పోలవరం రూరల్: పోలవరం మండలంలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో టేకూరు, శివగిరి గ్రామాల మధ్య పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నెల రోజులు క్రితం ఇదే ప్రాంతం నుంచి పెద్ద పులి గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల మీదుగా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి మళ్లీ తిరుగుముఖం పట్టింది. రెండు రోజుల క్రితం బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తూ తిరిగి పాపికొండల అభయారణ్య ప్రాంతంలోకి ప్రవేశించింది. పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతం నుంచి గోదావరి నది వైపు చేరింది. అటవీశాఖాధికారులు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఆదివారం గడ్డపల్లి ప్రాంతం నుంచి జలతారు వాగు ప్రాంతం మీదుగా సంచరించింది. నెల రోజులుగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులను హతమార్చిన విషయం తెలిసిందే. మళ్లీ నది దాటి తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్తుండా లేదా తిరుగుముఖం పడుతుందా? అనేది తెలియడం లేదు. పోలవరం అటవీశాఖ రేంజ్ అధికారి ఎస్‌కే వలీ, సిబ్బంది పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.


