి ప్రకటన వస్తుందని కొల్లేరు నాయకులు ప్రజలను సభకు తీసుకొచ్చారు. చంద్రబాబు కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పుకొచ్చినా.. గతంలోనూ ఆయనే ఇదే చెప్పారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కొల్లేరు ప్రజలు విరక్తి చెందారు. దీంతో నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కోర్టు పరిధిలో ఉండటం వల్ల చంద్రబాబు హామీ ఇవ్వలేదని చెప్పుకురావడం గమనార్హం.

జనసేన శిబిరంలో ఆగ్రహం : పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు సాయంత్రం టీడీపీ కేడర్‌తో సమావేశం నిర్వహించారు. జనసేన నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి కలిదిండి సమీపంలోని సానారుద్రవరం వద్ద కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక మంది ఆగ్రహంతో మాట్లాడారు. మండలాల్లో జనసేన నాయకులు కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళుతుంటే ఎమ్మెల్యే సూచించిన వ్యక్తి సిఫార్సులు కావాలని చెబుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులను ప్రశ్నిస్తుంటే కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ చెప్పిన తర్వాత జనసేన నేతలు సమావేశమవడం గమనార్హం.

ఆకలితో అలమటిస్తూ.. చంద్రబాబు సభలో ప్రసంగాలు ఆలస్యం కావడంతో వచ్చిన ప్రజలు ఆకలితో అలమటించారు. సీఎం చంద్రబాబు ఉదయం 11.45కు హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దారు కార్యాలయంలో 22ఏ పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. 12.45 గంటలకు వేదికపైకి వచ్చి 2.45 వరకూ ఉన్నారు. సాయంత్రం 4.20 నుంచి 6.10 వరకు కేడర్‌తో మీటింగ్‌ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బొమ్మనబోయిన విజయలక్ష్మీ, వీరమల్లు నరసింహారావు, బలే ఏసురాజు మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం భోజన సమయం కావడంతో వెనుక ఉన్న ప్రజలు అనేక మంది వెళ్లిపోయారు. స్వయంగా రెవెన్యూ వీఆర్వోలు ఇంటికి వెళ్లి సభకు రావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement